హైకోర్టు చెబితే మాకేంటి..?
ABN , Publish Date - Mar 02 , 2026 | 03:47 AM
కాకినాడలో వైసీపీకి చెందిన ఒక నోటిదురుసు నేత.. అక్కడి సూర్యారావుపేటలోని 20 ఎకరాల ప్రైవేటు భూమిపై కన్నేశారు. జగన్ ప్రభుత్వ హయాంలో తన పలుకుబడి ఉపయోగించి జిల్లా కలెక్టరేట్‌లో ఉన్న...
సీసీఎల్‌ఏ ఆదేశం పాటించాలా?
కాకినాడ రెవెన్యూ అధికారుల తీవ్ర నిర్లక్ష్యం
ప్రైవేటు భూముల్లో ప్రహరీ గోడ గేటుకు వేసిన సీల్ తీసేయాలన్న హైకోర్టు
సీసీఎల్‌ఏ ఆదేశాలూ బేఖాతరు..
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
కాకినాడలో వైసీపీకి చెందిన ఒక నోటిదురుసు నేత.. అక్కడి సూర్యారావుపేటలోని 20 ఎకరాల ప్రైవేటు భూమిపై కన్నేశారు. జగన్ ప్రభుత్వ హయాంలో తన పలుకుబడి ఉపయోగించి జిల్లా కలెక్టరేట్‌లో ఉన్న ఆర్‌ఎస్ఆర్ ఫెయిర్ అడంగల్‌ను తారుమారు చేయించారు. సర్వే నంబర్ 175-1, 175-3లో మార్పులు చేసి విలువైన భూమిని తన అనుచరుల పేరిట రాయించుకున్నారు. రైతులు, పట్టాదారుల ఫిర్యాదుతో 2023 నవంబరులో నాటి సీసీఎల్‌ఏ, రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్ సాయిప్రసాద్ ఈ ఉదంతంపై విచారణకు ఆదేశించారు. అప్పటి కాకినాడ జాయింట్ కలెక్టర్ విచారణ జరిపి కలె క్టరేట్‌లోని ఆర్‌ఎస్ఆర్‌ను తారుమారు చేసి హక్కుదారుల పేర్లు మార్చేశారని నిగ్గు తేల్చారు. చర్యలకు సిఫారసు చేశారు. కానీ చర్యలేవీ లేవు. కూటమి ప్రభుత్వం వచ్చాక హక్కుదారులు మరోసారి దాని దృష్టికి తీసుకొచ్చారు. ఈ అంశంపై ‘సరిదిద్దలేని దందా’ అనే శీర్షికన కాకినాడలో సదరు వైసీపీ నేత భూ దోపిడీపై ‘ఆంధ్రజ్యోతి’ గతేడాది జూలై 2న కథనం ప్రచురించింది. అక్రమార్కులకు ఉన్నతాధికారుల అండదండాలు ఉన్నాయని పేర్కొంటూ ‘భూచోడికి దాసోహం’ శీర్షికన మరో వార్త ప్రచురించింది. ఈ పరిణామాలపై స్పందించిన రెవెన్యూ శాఖ.. ఫోర్జరీకి గురయిన రికార్డును సరిదిద్ది, అసలైన హక్కులదారులకే భూములు దక్కేలా చూడాలని జిల్లా రెవెన్యూ అధికారులను ఆదేశించింది. కానీ.. వైసీపీ నేత 9ఎకరాల భూమిపై తన అనుచరుడితో పిటిషన్ ఇప్పించారు. తారుమారైన రికార్డులో అసలైన హక్కుదారు పేరు తొలగించి, ఈయన పేరుమీద భూమి రాశారు. ఈయన ఫిర్యాదుతో హక్కుదారును ఆ భూమిలోకి వెళ్లనివ్వకుండా జిల్లా అధికారులు ప్రహరీగోడ గేటుకు సీల్ వేయించారు. ఇది చట్టవిరుద్ధమని హక్కుదారు హైకోర్టును ఆశ్రయుంచారు. వెంటనే హక్కుదారుకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలంటూ కోర్టు గత ఏడాది డిసెంబరు 10న ఆదేశాలిచ్చింది.
హైకోర్టు తీర్పు నేపథ్యంలో తగిన చర్యలు తీసుకోవాలని కాకినాడ జిల్లా కలెక్టర్, రెవెన్యూ అధికారులను సీసీఎల్‌ఏ ఆదేశించారు. మూడు నెలలైనా ఉత్తర్వులు అమలు చేయకుండా జిల్లా అధికారులు తీవ్రనిర్లక్ష్యం వహిస్తున్నారు. దీంతో హక్కుదారులు మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. కాకినాడ కలెక్టర్, రెవెన్యూ స్పెషల్ సీఎస్, సీసీఎల్‌ఏను కూడా ప్రతివాదులుగా చేర్చారు. హైకోర్టు నుంచి సీసీఎల్‌ఏకు మరోసారి నోటీసులు వచ్చాయి. దరిమిలా.. ఇప్పటికైనా సత్వర చర్యలు తీసుకోవాలని సీసీఎల్‌ఏ జయలక్ష్మి కార్యాలయం కాకినాడ కలెక్టర్‌కు మెయిల్ కూడా పంపించింది. అయినా చర్యలు తీసుకోలేదని తేలడంతో సదరు అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫారసు చేస్తామని ఓ ఉన్నతాధికారి తెలిపారు. ‘ఒకవైపు కోర్టు ధిక్కార కేసులు పెరిగిపోతున్నాయి. సీఎస్, సహా ఇతర ఉన్నతాధికారులను తమ ముందు వ్యక్తిగతంగా హాజరవ్వాలని హైకోర్టు ఆదేశాలిస్తోంది. జిల్లా, క్షేత్ర స్థాయి అధికారుల నిర్లక్ష్యం, జవాబుదారీలేని చర్యలతో మేం నోటీసులు ఎదుర్కొంటున్నాం’ అని సీనియర్ అధికారి వాపోయారు.