Share News

కాకినాడలో మరో భారీ గ్రీన్‌ అమ్మోనియా ప్లాంట్‌

ABN , Publish Date - Aug 26 , 2026 | 04:41 AM

రాష్ట్రంలో మరో భారీ గ్రీన్‌ అమ్మోనియా ప్రాజెక్టు ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. కాకినాడలో ‘వారీ క్లీన్‌ ఎనర్జీ సొల్యూషన్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌’ ఆధ్వర్యంలో ఏడాదికి 1.20 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల..

కాకినాడలో మరో భారీ గ్రీన్‌ అమ్మోనియా ప్లాంట్‌

  • 1.20 ఎంఎంటీపీఏ సామర్థ్యంతో ఏర్పాటుకు ‘వారీ’ సిద్ధం

  • ఇప్పటికే రెడీ అవుతున్న గ్రీన్‌కో ప్లాంట్‌

అమరావతి, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మరో భారీ గ్రీన్‌ అమ్మోనియా ప్రాజెక్టు ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. కాకినాడలో ‘వారీ క్లీన్‌ ఎనర్జీ సొల్యూషన్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌’ ఆధ్వర్యంలో ఏడాదికి 1.20 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల (ఎంఎంటీ) సామర్థ్యంతో గ్రీన్‌ అమ్మోనియాను ఉత్పత్తి చేసే ప్రాజెక్టు ఏర్పాటు కానుంది. ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వం మంగళవారం పరిపాలన అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మూడేళ్ల కాలపరిమితితో ప్రాజెక్టును పూర్తి చేయాల్సి ఉంటుంది. ప్రాజెక్టుకు 15 సంవత్సరాలపాటు విద్యుత్తు సుంకం నుంచి మినహాయింపు ఇచ్చారు. ఇప్పటికే కాకినాడలో 1 ఎంఎంటీపీఏ సామర్థ్యంతో గ్రీన్‌కో ఆధ్వర్యంలో గ్రీన్‌ అమ్మోనియా ప్రాజెక్టు ఏర్పాటు శరవేగంగా జరుగుతోంది. తాజాగా వారీ సంస్థ కూడా ముందుకు రావడంతో కాకినాడ గ్రీన్‌ అమ్మోనియా హబ్‌గా మారనుంది. గ్రీన్‌కో సంస్థ అమ్మోనియా తయారీకి సహజవాయువును ఉపయోగించుకోనుంది. వారీ సంస్థ పునరుత్పాదక ఇంధనం(సౌర, పవన విద్యుత్తు)ను వినియోగిస్తుంది. పోర్టు నుంచి సముద్రమార్గం ద్వారా అమ్మోనియా ఎగుమతి వీలుగా ఉండటంతో కాకినాడ కేంద్రంగా గ్రీన్‌ అమ్మోనియా ప్రాజెక్టుల ఏర్పాటుకు సంస్థలు ముందుకు వస్తున్నాయి.

Updated Date - Aug 26 , 2026 | 04:43 AM