Share News

ప్రాణం ఖరీదు 16 కోట్లు..!

ABN , Publish Date - Mar 31 , 2026 | 05:13 AM

జన్యుపరమైన స్పైనల్‌ మస్క్యులర్‌ అట్రోపీ (ఎస్‌ఎంఏ టైప్‌-2) వ్యాధి నాలుగేళ్ల బాలుడి జీవితాన్ని చిదిమేస్తోంది! కాకినాడ జిల్లా కాకినాడ రూరల్‌ మండలం గంగనాపల్లి గ్రామంలో నివసిస్తున్న...

ప్రాణం ఖరీదు 16 కోట్లు..!

  • నాలుగేళ్ల చిన్నారికి స్పైనల్‌ మస్క్యులర్‌ అట్రోపీ.. నయం కావాలంటే జోల్‌జెన్‌స్మా ఇంజెక్షన్‌ అవసరం

  • పేద కుటుంబం.. ఇప్పటికే 10 లక్షల వరకూ అప్పులు

  • ప్రభుత్వం, దాతల కోసం దీనంగా ఎదురుచూపులు

  • కాకినాడ జాయింట్‌ కలెక్టర్‌కు వినతి పత్రం

కలెక్టరేట్‌ (కాకినాడ), మార్చి 30 (ఆంధ్రజ్యోతి): జన్యుపరమైన స్పైనల్‌ మస్క్యులర్‌ అట్రోపీ (ఎస్‌ఎంఏ టైప్‌-2) వ్యాధి నాలుగేళ్ల బాలుడి జీవితాన్ని చిదిమేస్తోంది! కాకినాడ జిల్లా కాకినాడ రూరల్‌ మండలం గంగనాపల్లి గ్రామంలో నివసిస్తున్న కోసూరు బాల దుర్గా ఈశ్వరరావు (బాలాజీ), యెమీమా దంపతుల కుమారుడు మోజేష్‌ రాయ్‌ (4) ఏడాది వయసు ఉన్నప్పుడు అనారోగ్యం బారినపడడంతో తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. వెన్నెముకలో కణాలను దెబ్బతీసి కండరాల క్షీణతకు దారితీసే ఎస్‌ఎంఏతో బాధపడుతున్నాడని వైద్యులు గుర్తించారు. ఈ వ్యాధిని నయం చేయాలంటే రూ.16 కోట్ల విలువైన జోల్‌జెన్‌స్మా ఇంజెక్షన్‌ ఇవ్వాలని సూచించారు. మూడేళ్ల నుంచి వైద్యులు ఇచ్చిన మందులకే నెలకు రూ.50వేల వరకూ ఖర్చవుతోంది. ఈ క్రమంలో మూడేళ్లలో రూ.10 లక్షల వరకూ అప్పులు చేసి ఆర్థికంగా చితికిపోయారు. రూ.16 కోట్ల ఇంజెక్షన్‌ కోసం రాష్ట్ర ప్రభుత్వం సాయం చేయాలని కోరుతూ సోమవారం కాకినాడ కలెక్టరేట్‌కు వచ్చిన తల్లిదండ్రులు జాయింట్‌ కలెక్టర్‌ అపూర్వ భరత్‌కు వినతి పత్రం అందజేశారు. కాకినాడలోని ఓ ఆస్పత్రిలో చిన్నారికి చికిత్స చేయిస్తున్నామని ఈ సందర్భంగా విలేకరులకు చెప్పారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌తోపాటు దాతలు ముందుకొచ్చి సాయం చే యాలని వేడుకున్నారు. దాతలు బాలుడి తండ్రి కోసూరు బాల దుర్గా ఈశ్వరరావు, అకౌంట్‌ నంబరు 714910100125324 (చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు, కొవ్వాడ, ఐఎ్‌ఫఎ్‌ససీ కోడ్‌: యూబీఐఎన్‌0సీజీ7149)ను లేదా 92905 96660 ఫోన్‌ నంబర్‌ను సంప్రదించవచ్చు.

Updated Date - Mar 31 , 2026 | 05:13 AM