కన్నీరు మున్నీరు
ABN , Publish Date - Mar 02 , 2026 | 03:40 AM
కాకినాడ జిల్లా వేట్లపాలెం బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 23కు చేరింది. ఆదివారం మరో ఇద్దరు క్షతగాత్రులు మరణించారు.
బాణసంచా పేలుడులో 23కు చేరిన మృతులు
కాకినాడ జీజీహెచ్‌లో మరో ఇద్దరి మృతి
మరో ముగ్గురి పరిస్థితి విషమం
8 మంది కార్మికులే పనిచేసేందుకు అనుమతి
కానీ 40 మంది కూలీలతో పని
ప్రమాద స్థలిని పరిశీలించిన మంత్రులు
బాణసంచా కేంద్రంలో వైసీపీ కరపత్రాలు
స్థానిక వైసీపీ ఎంపీపీ పాత్రపై విచారణ: అనిత
కాకినాడ జిల్లాలో తాత్కాలికంగా బాణసంచా తయారీ కేంద్రాల మూసివేత
కాకినాడ, మార్చి 1(ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా వేట్లపాలెం బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 23కు చేరింది. ఆదివారం మరో ఇద్దరు క్షతగాత్రులు మరణించారు. ప్రమాదం జరిగిన రోజు శనివారం 21 మంది మరణించగా, ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన దర్శిపాటి లోవరాజు(40), దర్శిపాటి రాజు కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న వారిలో ముగ్గురు క్షతగాత్రుల పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. పేలుడు ఘటనలో చనిపోయిన 20 మంది మృతదేహాలకు సామర్లకోట ప్రభుత్వ ఆసుపత్రిలో ఆదివారం తెల్లవారుజామున పోస్టుమార్టం పూర్తయింది. మృతదేహాలను ఆయా కుటుంబాలకు అందించారు. అంత్యక్రియల ఖర్చుల కింద రూ.25 వేల సాయం అందించారు. మృతదేహాలను కుటుంబీకులు స్వగ్రామాలకు తరలించారు. ఈ సందర్భంగా విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు కన్నీరుమున్నీరయ్యారు. వేట్లపాలెం గ్రామానికి చెందిన ఆరు మృతదేహాలను ఒకేచోట ఖననం చేశారు. ఆ సమయంలో కుటుంబీకులు, బంధువుల ఆర్తనాదాలు మిన్నంటాయి. కూలి పనికి వెళ్లి మృతదేహాలై తిరిగి వచ్చారంటూ విలపించారు. కాగా ప్రమాద స్థలాన్ని హోంమంత్రి అనిత ఆదివారం ఉదయం పరిశీలించారు. పేలుడు ఘటన జరిగిన ప్రదేశంలో పెద్దఎత్తున వైసీపీ అధినేత జగన్ ఫొటోలతో కూడిన కరపత్రాలు కాలిపోయి ఉండడాన్ని పరిశీలించారు.

‘మా నమ్మకం నువ్వే జగన్’ పేరుతో ఉన్న కరపత్రాలు బాణసంచా తయారీ కేంద్రంలో ఉండడంపై అనుమానాలు వ్యక్తం చేశారు. ప్రమాద ఘటన వెనుక స్థానిక వైసీపీ ఎంపీపీ పాత్ర ఉందని ఆరోపణలు వస్తుండడంతో విచారణ చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కేంద్రానికి అంత మందుగుండు ముడిసరుకు ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై కూడా ఆరా తీస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రమాద ఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తు చేస్తున్నట్లు ప్రకటించారు. పేలుడు జరిగిన ప్రదేశంలో ఆదివారం ఉదయం క్లూస్ టీం బృందాలు పరిశీలించాయి. పేలుడు జరిగిన చోట మందుగుండు కాలిన ఆనవాళ్ల నమూనాలు సేకరించారు.
అనుమతి ఎనిమిది మందికే..
