చిక్కుముళ్లకు విముక్తి
ABN , Publish Date - Aug 10 , 2026 | 03:06 AM
ప్రభుత్వం సంకల్పంతో పనిచేస్తే ఎంత పెద్ద చిక్కుముడి అయినా చిన్న పరిష్కారంతో వీడుతుందని ఇటీవలి కాలంలో అనేక ఉదంతాలు నిరూపిస్తున్నాయి. చిత్తూరు జిల్లా కుప్పం, తిరుపతి జిల్లా శెట్టిపల్లి, గుంటూరు జిల్లా..
దశాబ్దాల నాటి భూ సమస్యలకు పరిష్కారం
ఒక్కొక్కటిగా స్వేచ్ఛ కల్పిస్తున్న ప్రభుత్వం
రైతులు, హక్కుదారులకు పూర్తి హక్కులు
కుప్పం, శెట్టిపల్లి, వట్టిచెరుకూరు బాటలోనే కలిదిండి
నిషేధిత జాబితా నుంచి 2 వేల ఎకరాల తొలగింపు
అందులో సింహభాగం అసైన్డ్ భూములే
రెవెన్యూ శాఖ వేర్వేరుగా 2 ఉత్తర్వులు జారీ
నేడు కలిదిండికి ముఖ్యమంత్రి చంద్రబాబు
ఫ్రీ హోల్డ్‌పై త్వరలోనే నిర్ణయం
ఏళ్లు కాదు దశాబ్దాల కాలం నాటి భూ సమస్యల చిక్కుముడులు వీడుతున్నాయి. ఇక పరిష్కారమే కావనుకున్న నివాసిత, సాగు భూములకు విముక్తి లభిస్తోంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వేల ఎకరాల కొద్దీ భూ వివాదాలు ఒక్కొక్కటిగా పరిష్కారమవుతున్నాయి. బాధిత రైతుల కన్నీళ్లు తుడిచేందుకు, హక్కుదారులకు భరోసా ఇచ్చేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
ప్రభుత్వం సంకల్పంతో పనిచేస్తే ఎంత పెద్ద చిక్కుముడి అయినా చిన్న పరిష్కారంతో వీడుతుందని ఇటీవలి కాలంలో అనేక ఉదంతాలు నిరూపిస్తున్నాయి. చిత్తూరు జిల్లా కుప్పం, తిరుపతి జిల్లా శెట్టిపల్లి, గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు గ్రామాల్లో రైతులు, పట్టాదారులు, నివాసితులు ఎదుర్కొంటున్న దశాబ్దాల నాటి భూ వివాదాలకు ప్రభుత్వం ముగింపు పలికింది. కీలక భూములను నిషేఽధిత జాబితా నుంచి తొలగించి రైతులు, పట్టాదారులకు పూర్తి హక్కులు కల్పించింది. ఇప్పుడు ఈ జాబితాలో ఉమ్మడి కృష్ణా జిల్లా కలిదిండి గ్రామం చేరింది. ఆ గ్రామంలో దాదాపు 75 ఏళ్ల నాటి సమస్యకు సర్కారు పరిష్కారం చూపింది. నికరంగా 2044.18 ఎకరాల భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగించింది. ఆదివారం రెవెన్యూ శాఖ ఈ మేరకు రెండు వేర్వేరు ఉత్తర్వులు జారీ చేసింది.
ఇక ఆ భూములపై రైతులు, పట్టాదారులకే సర్వహక్కులు. దీనివల్ల కలిదిండిలో కనీసం 2100 మంది రైతులు, నివాసితులకు మేలు జరగనుందని అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి. కలిదిండి.. ప్రస్తుతం ఏలూరు జిల్లా పరిధిలో ఉంది. ఇక్కడ రెండు రకాల భూ సమస్యలు 75 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయి. ఇందులో ఒకటి.. మాజీ సైనికుల అసోసియేషన్ భూములు. రెండోది.. అసైన్డ్ భూములు. నిజానికి ఈ రెండూ అసైన్డ్ భూముల కేటగిరీలోకి వచ్చేవే అయినా వేర్వేరు చట్టాలు, ఉత్తర్వులతో ముడిపడినవి. వీరవాసం గ్రామానికి చెందిన సత్యనారాయణమూర్తికి కలిదిండి గ్రామంలో 1950లో ప్రభుత్వం 495.67 ఎకరాలు అసైన్ చేసింది. 1950 ఫిబ్రవరి ఏడో తేదీన ఈ మేరకు జీఓ 343 జారీ చేసింది. అప్పుడు ఇది కైకలూరు తాలుకాలో ఉండేది. ఎకరాకు 15 రూపాయల చొప్పున రైతు ప్రభుత్వానికి మొత్తం 8940 రూపాయల ధర కూడా చెల్లించారు. కానీ అసైన్డ్‌చట్టం(పీఓటీ)-1977 రాకముందే ఆ రైతు తన వద్ద ఉన్న భూములను ఇతరులకు విక్రయించారు. కాలక్రమేణా ఈ భూముల లావాదేవీలపై రెవెన్యూ అధికారులకు అనుమానం వచ్చింది. కేవలం ఒక్క రైతుకే 495 ఎకరాలు అసైన్ చేయడం ఏమిటి? మోసం జరిగి ఉంటుందని సందేహించారు. రికార్డులు పూర్తిగా పరిశీలించకుండానే కేవలం అనుమానంతో ఆ భూమిని నిషేధిత జాబితా 22(ఏ)లో చేర్చారు. రెవెన్యూ, వెబ్‌ల్యాండ్ రికార్డుల్లో వాటిని ప్రభుత్వ భూములుగా పేర్కొన్నారు. కానీ అప్పటికే ఆ భూములపై అనేక లావాదేవీలు జరిగాయి. సాగు భూములతో పాటు నివాసాలు కూడా వచ్చాయి. ఈ సమస్యను పరిష్కరించాలని దాదాపు 160 మంది రైతులు ఏళ్లుగా ప్రభుత్వాల చుట్టూ తిరుగుతున్నారు. ఈ సమస్యను కూటమి సర్కారు పరిశీలనకు తీసుకుంది.
