Share News

నా ఖాతాలో 7 లక్షల కోట్లు ఉన్నాయ్‌..!

ABN , Publish Date - Apr 10 , 2026 | 04:38 AM

నా బ్యాంకు ఖాతాలో రూ.7 లక్షల కోట్లు ఉన్నాయి. అంత పెద్ద మొత్తాన్ని డ్రా చేసుకొనేందుకు అవసరమైన కొంత డబ్బు సమకూరిస్తే.. మీకు కూడా అందులో వాటా ఇస్తా...

నా ఖాతాలో 7 లక్షల కోట్లు ఉన్నాయ్‌..!

  • డ్రా చేసేందుకు అవసరమైన కొంత డబ్బు ఇవ్వండి

  • అవి రాగానే మీకూ అందులో వాటా ఇస్తా

  • అమాయకులకు 3 కోట్లకు పైగా వైసీపీ నేత బురిడీ

  • నకిలీ బ్యాంకు స్ట్టేట్‌మెంట్‌, ఆర్‌బీఐ అప్రూవల్‌ సృష్టి

  • అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో హైటెక్‌ మోసం

  • డబ్బులు తిరిగివ్వమంటున్నా.. పట్టించుకోని వైనం

  • పోలీసు ఫిర్యాదుకు సిద్ధమవుతున్న బాధితులు

కళ్యాణదుర్గం, ఏప్రిల్‌ 9(ఆంధ్రజ్యోతి): ‘నా బ్యాంకు ఖాతాలో రూ.7 లక్షల కోట్లు ఉన్నాయి. అంత పెద్ద మొత్తాన్ని డ్రా చేసుకొనేందుకు అవసరమైన కొంత డబ్బు సమకూరిస్తే.. మీకు కూడా అందులో వాటా ఇస్తా!’ అంటూ సరికొత్త హైటెక్‌ మోసంతో అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణానికి చెందిన వైసీపీ నాయకుడు ఒకరు అమాయకులను బురిడీ కొట్టించారు. జనాలను నమ్మించేందుకు నకిలీ బ్యాంకు స్ట్టేట్‌మెంట్‌తో పాటు తన బ్యాంకు ఖాతాకు ఆర్‌బీఐ అప్రూవల్‌ ఉన్నట్లు ఫేక్‌ ధ్రువపత్రం కూడా సృష్టించాడు. ఒకరికి తెలియకుండా మరొకరిని మాయమాటలతో మోసగించి.. దాదాపు 70 మంది నుంచి రూ.3 కోట్ల మేర వసూలు చేసినట్లు తెలుస్తోంది. దాదాపు గత ఏడాది కాలంగా ఈ దందా కొనసాగుతున్నట్లు సమాచారం. చివరకు మోసపోయామని గ్రహించిన బాధితులు.. తమ నుంచి చేబదులు, అప్పుగా తీసుకున్న ఆ డబ్బులను తిరిగి ఇవ్వమని అతడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా.. ఇప్పుడు పట్టించుకోవడం లేదు. దీంతో అతనిపై బాధితులంతా పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు.

మాయ చేసి.. బుట్టలో వేసుకున్నాడిలా..

ఆ వైసీపీ నాయకుడు అమాయకులను బురిడీ కొట్టించేందుకు ఓ ప్రముఖ బ్యాంకుకు సంబంధించిన ఫేక్‌ అకౌంట్‌ను సృష్టించినట్లు తెలుస్తోంది. అందులో రూ.7 లక్షల కోట్లకు పైగా నగదు ఉన్నట్లు ఓ నకిలీ స్టేట్‌మెంట్‌ తయారు చేయించాడు. అంతటితో ఆగకుండా, తనకు ఆర్‌బీఐ కూడా క్లియరెన్స్‌ ఇచ్చిందని ఒక లెటర్‌ను పుట్టించేశాడు. తన ఖాతాలో ఉన్న అంత పెద్ద మొత్తాన్ని డ్రా చేసేందుకు కొంత డబ్బు ఖర్చు అవుతుందని, దాన్ని చేబదులు, అప్పుగా ఇవ్వాలని నమ్మించాడు. తన చేతికి డబ్బులు రాగానే అందులో వాటా ఇస్తానని చెప్పి అమాయకులను బుట్టలో వేసుకున్నాడు. ఇందులో భాగంగా ఆ ఫేక్‌ బ్యాంకు స్టేట్‌మెంట్‌, ఆర్‌బీఐ సర్టిఫికెట్‌ను అందరికీ చూపించాడు. పట్టణంలోని కొంత మంది స్ర్కాప్‌ వ్యాపారులు, ప్రైవేట్‌ ఫైనాన్సర్లు, చిరు వ్యాపారులు.. ఇలా పలువురిని బురిడీ కొట్టించి రూ.3 కోట్లకు పైగా వసూలు చేశాడని సమాచారం. ఏడాది నుంచి ఈ హైటెక్‌ మోసాన్ని కొనసాగిస్తున్నాడు. 70 మంది దాకా ఆయన బాధితులు ఉన్నట్లు తెలుస్తోంది. తీసుకున్న డబ్బుల కోసం వారంతా ఆ వైసీపీ నాయకుడి చుట్టూ రోజూ ప్రదక్షిణ చేస్తున్నారు. అయితే యథేచ్ఛగా బ్యాంక్‌ లోగోతో నకిలీ స్టేట్‌మెంట్‌ తయారు చేసి, దాన్ని అందరికీ చూపించడం, షేర్‌ చేయడం చేస్తున్నా.. ఈ వ్యవహారం సదరు బ్యాంకు అధికారుల దృష్టికి వెళ్లలేదా అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.

Updated Date - Apr 10 , 2026 | 04:38 AM