పేలుడు చోటు చేసుకున్న శ్రీసూర్య ఫైర్ వర్క్ కంపెనీకి రోజూవారీ 15 కిలోల బాణసంచా తయారీకే అనుమతి ఉంది. కానీ జాతర కోసం భారీగా బాణసంచా ఆర్డర్లు రావడంతో 800 కిలోలకుపైగా అక్కడ నిల్వ చేశారు. దీంతో ప్రమాద తీవ్రత పెరిగింది. ఈ కంపెనీలో నిబంధనల ప్రకారం కేవలం 8 మంది కార్మికులతోనే పని చేయించుకోవడానికి అనుమతి ఉంది. కానీ నిబంధనలకు విరుద్ధంగా 40 మందితో పనిచేయించినట్లు గుర్తించారు. ప్రవ ూదం తర్వాత వీరంతా తప్పించుకోవడానికి వీల్లేక మంటల్లో చిక్కుకుని సజీవదహనమయ్యారు. ఇదే విషయాన్ని కార్మిక శాఖ మంత్రి సుభాశ్ ధ్రువీకరించారు. 15 కిలోల బాణసంచా తయారీకి అనుమతి పొంది, కాసుల కక్కుర్తితో భారీగా నిల్వ చేయడంతోనే భారీ ప్రమాదం జరిగిందన్నారు. పేలుడు దుర్ఘటనను సీఎం చంద్రబాబు తీవ్రంగా పరిగణిస్తున్నారని, అధికారులను సస్పెండ్ చేశారని అన్నారు. బాణసంచా తయారీ కేంద్రం నిర్వాహకుల ఆస్తులు జప్తు చేస్తామని సీఎం చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారని తెలిపారు.
యజమానులు అరెస్ట్
బాణసంచా తయారీ కేంద్రం యజమాని అడబాల అర్జున్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఆయన సోదరుడు అడబాల వీరబాబు పరారీలో ఉండగా పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిద్దరిపై సామర్లకోట పోలీసులు ఎక్స్‌ప్లోజివ్ యాక్ట్ 1884 కింద క్రైం నంబరు 114/2026తో కేసు నమోదు చేశారు. సెక్ష న్లు 223,288,125(ఏ), 125 (బీ), 105 కింద కేస ులు నమోదు చేశారు. కాగా సదరు యజమాని తక్కువ వేతనాలతో కూలీలను నియమించడం, నిబంధనలను అతిక్రమించి బాణసంచా విక్రయాలు చేసి గడచిన మూడేళ్లలో రూ.15 కోట్ల వరకు సంపాదించాడు.
రాత్రికి రాత్రే చెక్కులు సిద్ధం
మృతుల కుటుంబాలకు రూ.20 లక్షల చొప్పున సీఎం చంద్రబాబు ఆర్థికసాయం ప్రకటించిన సంగతి తెలిసిందే. శనివారం రాత్రి 9గంటల సమయంలో సీఎం చంద్రబాబు సాయం ప్రకటించగా, ఆదివారం ఉదయం 10 గంటలకే అధికారులు మృతుల కుటుంబాలకు చెక్కులు సిద్ధం చేశారు. మంత్రులు అనిత, నారాయణ, కందుల దుర్గేశ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, ఎంపీలు సానా సతీశ్, ఉదయ శ్రీనివాస్, హరీశ్ మాధుర్ మధ్యాహ్నం 12 గంటల లోపే బాధిత కుటుంబాల ఇళ్లకు వెళ్లి చెక్కులు అందించారు.
బాణసంచా తయారీ సంస్థల ఎన్‌వోసీలు రద్దు చేస్తాం: అనిత
సామర్లకోట, మార్చి 1(ఆంధ్రజ్యోతి): బాణసంచా తయారీ సంస్థల నిర్వహణకు ఇప్పటి వరకూ అధికారులు జారీ చేసిన ఎన్‌వోసీలను రద్దు చేస్తామని హోం మంత్రి అనిత ప్రకటించారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు మరో మంత్రి నారాయణతో కలిసి అనిత ఆదివారం వేట్లపాలెం వెళ్లారు. ఈ సందర్భంగా ప్రమాద స్థలిని పరిశీలించారు. ఈ ఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తు చేస్తున్నట్లు అనిత చెప్పారు. వైసీపీ ఎంపీపీ కెనాల్ రోడ్డులో నిర్వహించిన మరో బాణసంచా తయారీ సంస్థలో గతంలో విస్ఫోటం జరిగి ఐదుగురు వ్యక్తులు మృతి చెందారన్నారు. కారకులపై కేసులు నమోదు కావడం, అరెస్ట్‌లు చేయడం వంటి అంశాలను దర్యాప్తు బృందం పరిగణనలోకి తీసుకుంటుందన్నారు. తాజాగా ఎన్‌వోసీలు ఇచ్చేవరకూ బాణసంచా తయారీ పనులను నిలిపివేసేలా ఆదేశాలు జారీ చేశామన్నారు. కాగా కాకినాడ జిల్లాలో ఎన్‌వోసీలు పొందిన అన్ని తయారీ కేంద్రాలను తక్షణం తాత్కాలికంగా మూసివేయాలంటూ జిల్లా ఫైర్ ఆఫీసర్ పీవీఎస్ రాజేశ్ ఉత్తర్వులు జారీ చేశారు.