Share News

కాకినాడలో విశేష స్పందన

ABN , Publish Date - Mar 13 , 2026 | 04:50 AM

స్థానికులు సమస్యల ఏకరువు పెట్టారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ఓపికగా విన్నారు. వాటి పరిష్కారానికి శ్రద్ధ చూపారు.

కాకినాడలో విశేష స్పందన

  • సమస్యలను ఏకరువు పెట్టిన కాకినాడ 39వ డివిజన్‌ ప్రజలు

కాకినాడ, మార్చి 12(ఆంధ్రజ్యోతి): స్థానికులు సమస్యల ఏకరువు పెట్టారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ఓపికగా విన్నారు. వాటి పరిష్కారానికి శ్రద్ధ చూపారు. పలు సమస్యలకు అప్పటికప్పుడు చెక్‌ పెట్టారు. మరికొన్నింటిని 24 గంటల్లో పరిష్కరిస్తామని, మరికొన్నింటిని వారం రోజుల్లో పరిష్కారమయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేస్తూ ’ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ నిర్వహిస్తోన్న ‘అక్షరం అండగా.. పరిష్కారమే అజెండాగా’ కార్యక్రమం కాకినాడ నగరంలోని 39వ డివిజన్‌ రామారావుపేటలోని శ్రీరస్తు ఫంక్షన్‌ హాలులో గురువారం జరిగింది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు 39వ డివిజన్‌ మాజీ కార్పొరేటర్‌ మల్లిపూడి నాగసూర్య దీపిక, కాకినాడ నగర టీడీపీ అధ్యక్షుడు మల్లిపూడి వీరు ఆధ్వర్యంలో సదస్సుకు ముఖ్యఅతిథిగా సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, ప్రత్యేక అతిథులుగా కాకినాడ అదనపు కమిషనర్‌ కేటీ సుధాకర్‌, డిప్యూటీ కమిషనర్‌ కోన శ్రీనివాస్‌ తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ‘ఆంధ్రజ్యోతి’ దినపత్రిక యూనిట్‌ మేనేజర్‌ శ్రీనివాస్‌ అధ్యక్షత వహించారు. ఎమ్మెల్యే వనమాడి మాట్లాడుతూ సదస్సులో ప్రస్తావించిన సమస్యలన్నీ పరిష్కారమయ్యేలా తనవంతు సహకారం అందిస్తానన్నారు. నగర పాలక సంస్థ అధికారులు మాట్లాడుతూ ప్రజాసమస్యలను వార్తల రూపంలో ప్రజల దృష్టికి తీసుకురావడమే కాకుండా, వాటి పరిష్కారానికి ప్రజలతో సదస్సులు నిర్వహించడం మంచి కార్యక్రమం అన్నారు. ఇక్కడ ప్రస్తావించిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు.


  • వెలిగిన వీధి దీపాలు

  • సాయంత్రానికే సమస్య పరిష్కారం

‘అక్షరం అండగా-పరిష్కారమే అజెండాగా’ కార్యక్రమంలో ఎల్‌.లావణ్య లేవనెత్తిన సమస్యను అధికారులు సాయంత్రంలోగా పరిష్కరించారు. రామారావుపేట శివాలయం నుంచి శంకరమఠం వరకు వెళ్లేదారిలో వీధి దీపాలు వెలగడం లేదని, దీనివల్ల దొంగతనాలు జరుగుతాయని భయాందోళనకు గురవుతున్నామని ఆమె తెలిపారు. 24 గంటల్లో వీధి దీపాలు మరమ్మతు చేస్తామని, అవసరమైనచోట్ల కొత్తవి ఏర్పాటు చేస్తామని కార్పొరేషన్‌ ఎస్‌ఈ వెంకట్రావు ఆమెకు బదులిచ్చారు. దీనిపై అప్పటికప్పుడే ఆదేశాలు ఇచ్చి సాయంత్రానికి వీధి దీపాలు వెలిగించారు. సమస్య పరిష్కారానికి కృషిచేసిన ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతికి స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - Mar 13 , 2026 | 04:51 AM