కళారత్న కేసీ కల్కూర..
ABN , Publish Date - Mar 18 , 2026 | 01:03 AM
రాష్ట్ర ప్రభుత్వం తెలుగు నూతన సంవత్సరాది (ఉగాది)రోజున కళ, సామాజిక సేవ, సాహిత్యం, సంగీతం, గాత్రం తదితర రంగాల్లో అందించే ప్రతిష్టాత్మక కళారత్న(హంస), ఉగాది పురస్కారాలను మంగళవారం ప్రకటించింది.
రాష్ట్ర అత్యున్నత పురస్కారానికి గాంధేయ వాది ఎంపిక
ఉమ్మడి జిల్లా నుంచి ఏడుగురికి ఉగాది పురస్కారాలు
ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం
కర్నూలు కల్చరల్, మార్చి 17 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం తెలుగు నూతన సంవత్సరాది (ఉగాది)రోజున కళ, సామాజిక సేవ, సాహిత్యం, సంగీతం, గాత్రం తదితర రంగాల్లో అందించే ప్రతిష్టాత్మక కళారత్న(హంస), ఉగాది పురస్కారాలను మంగళవారం ప్రకటించింది. కాగా ఉమ్మడి జిల్లాలో కర్నూలు నుంచి సామాజిక సేవకుడు, గాంధేయవాది, గాడిచర్ల ఫౌండేషన రాష్ట్ర అధ్యక్షుడు కేసీ కల్కూర కళారత్న పురస్కారానికి ఎంపికయ్యారు. అదేవిధంగా నంద్యాల జిల్లా కేంద్రం నుంచి సాహిత్యంలో వైష్ణవ వెంకట రమణమూర్తి ఎంపికయ్యారు. అలాగే రాష్ట్రస్థాయి ఉగాది పురస్కారాలకు ఉమ్మడి కర్నూలు నుంచి ఏడుగురు ఎంపికయ్యారు. సేవారంగంలో శ్రీఅరుణ భారతీ సాంస్కృతిక సాహితీ సంస్థ వ్యవస్థాపకులు బీసీ రాజారెడ్డి, సాహిత్యం నుంచి ప్రముఖ కవి, రచయిత గద్వాల సోమన్న, డాక్టర్ వైష్ణవ వెంకట రమణమూర్తి, క్లాసికల్ సంగీతంలో విశ్వనాథ్ రామయ్యార్, నాటక రంగంలో నీలం ఓంకార స్వామి, మినేచర్ (సూక్ష్మ చిత్రాల రూపకల్పన)లో మాచాని శివకేశవ్, సోషల్ మీడియా ఇనఫ్లూయన్సర్ విభాగంలో శ్రీకాంత ఎంపికయ్యారు. ఈ పురస్కారానికి ఎంపిక చేశారు. ఈనెల 19న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా, విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించే రాష్ట్ర ప్రభుత్వ ఉగాది వేడుకల్లో ఈ పురస్కారాలు అందజేయనున్నారు.
ఫ గాంధేయ మార్గంలో కురాడి చంద్రశేఖర కల్కూర
కర్నూలులో స్థిర నివాసం ఉంటున్న కేసీ కల్కూర గాంధేయ వాదిగా అందరికీ సుపరిచితుడు. 1940 జూన 20 కర్ణాటకలోని ఉడిపి జిల్లా కురాడిలో కె.నారాయణ కల్కూర, లక్ష్మిదేవికి జన్మించిన ఆయన ఉపాధి నిమిత్తం యువకునిగా కర్నూలుకు చేరుకున్నారు. హోటల్‌లో పనిచేస్తూనే మూడు హోటళ్లకు యజమానిగా ఎదిగారు. బీఎల్ పూర్తిచేసి న్యాయవాదిగానూ కొంతకాలం పనిచేశారు. జిల్లా గ్రంథాలయ సంస్థకు రెండు పర్యాయాలు ఛైర్మనగా సేవలు అందించారు. అదే సమయంలో ఆయన గాడిచర్ల హరి సర్వోత్తమరావు జీవితంపట్ల ఆకర్షితులై గాడిచర్ల ఫౌండేషన నెలకొల్పి రాష్ట్ర వ్యాప్తంగా గ్రంథాలయాల పురోభివృద్ధికి అనేక కార్యక్రమాలు కొనసాగించారు. తెలుగు భాషా వికాస ఉద్యమం సంస్థ ఏర్పాటు చేసి పాతికేళ్లకు పైగా రాష్ట్ర వ్యాప్తంగా భాషాభివృద్ధికి కృషి చేశారు. జాతీయ సాహితీ సంస్థ ద్వారా వారం వారం సాహిత్య కార్యక్రమాలు కొనసాగిస్తూ అనేక మంది రచయితలు, కవులను పరిచయం చేస్తన్నారు. పంచలింగాలలో రూ.50 లక్షలు విలువ చేసే భూమిని కమ్యూనిటీ ఇరిగేషన స్కీమ్ (సామూహిక ఎత్తిపోతల పథకం)కు తన తల్లి కల్కూర లక్ష్మిదేవమ్మ స్మారకార్థం విరాళంగా ఇచ్చి 1200 ఎకరాలకు సాగునీరు అందించే ఏర్పాటు చేశారు. 1992లో ఉడిపి శ్రీకృష్ణ మఠం నుంచీ శ్రీకృష్ణ సేవానుగ్రహ ప్రశస్తి అవార్డు, 2005లో పద్మశ్రీ కల్లూరు సుబ్బారావు అవార్డు, 2010లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం నుంచీ అయ్యంకి వెంకట రమణయ్య కీర్తి పురస్కారం అందుకున్నారు. అలాగే అఖిల భారత మాధ్వ మహా మండలి నుంచి మధ్వతత్వ విశారద బిరుదు పొందారు. నేటికీ తన 86 ఏళ్ల ప్రాయంలోనూ సామాజిక సేవలు, సాహిత్యం పట్ల ఎంతో ఉత్సాహం చూపించే కేసీ కల్కూరను నడిచే నిఘంటువుగానూ సాహిత్యాభిమానులు పేర్కొంటారు.