1954 ఆగస్టుకు ముందు అసైన్ చేసిన భూములను నిషేఽధిత జాబితా నుంచి తొలగించాలని 2018లోనే జీఓ 575 జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ భూ వివాదాన్ని ఆ జీఓ ఆధారంగా పరిష్కరించాలని రెవెన్యూ శాఖను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఈ నేపథ్యంలో రెవెన్యూ శాఖ ఈ అంశంపై పలు రికార్డులు, ఉత్తర్వులను పరిశీలించింది. ఈ భూముల అసైన్‌మెంట్, ధర చెల్లింపునకు సంబంధించిన ఉత్తర్వులు, రశీదులను ఎట్టకేలకు రికార్డు రూముల్లో కనిపెట్టారు. భూముల అసైన్‌మెంట్ జరిగిన మాట నిజమే అని అధికారులు నిర్ధారించుకున్నారు. దీంతో 495.67 ఎకరాల అసైన్డ్ భూములపై ప్రస్తుతం పట్టాలున్న వారికే సర్వ హక్కులు కల్పిస్తూ, ఆ భూములను నిషేధిత జాబితా 22(ఏ) నుంచి తొలగిస్తూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ ఉత్తర్వులు (జీఓ 508) జారీ చేశారు. సదరు రైతులకు జీఓ 575 ప్రకారం పూర్తి భూమి హక్కులు కల్పిస్తారు. ఇక రైతులు స్వేచ్ఛగా విక్రయ లావాదేవీలు జరుపుకొనేందుకు, ఇతరులకు రిజిస్ట్రేషన్ చేసేందుకు అధికారికంగా వెసులుబాటు కల్పించారు.
మాజీ సైనికుల భూములకూ విముక్తి
కలిదిండిలోనే మాజీ సైనికుల భూ సమస్య కూడా ఏడు దశాబ్దాల నాటిది. 287 మంది మాజీ సైనికులు 1948కి ముందే ల్యాండ్ కాలనైజేషన్ సొసైటీ ఫర్ ఎక్స్ సర్వీస్ మెన్ పేరిట అసోసియేషన్ ఏర్పాటు చేసుకున్నారు. తమ జీవనోపాధికి భూములు కేటాయించాలని నాడు ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం 1948లో జీఓ 1401, 1949లో జీఓ 3535 ఆధారంగా ఆ అసోసియేషన్ పేరిట కలిదిండి గ్రామంలో 1899 ఎకరాలు అసైన్ చేసింది. 1972లో ఒక మెమో ద్వారా ప్రభుత్వం ఈ భూముల కేటాయింపుపై మరో ఆదేశం ఇచ్చింది. సొసైటీకి ఇచ్చిన భూముల్లో నుంచి సగటున ఒక్కొక్కరి పేరిట 5 ఎకరాల భూమికి పట్టాలు ఇవ్వాలని స్పష్టత ఇచ్చింది. ఈ మేరకు నాటి కైకలూరు తహశీల్దార్ మొత్తం 1548.51 ఎకరాల భూములపై అసోసియేషన్‌లో సభ్యులుగా ఉన్న మాజీ సైనికులకు డీ పట్టాలు మంజూరు చేశారు. 1983లో ఈ భూ కేటాయింపులను నిర్ధారిస్తూ ప్రభుత్వం మరో జీఓ 1503 జారీ చేసింది. కాలక్రమేణా చాలా మంది మాజీ సైనికులు తమ అవసరాల కోసం భూములు అమ్మేసుకున్నారు. అనేక లావాదేవీలు జరిగాయి. కొందరు మాజీ సైనికుల వారసుల కుటుంబాలు ఆ భూముల్లోనే ఇంకా పొజిషన్‌లో ఉన్నాయి. తమ పేరిట హక్కులు ఇవ్వాలని వారు కోరుతున్నారు. మాజీ సైనికుల నుంచి భూములు కొన్నవారి పరిస్థితి సంక్లిష్టంగా మారింది. 1977లో వచ్చిన పీఓటీ చట్టం ప్రకారం ఆ కొనుగోళ్లు చెల్లడం లేదు. సొసైటీకి చెందిన భూములను 2008లో పూర్తిగా నిషేఽధిత జాబితాలో చేర్చారు. ఈ సమస్యకు పరిష్కారం చూపాలని మాజీ సైనికుల కుటుంబాలు, వారి నుంచి భూములు కొనుగోలు చేసిన ప్రైవేటు వ్యక్తులు కోరుతున్నారు. మాజీ సైనికులకు భూములు అసైన్ చేసిన 10 ఏళ్ల తర్వాత పూర్తి హక్కులు ఇవ్వాలని 2018లో ప్రభుత్వం జారీ చేసిన జీఓ 575 చెబుతోంది. కనీసం ఈ జీఓ ప్రకార మైనా తాము కొనుగోలు చేసిన భూములపై పూర్తి హక్కులు కల్పించాలని రైతులు కోరుతున్నారు.
