‘కల్తీ’ వ్యవహారంలో మరో మార్కెటింగ్ ఉద్యోగి సస్పెన్షన్
ABN , Publish Date - Feb 13 , 2026 | 04:28 AM
తిరుమల కల్తీ నెయ్యి కేసును దర్యాప్తు చేసిన సిట్ ఇచ్చిన నివేదికతో మార్కెటింగ్ శాఖకు చెందిన మరో అధికారిపై చర్యలు తీసుకున్నారు...
కావలి మార్కెట్ కమిటీ సహాయ కార్యదర్శి పై చర్యలు
తిరుపతి, ఫిబ్రవరి 12(ఆంధ్రజ్యోతి): తిరుమల కల్తీ నెయ్యి కేసును దర్యాప్తు చేసిన సిట్ ఇచ్చిన నివేదికతో మార్కెటింగ్ శాఖకు చెందిన మరో అధికారిపై చర్యలు తీసుకున్నారు. గతంలో తిరుపతి జిల్లా నాయుడుపేట వ్యవసాయ మార్కెట్ కమిటీలో సహాయ కార్యదర్శిగా పనిచేసిన ఇలియాస్ బాషాను సస్పెండ్ చేశారు. ప్రస్తుతం ఆయన నెల్లూరు జిల్లా కావలి మార్కెట్ కమిటీ సహాయ కార్యదర్శిగా ఉన్నారు. టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా చేసే క్రమంలో వైష్ణవి డెయిరీ పేరిట ట్యాంకర్లకు నాయుడుపేట మార్కెట్ కమిటీ నుంచి పర్మిట్లు జారీ అయ్యాయని, పర్మిట్లు జారీ చేసే క్రమంలో ఇలియాస్ బాషా రూ.10,100 వసూలు చేసినట్టు సిట్ గుర్తించింది. తిరుచానూరు మార్కెట్ కమిటీ చిరుద్యోగి రాధాకృష్ణ నెయ్యి ట్యాంకర్ల నుంచి రూ.3.68 లక్షలు లంచంగా వసూలు చేసిన విషయాన్ని, నాయుడుపేట మార్కెట్ కమిటీలో సహాయ కార్యదర్శి లంచం తీసుకుని పర్మిట్ జారీ చేసిన విషయాన్ని సిట్ నివేదిక ద్వారా తెలిపింది. వారిపై చర్యలు తీసుకోవాలని సిఫారసు చేసింది. ఈ వ్యవహారంలో ఇప్పటికే తిరుచానూరు మార్కెట్ కమిటీ కార్యదర్శి జానకిరామ్‌ను సస్పెండ్ చేసిన ప్రభుత్వం.. ఔట్ సోర్సింగ్ ఉద్యోగి రాధాకృష్ణను తొలగించింది. ఇలియాస్ బాషాపై విచారణకు ఆదేశించింది. తిరుపతి జిల్లా ఏడీ తుంగా సురేంద్రబాబు ద్వారా కడప జాయింట్ డైరెక్టర్ రామాంజనేయులు విచారణ చేపట్టి ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. దాని ఆధారంగా ఇలియాస్ బాషాను సస్పెండ్ చేయడంతో పాటు శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. కాగా, 2019 నుంచీ 2024 వరకూ శ్రీకాళహస్తి, కాణిపాకం ఆలయాలకు జరిగిన నెయ్యి సరఫరా వివరాల కోసం తిరుపతి నుంచి వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారులు ఆయా ఆలయాలకు వెళ్లినట్టు సమాచారం. సంబంధిత వివరాలను రెండు మూడు రోజుల్లో అందజేస్తామని అధికారులు చెప్పినట్టు సమాచారం.