సమాజ సేవకుడు బీసీ రాజారెడ్డి : బనగానపల్లె పట్టణానికి చెందిన బీసీ రాజారెడ్డికి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సమాజ సేవకుడిగా మంచి పేరుంది. ఈయన గతంలో బనగానపల్లెకు సర్పంచగా సేవలందించి ఉత్తమ పంచాయితీగా తీర్చిదిద్దారు. అదేవిధంగా శ్రీ అరుణ భారతీ సాంస్కృతిక సాహితీ సంస్థను స్థాపించి సేవలందిస్తున్నారు. 34 ఏళ్లుగా అనేక సేవా కార్యక్రమాలు చేసి పేదలకు అండగా నిలిచారు. అనేక నాటక ప్రదర్శనలు నిర్వహించారు. ప్రతి ఏడాది పేద విద్యార్థులకు దుస్తులు పంపిణీ చేయడంతో పాటు అంధులకు ప్రతి నెల సొంత నిధులతో పింఛన్లను పంపిణీ చేస్తున్నారు. ప్రతి ఏటా రూ.4 లక్షల నగదు ప్రోత్సాహక బహుమతులు ప్రదానం చేస్తూ విద్యార్థులను ప్రోత్సాహిస్తున్నారు. అనేక ప్రాంతాల్లో ఉచితంగా తాగునీటి మినరల్ వాటర్ ప్లాంట్‌లు ఏర్పాటు దాహార్తిని తీర్చారు. ఆయనకు ఉగాది పురుస్కారం ప్రకటించడంపై పలువురు అభినందనలు తెలియజేశారు.
వైష్ణవ వెంకట రమణమూర్తి : నంద్యాల జిల్లా కేంద్రంలో నివసిస్తున్న డాక్టర్ వైష్ణవ వెంకట రమణమూర్తి బేతంచర్ల మండలం ఎంబాయి గ్రామంలో జన్మించారు. విద్వాన, ఎంఏ, ఎంఫిల్, పీహెచడ్ చేసి తెలుగు పండితులుగా ప్రభుత్వ ఉద్యోగంలో ప్రవేశించిన ఆయన తెలుగు సాహిత్యంపై మమకారం పెంచుకున్నారు. శ్రీ నిర్వచన మహాభక్త విజయాను శీలనము అనే అంశంపై ఎంఫిల్ చేశారు. కర్నూలు జిల్లాలో వైష్ణవ ఆలయాల సాహిత్యం అనే అంశంపై పీహెచడీ పరిశోధన గ్రంథం సమర్పించి డాక్టరేట్ పొందారు. సాహిత్యాభిమాని అయిన ఆయన నంద్యాలలో పరవస్తు చిన్నయ్యసూరి సాహితీ సమితిని స్థాపించి, వ్యవస్థాపక అధ్యక్షుడిగా కొనసాగుతూ అనేక సాహిత్య కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీ వేంకటేశ్వర శతకం, కీర్తిశేషునికి స్మృత్యంజలి, రమణీయ కవన మంజరి, శ్రీరామతీర్థ స్థల పురాణంతోపాటూ నాలుగైదు పరిశోధన గ్రంథాలు రాశారు.
గద్వాల సోమన్న : రాష్ట్రస్థాయి ఉగాది పురస్కారానికి ఎంపికైన బహు గ్రంథకర్త గద్వాల సోమన్న ప్రస్తుతం నందవరం మండలం, నాగులదిన్నె జడ్పీ హైస్కూల్‌లో గణిత ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక ఉగాది పురస్కారానికి ఎంపికైన గద్వాల సోమన్నను పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అద్దేపల్లి జాన్సన, తోటి ఉపాధ్యాయులు, సాహిత్యాభిమానులు అభినందించారు.
అబ్బాయి శ్రీకాంత: నంద్యాలకు చెందిన సోషల్ మీడియా ఇనప్లుయెన్సర్ అబ్బాయి శ్రీకాంత ఇనస్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్‌బుక్, ట్విట్టర్ తదితర ఫ్లాట్‌ఫాంల ద్వారా సోషల్ మీడియాలో తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకున్నారు. వివిధ రకాల వీడియోలు చేసి ప్రత్యేక గుర్తింపు పొందారు. ఇదే క్రమంలో ఎక్కువమంది ఫాలోవర్స్‌ను పొందారు. సదరు యువకుడు ఎక్కువుగా సామాజిక సేవ, వివిధ అంశాలపై అవగాహనతో పాటు ఆసక్తి కల్పించే వీడియోలతో ప్రజలను చైతన్యపరుస్తుంటారు. ప్రధానంగా పాతబావులు, ఆలయాలు పరిసరాలను శుభ్రం చేసే వీడియోలను చేశారు.