Share News

ఆస్తి కొట్టేసే ప్లాన్‌!

ABN , Publish Date - Aug 26 , 2026 | 05:19 AM

పిఠాపురం ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసుకు సంబంధించి కాకినాడ సర్పవరం పోలీసులు కోర్టుకు సమర్పించిన రిమాండ్‌ రిపోర్టులో సంచలన విషయాలు వెల్లడించారు. ఆస్తి కోట్టేసే ప్లాన్‌తోనే సాదిక్‌ నూకరాజు కుటుంబంతో పరిచయం.

ఆస్తి కొట్టేసే ప్లాన్‌!

  • అందుకే నూకరాజు కుటుంబంతో పరిచయం.. సౌజన్యతో బంధం

  • జగదీశ్వర్‌రెడ్డిపై పలుమార్లు దాడి.. విషప్రయోగం!

  • సాదిక్‌ రిమాండ్‌ రిపోర్టులో సంచలన విషయాలు

(కాకినాడ-ఆంధ్రజ్యోతి)

పిఠాపురం ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసుకు సంబంధించి కాకినాడ సర్పవరం పోలీసులు కోర్టుకు సమర్పించిన రిమాండ్‌ రిపోర్టులో సంచలన విషయాలు వెల్లడించారు. ఆస్తి కోట్టేసే ప్లాన్‌తోనే సాదిక్‌ నూకరాజు కుటుంబంతో పరిచయం పెంచుకున్నాడని, సౌజన్యతో సన్నిహితంగా మెలిగాడని పేర్కొన్నారు. 2013 నుంచి కాకినాడలో స్థిరపడిన సాదిక్‌ స్థానిక గొడారిగుంటలో ప్రో షూటింగ్‌ అకాడమీ నిర్వహిస్తున్నాడు. 2024 మార్చిలో నూకరాజు మనవడు రియాన్స్‌ కార్తికేయరెడ్డి ఇతడి వద్దకు రైఫిల్‌ షూటింగ్‌ నేర్చుకునేందుకు చేరాడు. అప్పటి నుంచి సాదిక్‌ ఆ కుటుంబంతో పరిచయం పెంచుకున్నాడు. సౌజన్య భర్త జగదీశ్వరరెడ్డి ఏదైనా పనిపై బయటకు వెళ్లడం, బాలుడు కూడా స్కూల్‌కు వెళ్లడం గమనించి సాదిక్‌ వారి ఇంటికి తరచూ వెళ్లి వచ్చేవాడు. సౌజన్యతో సన్నిహితంగా మెలిగాడు. నిందితుడు మొదటి నుంచి వారి ఆస్తి కొట్టేయాలనే ఆలోచనతో ఉండేవాడని, సౌజన్యతో అక్రమ సంబంధం పెట్టుకుని, జగదీశ్వరరెడ్డిని అడ్డు తొలగించడం ద్వారా సౌజన్యను పెళ్లి చేసుకుని, ఆమె పేరున ఉన్న బంగారం, డబ్బు, బ్యాంకు అకౌంట్లు, ఆస్తి పత్రాలను సొంతం చేసుకోవాలని పథకం వేశాడని రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నారు. ఫిబ్రవరి 14న సాదిక్‌ జగదీశ్వరరెడ్డి ఇంటికి వచ్చి అతడితో గొడవపడ్డాడు. అడ్డొచ్చిన సౌజన్యపై దాడి చేశాడు. ఆ తర్వాత కత్తితో జగదీశ్‌పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ఎవరికైనా చెబితే మీ కుటుంబం మొత్తాన్ని చంపేస్తాని సాదిక్‌ బెదిరించినట్లు పేర్కొన్నారు.

మీ వాళ్లందరినీ చంపేస్తా!

