ప్రైవేట్ భూముల సేకరణతో దోపిడీ
ABN , Publish Date - Jun 03 , 2026 | 05:10 AM
కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో టీడీఆర్ బాండ్ల జారీలో భారీ కుంభకోణానికి పాల్పడ్డారని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం విచారణలో వెల్లడైంది.
కాకినాడ టీడీఆర్ బాండ్లలో అక్రమాలు
రూ.15 వేల భూమికి రూ.లక్ష బాండ్లు జారీ
అమరావతి, జూన్ 2(ఆంధ్రజ్యోతి): కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో టీడీఆర్ బాండ్ల జారీలో భారీ కుంభకోణానికి పాల్పడ్డారని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం విచారణలో వెల్లడైంది. తమకు కావాల్సిన వ్యక్తుల నుంచి మాత్రమే భూములు తీసుకొని, దానికి ప్రతిఫలంగా వారికి రూ.కోట్ల విలువైన టీడీఆర్ బాండ్లు జారీ చేసినట్లు నిర్ధారణ అయింది. ఈమేరకు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విచారణ నివేదిక ప్రభుత్వానికి చేరింది. విద్యుత్ సబ్‌స్టేషన్, ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణ ప్లాంట్ల ఏర్పాటుకు చేపట్టిన భూసేకరణలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని నివేదికలో ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ భూములు అందుబాటులో ఉన్నప్పటికీ వాటిని వినియోగించకుండా ప్రైవేట్ భూములను ఎంపిక చేసి, వాటికి భారీ రేట్లు నిర్ధారించినట్లు ఆరోపణలొచ్చాయి. ఈ ప్రక్రియలో అప్పటి మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ ప్రభావం ఉన్న వ్యక్తుల పాత్రపై కూడా విచారణ సాగినట్లు సమాచారం. ఫిర్యాదుదారుల వాదన ప్రకారం లేఅవుట్‌గా కూడా అభివృద్ధి చెందని భూములకు చదరపు గజానికి సుమారు రూ.లక్ష ధర నిర్ణయించి టీడీఆర్ బాండ్లు జారీ చేశారని, అయితే ఈ ప్రాంతంలో మార్కెట్ విలువ రూ.15వేలు మాత్రమేనని పేర్కొన్నారు. 132/33 కేవీ ఈహెచ్‌టీ సబ్‌స్టేషన్, ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రం, ద్రవవ్యర్థాల శుద్ధి కేంద్రాల కోసం భూముల ఎంపికలో కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దుమ్ములపేట పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వ భూములు అందుబాటులో ఉన్నప్పటికీ, ప్రైవేట్ భూములను ఎంపిక చేయడంపై అధికారులు ఆరా తీశారు. నివేదిక అంశాలపై శాఖాపరమైన చర్యలు, తదుపరి దర్యాప్తుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.