Share News

గాల్లో ‘వలస’ ప్రాణాలు!

ABN , Publish Date - Mar 27 , 2026 | 05:23 AM

పూర్వపు కందుకూరు డివిజన్‌ వలస కార్మికులకు పెట్టింది పేరు! కందుకూరు, కనిగిరితో పాటు నెల్లూరు జిల్లా వింజమూరు ప్రాంతాలకు చెందిన లక్ష మందికి పైగా తెలంగాణలో హైదరాబాద్‌తో పాటు పలు ఇతర పట్టణాల్లో భవన నిర్మాణ కార్మికులుగా ఉపాధి పొందుతున్నారు.

గాల్లో ‘వలస’ ప్రాణాలు!

  • కందుకూరు, కనిగిరి, వింజమూరు ప్రాంతాల నుంచి తెలంగాణకు లక్ష మందికి పైగా ఉపాధి బాట

  • వీరిలో భవన నిర్మాణ కార్మికులే అధికం

  • నిత్యం వందలాది బస్సులు రాకపోకలు

  • భద్రతా ప్రమాణాలు పాటించని ప్రైవేట్‌ ట్రావెల్స్‌

  • ఆర్టీసీ బస్సుల కొరతతో తప్పని ప్రయాణం

కందుకూరు, మార్చి 26(ఆంధ్రజ్యోతి): పూర్వపు కందుకూరు డివిజన్‌ వలస కార్మికులకు పెట్టింది పేరు! కందుకూరు, కనిగిరితో పాటు నెల్లూరు జిల్లా వింజమూరు ప్రాంతాలకు చెందిన లక్ష మందికి పైగా తెలంగాణలో హైదరాబాద్‌తో పాటు పలు ఇతర పట్టణాల్లో భవన నిర్మాణ కార్మికులుగా ఉపాధి పొందుతున్నారు. నాలుగు దశాబ్దాలుగా ఈ ప్రాంతవాసులు జీవనోపాధి కోసం అక్కడకు వలస వెళ్తుంటారు. అక్కడే ఉంటునప్పటికీ.. వారి ఇళ్లు, పొలాలు, కుటుంబ సంబంధాలన్నీ ఇక్కడే ఉండడంతో పండుగలు, శుభకార్యాలకు తరచూ రాకపోకలు సాగిస్తుంటారు. కందుకూరు, కనిగిరితోపాటు పామూరు, ఉదయగిరి, సీఎ్‌సపురం, వింజమూరు, కొండాపురం, ఉలవపాడు, సింగరాయకొండ ప్రాంతాల వారు కూడా పెద్దసంఖ్యలో తమ ప్రాంతాలకు వచ్చి వెళ్తుంటారు. బేల్దారీ కార్మికులతోపాటు ఇంకా ఈ ప్రాంతాలకు చెందిన అనేక మంది సాఫ్ట్‌వేర్‌, ఇతర ఉద్యోగులు హైదరాబాద్‌లో స్ధిరపడ్డారు. వీరికితోడు అనేక మంది రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, బిల్డర్లుగానూ ఉన్నారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఆర్టీసీ సర్వీసులను పెంచకపోతుండటం ప్రైవేటు ట్రావెల్స్‌కు వరంగా మారింది. గత కొన్నేళ్లుగా ప్రైవేటు ట్రావెల్స్‌ ఇబ్బడిముబ్బడిగా పెరగడంతో పాటు ఉన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ నిర్వాహకులు కండీషన్‌లో లేని బస్సులను కూడా నడుతుండటం ప్రయాణికులకు శాపంగా మారింది. పెరిగిన బస్సులకు అనుగుణంగా నైపుణ్యం, క్రమశిక్షణ కలిగిన డ్రైవర్ల ఎంపిక కూడా ఉండడం లేదు. దీంతో లైసెన్స్‌ ఉంటే చాలన్నట్లుగా డ్రైవర్లను తీసుకొని, బస్సులను నడుపుతుండటం కూడా తరచూ జరుగుతున్న ప్రమాదాలకు మరో కారణమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. గతేడాది కాలంలో జరిగిన ప్రమాదాల్లో 90 శాతంపైగా ట్రావెల్స్‌ బస్సులు ఉన్నాయని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ట్రావెల్స్‌లో ఉన్న స్లీపర్‌ సౌకర్యాలు, ప్రయాణం కోసం మరొక ప్రత్యామ్నాయం లేని పరిస్థితుల్లో వాటిని ఆశ్రయించక తప్పని పరిస్థితి నెలకొంది.

నిత్యం వందల మంది రాకపోకలు

ఈ ప్రాంతం నుంచి హైదరాబాద్‌తోపాటు వరంగల్‌, కరీంనగర్‌, నిర్మల్‌, మెదక్‌, నిజామాబాద్‌ ప్రాం తాలకు వందలాది బస్సులు నడుస్తున్నాయి. కందుకూరు డిపో నుంచి హైదరాబాద్‌కు రోజూ 10 బస్సులు నడుస్తుండగా, అంతకు రెండింతలు ప్రైవేటు బస్సులు వెళ్తుంటాయి. కనిగిరి నుంచి ఆర్టీసీ, ప్రైవేటు బస్సులు 40కి పైగా తిరుగుతున్నాయి. పలు గ్రామాల నుంచి కూడా హైదరాబాద్‌, తెలంగాణలోని పలు నగరాలకు సర్వీసులు నడపడం విశేషం.

Updated Date - Mar 27 , 2026 | 05:23 AM