జగన్ ఫ్యామిలీది 3 తరాల నేర సామ్రాజ్యం
ABN , Publish Date - May 25 , 2026 | 05:26 AM
జగన్ కుటుంబానిది ఆరు దశాబ్దాల రక్తచరిత్ర, మూడుతరాల నేర సామ్రాజ్యమని ప్రభుత్వ విప్, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు విమర్శించారు.
ఇలాగే లక్షల కోట్లు సంపాదించారు
నాటి పాలెగాళ్ల రాజ్యం పుస్తకంలో జగన్ నేర చరిత్రా ఉంది: కాలవ
అనంతపురం క్రైం, మే24(ఆంధ్రజ్యోతి): జగన్ కుటుంబానిది ఆరు దశాబ్దాల రక్తచరిత్ర, మూడుతరాల నేర సామ్రాజ్యమని ప్రభుత్వ విప్, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు విమర్శించారు. ఇలా లక్షల కోట్లు సంపాదించారని ఆరోపించారు. పరిటాల రవిని హత్య చేసిన మొద్దు శీనును జగన్ డైరెక్షన్‌లో జైల్లోనే అంతమొందించారని, ఆ హత్యానేరాన్ని తనపై మోపేందుకు ప్రయత్నించారని ఆదివారం అనంతపురంలో తెలిపారు. ‘1970లో క్రైం నంబర్ 23/70 కింద జగన్ తాత రాజారెడ్డిపై పంచాయతీ ఎన్నికల వేళ కేసు నమోదైంది. 1972లో అక్టోబరు 11న కోడుమూరు పోలీసుస్టేషన్‌పై దాడి చేశారు. 1975 జులై 15న ముగ్గురాయి గని యజమాని వెంకటనరసయ్యను చంపేశారు. రాజారెడ్డి, జార్జిరెడ్డితోపాటు మరో 63 మంది కలిపి ఈ హత్యానేరంలో పాల్గొన్నారు. 1990లో పులివెందుల నగరగుట్ట ఎరుకల కాలనీపై రాజారెడ్డి 200 మందితో వెళ్లి దొమ్మీకి పాల్పడ్డారు. 16 లక్షల నగదు, నగలు దోచుకెళ్లారు. డబ్బుల కోసం హత్యలు, దొమ్మీలు చేసే నీచచరిత్ర వారిది. పోలీసులపై, పోలీస్టేషన్లపై దాడులు చేసే సంస్కృతి రాజారెడ్డి, వైఎస్, జగన్‌లకు ఉంది. వీరి నేరాలు, దౌర్జన్యాలు, నేరచరిత్ర పులివెందుల నుంచి హైదరాబాద్ వరకూ విస్తరించింది. వైఎస్ ఎన్నోసార్లు ఎన్నికల్లో దాడులు చేయించారు. జగన్ ఐదారు జీపుల్లో సింహాద్రిపురం పోలీసుస్టేషన్‌పైకి వెళ్లి రౌడీలతో దౌర్జన్యం చేయించి ఎస్‌ఐపై దాడి చేశారు. కడపలో పాలెగాళ్ల రాజ్యం అనే పౌరహక్కుల సంఘం వేసిన పుస్తకంలో వైఎస్ జగన్ నేర చరిత్ర ఉంది. రాజకీయాల్లో ముఠా కక్షలు ప్రోత్సహించింది రాజశేఖర్‌రెడ్డే. 2004లో సీఎం అయిన తర్వాత అనంతపురం జిల్లాలో పరిటాల రవి సహా 56 మంది టీడీపీ కార్యకర్తలను కాంగ్రెస్ గూండాలు హత్య చేశారు. కూడేరులో శ్రీనివాసులు అనే వ్యక్తిని పెట్రోల్ పోసి తగలబెట్టారు. 11 సీట్లకే పరిమితమైనా రప్పా... రప్పా అంటూ మాట్లాడుతుండడం నేటికీ మార్పు రాలేదనడానికి నిదర్శనం. మూడు తరాల నేర చరిత్రతో లక్షల కోట్లు సంపాదించిన చరిత్ర జగన్ కుటుంబానిది’ అని మండిపడ్డారు.