ఆ తర్వాత కూడా సాదిక్‌ వేధింపులు ఆపలేదు. జగదీశ్వరరెడ్డిని చాలాసార్లు కొట్టాడని, తిండి పెట్టకుండా వేధించాడని సాక్షులు వాంగ్మూలం ఇచ్చారు. జగదీశ్‌కు విషపూరితమైన ఇంజక్షన్లు, మందులు ఇచ్చినట్టుగా సమాచారం. ‘నీ భార్య, కొడుకు, అత్తమామను చంపేస్తాను’ అంటూ సాదిక్‌ బెదిరించడంతో జగదీశ్వరరెడ్డి భయంతో ఎవరికీ చెప్పుకోలేకపోయాడు. ఈ దాడులు, ఇంజెక్షన్ల కారణంగానే జగదీశ్వరరెడ్డి ఆరోగ్యం క్షీణించి నడవలేని స్థితికి వచ్చినట్టు రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నారు. జగదీశ్వరరెడ్డి ఈ ఏడాది జూలై 2న హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆ సమయంలో సాదిక్‌ హైదరాబాద్‌లోనే ఉండి సౌజన్యతో ఫోన్‌ మాట్లాడాడని కాల్‌డేటా ద్వారా తేలింది. వైద్యరికార్డులు, ఫోరెన్సిక్‌ నివేదికల కోసం పోలీసులు ఎదురుచూస్తున్నారు. కాగా, జగదీశ్వరరెడ్డి మరణానంతరం నూకరాజు కుటుంబంపై సాదిక్‌ పెత్తనం మరింత పెరిగింది. సౌజన్య, ఆమె కొడుకు, తల్లిదండ్రులను పూర్తిగా తన నియంత్రణలో ఉంచుకున్నాడు. వారిని వేరే ఇంట్లో ఉండమని బలవంతం చేశాడు. ‘‘మాట వినకపోతే చంపేస్తా’’ అని బెదిరించేవాడు. సౌజన్య మెడలో బంగారం, ఇంట్లో నగదు, బ్యాంకు అకౌంట్లు, ఎస్‌బీఐ లాకర్‌లో ఉన్న బంగారం, ఇంటి ఆస్తిపత్రాలు లాక్కోవడానికి ప్రయత్నించాడు. సాక్షి ఎల్‌డబ్ల్యూ-10 సయ్యద్‌ బాషా మొహిద్దీన్‌ వాంగ్మూలం ప్రకారం.. నిందితుడు ఆగస్టు 16న తిమ్మాపురం పంచాయతీలో నూకరాజు పేరిట ఉన్న స్థలం విక్రయించాలని అడిగాడు. ‘‘నాకు డబ్బు కావాలి, ఆ కుటుంబం వచ్చి రిజిస్ట్రేషన్‌ చేస్తుంది, వారి ఇతర ఆస్తులు కూడా అమ్మాలి’’ అని చెప్పాడు. కాగా, సౌజన్య, ఆమె కుమారుడుని ఇస్లాం మత ఆచారాలు పాటించాలని, మత గ్రంథాలు చదవమని, రాయమని, బాలుడిని ఉర్దూ నేర్చుకోమని సాదిక్‌ బలవంతం చేశాడు. దీనిపై బీఎన్‌ఎస్‌ 299 సెక్షన్‌ కింద దర్యాప్తు చేస్తున్నట్టు రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నారు.

నూకరాజు భార్య సూసైడ్‌ నోట్‌

ఇప్పటి వరకు నూకరాజు, ఆయన కుమార్తెల సూసైడ్‌ నోట్లే బయటకు వచ్చినట్టుగా ప్రచారం ఉంది. అయితే సౌజన్య బైక్‌లో మూడు చేతిరాత సూసైడ్‌ నోట్స్‌ దొరికాయి. అవి సౌజన్య, నూకరాజు, మీనా రాసినట్టుగా గుర్తించారు. ‘నా కూతురు, మనవడి ప్రాణాలకు ఎంత ప్రమాదం ఉందో తెలిసి వణికిపోతున్నాను. నా భర్త ఆరోగ్యం బాగోలేదు. ఆ క్రూరుడు సాదిక్‌ను ఎదిరించలేకపోతున్నాం. నా కూతురి ఆస్తి తన చేతికి రాగానే తన పేరున గిఫ్ట్‌ డీడ్‌ రాయించుకోవాలని ఫోన్‌లో చెప్పడం విన్నాను. అప్పటి నుంచి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నాం. మా కుమార్తె, మనవడిని వదిలి మేము బతకలేం’’ అని రాశారు. ఈ నోట్లను ఫోరెన్సిక్‌, హ్యాండ్‌ రైటింగ్‌ పరీక్షకు పంపినట్టు తెలిసింది.

Updated Date - Aug 26 , 2026 | 05:21 AM