Share News

పెద్ద దస్తగిరి హత్యలో..నిత్యానందరెడ్డిది కీలక పాత్ర!

ABN , Publish Date - May 02 , 2026 | 04:12 AM

కడప వైసీపీ నేత, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి పెద్ద దస్తగిరి హత్యలో కడప మాజీ డిప్యూటీ మేయర్‌ బండి నిత్యానందరెడ్డి కీలకపాత్ర పోషించారని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ మెండ లక్ష్మీనారాయణ హైకోర్టుకు నివేదించారు.

పెద్ద దస్తగిరి హత్యలో..నిత్యానందరెడ్డిది కీలక పాత్ర!

  • నిందితులకు ఆశ్రయమిచ్చారు.. పరారీకి డబ్బు ఏర్పాటు చేశారు: పీపీ

  • పోలీసు దర్యాప్తునకు సహకరించాలని కడప మాజీ డిప్యూటీ మేయర్‌కు హైకోర్టు ఆదేశం

అమరావతి, మే 1(ఆంధ్రజ్యోతి): కడప వైసీపీ నేత, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి పెద్ద దస్తగిరి హత్యలో కడప మాజీ డిప్యూటీ మేయర్‌ బండి నిత్యానందరెడ్డి కీలకపాత్ర పోషించారని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ మెండ లక్ష్మీనారాయణ హైకోర్టుకు నివేదించారు. ఆయన పాత్రపై సాంకేతిక ఆధారాలు సేకరించామన్నారు. గూగు ల్‌ టేకవుట్‌, కాల్‌ డేటాను పరిశీలిస్తే పెద్ద దస్తగిరిని హత్య చేసిన తర్వాత ప్రధాన నిందితులు నిత్యానందరెడ్డిని ఆశ్రయించినట్లు స్పష్టంగా ఉందని.. వారు పారిపోయేందుకు ఆయన డబ్బు ఏర్పాటు చేశారని తెలిపారు. కేసులో ఇతర నిందితులు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఆయన్ను నిందితుడిగా చేర్చామన్నారు. నిత్యానందరెడ్డి, హతుడు పెద్ద దస్తగిరి ఇద్దరూ కలిసి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసేవారని వివరించారు. వారి మధ్య వివాదాలు తలెత్తడంతోనే దస్తగిరి హత్యకు ప్రణాళిక రచించారన్నారు. నిత్యానందరెడ్డి తరఫున సీనియర్‌ న్యాయవాది సి.రఘు వాదనలు వినిపించారు. హత్య ఘటనకు సంబంధించి మొదట నమోదైన ఎఫ్‌ఐఆర్‌లో పిటిషనర్‌ పేరు లేదని.. రాజకీయ కారణాలతో నిందితుడిగా చేర్చారని.. హత్యకు పాల్పడినవారికి ఆశ్రయం కల్పించారనేదే ఆయనపై ఉన్న ఆరోపణగా పేర్కొన్నారు. ఈ నేరారోపణ ఏడేళ్లలోపు శిక్షకు వీలున్నదే అయినందున బీఎన్‌ఎ్‌సఎస్‌ సెక్షన్‌ 35(3) ప్రకారం నోటీసులిచ్చేలా పోలీసులను ఆదేశించాలని కోరారు. ఇరుపక్షాల వాదనలు పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం... పిటిషనర్‌పై హత్య కేసు నమోదైందని గుర్తుచేసింది. అరెస్టు చేస్తారనే ఆందోళన ఉంటే ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ వేసుకోవాలని సూచించింది. దర్యాప్తు ప్రాథమిక దశలో ఉందని.. చార్జిషీటు దాఖలు చేయనందున కేసును క్వాష్‌ చేసే ప్రశ్నే ఉత్పన్నం కాదని తెలిపింది. పిటిషనర్‌ చేసిన నేరం ఏడేళ్లలోపు శిక్షకు వీలున్నదైతే సెక్షన్‌ 35(3)ప్రకారం నోటీసులిచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది. ఏడేళ్లకు పైగా శిక్షకు వీలుంటే చట్టనిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవచ్చని స్పష్టం చేసింది. పోలీసుల దర్యాప్తునకు సహకరించాలని నిత్యానందరెడ్డికి తేల్చిచెప్పింది. తదుపరి విచారణను వేసవి సెలవుల తర్వాతకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ వై.లక్ష్మణరావు శుక్రవారం ఉత్తర్వులిచ్చారు.

Updated Date - May 02 , 2026 | 04:12 AM