ప్రభుత్వం నిర్వహించిన రెవెన్యూ గ్రామసభలో దాదాపు 1900 మంది రైతులు ఈ సమస్య పరిష్కారం కోరుతూ పిటిషన్లు ఇచ్చారు. ఈ సమస్యను పరిగణనలోకి తీసుకొని రెవెన్యూ శాఖ రికార్డులు, ఉత్తర్వులను పరిశీలన చేసింది. జీఓ 575 ఆధారంగా ఆ భూములను 22(ఏ) నుంచి తొలగించాలని ముఖ్యమంత్రి రెవెన్యూ శాఖను ఆదేశించారు. ఈ నేపఽథ్యంలో మాజీ సైనికుల కుటుంబాల పొజిషన్‌లో ఉన్న భూములు, ఇతర రైతులు కొన్న సొసైటీ భూములు మొత్తంగా 1548.51 ఎకరాలకు విముక్తి లభించింది. 22(ఏ) నుంచి తొలగిస్తూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ ఉత్తర్వులు (జీఓ 509) జారీ చేశారు. వెంటనే నిషేధిత జాబితా నుంచి తొలగించాలని రిజిస్ట్రేషన్ శాఖ ఐజీని ప్రభుత్వం ఆదేశించింది. ఈ భూములకు సంబంధించి జీఓ 509 ఆధారంగా తగిన చర్యలు తీసుకోవాలని భూ పరిపాలనా ప్రధాన కమిషనర్ (సీసీఎల్‌ఏ)కు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.
ఫ్రీహోల్డ్‌పై త్వరలో నిర్ణయం
అసైన్డ్ చట్టం-1977 ప్రకారం 20 సంవత్సరాల గడువు తీరిన భూములకు నిషేధ విముక్తి కల్పించే (ఫ్రీ హోల్డ్) అంశంపై ఇంకా సర్కారు తుది నిర్ణయం తీసుకోలేదు. ఆ భూముల రిజిస్ట్రేషన్లను నిలుపుదల చేస్తూ ఇచ్చిన ఉత్తర్వుల గడువు సోమవారంతో ముగియనుంది. ఈలోగానే ప్రభుత్వం ఫ్రీ హోల్డ్ భూములపై నిర్ణయం తీసుకుంటుందన్న చర్చలు, ఊహాగానాలు సాగాయి. కానీ దీనిపై రెవెన్యూ శాఖ అధికారిక నిర్ణయం తీసుకోలేదని తెలిసింది. సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు కలిదిండి పర్యటన ఉంది. ఈ నేపఽథ్యంలో అక్కడే సమావేశమై ఈ అంశంపై చర్చించాలని మంత్రి అనగాని సత్యప్రసాద్ అధికారులకు సూచించినట్లు తె లిసింది. జీఓ 596 ప్రకారం నిషేధ విముక్తికి అర్హతగల భూములు దాదాపు 7 లక్షల ఎకరాలున్నాయి. వీటికి తోడు కొత్తగా మరో 65 వేల ఎకరాలు ఈ జాబితాలో చేరాయి. నిబంధనల ప్రకారం ఫ్రీ హోల్డ్‌కు అర్హత ఉన్న భూములను సెటిల్ చేయాలని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం గతంలోనే సీఎంకు నివేదిక ఇచ్చింది. దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ వారం వ్యవధిలోనే అన్ని రకాల ఫ్రీ హోల్డ్ భూములకు గ్రీన్‌సిగ్నల్ ఇస్తూ రెవెన్యూ శాఖతో అధికారిక ఉత్తర్వులు ఇప్పించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. 14వ తేదీలోగా మార్గదర్శకాలు జారీ చేసే అవకాశం ఉందని అధికారవర్గాల ద్వారా తెలిసింది.