Share News

కడప జిల్లాలో దాల్మియా సిమెంట్‌ ప్లాంట్‌ భారీ విస్తరణ

ABN , Publish Date - Jul 15 , 2026 | 04:48 AM

కడప జిల్లాలో దాల్మియా సిమెంట్‌ ప్లాంట్‌ భారీ విస్తరణ పనులకు రాష్ట్ర మంత్రి లోకేశ్‌ బుధవారం భూమిపూజ చేయనున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. జమ్మలమడుగు నియోజకవర్గం..

కడప జిల్లాలో దాల్మియా సిమెంట్‌ ప్లాంట్‌ భారీ విస్తరణ

  • 3478 కోట్ల పనులకు నేడు లోకేశ్‌ శంకుస్థాపన

(కడప-ఆంధ్రజ్యోతి)

కడప జిల్లాలో దాల్మియా సిమెంట్‌ ప్లాంట్‌ భారీ విస్తరణ పనులకు రాష్ట్ర మంత్రి లోకేశ్‌ బుధవారం భూమిపూజ చేయనున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. జమ్మలమడుగు నియోజకవర్గం మైలవరం మండలం చిన్నకొమెర్లలో ఉన్న దాల్మియా సిమెంటు లిమిటెడ్‌ లైన్‌-2 విస్తరణను రూ. 3,478 కోట్ల వ్యయంతో చేపట్టనుంది. ప్రస్తుతం ఈ ప్లాంటులో ఏడాదికి 2.5 మిలియన్‌ టన్నుల క్లింకర్‌, 3.6 మిలియన్‌ టన్నుల సిమెంటు ఉత్పత్తి జరుగుతోంది. ప్లాంటు విస్తరణతో క్లింకర్‌ సామర్థ్యం 6.1 మిలియన్‌ టన్నులకు, సిమెంటు ఉత్పత్తి 9.6 మిలియన్‌ టన్నులకు చేరనుంది. ఇప్పటి దాకా ఉన్న ప్లాంట్‌ ద్వారా సుమారు 950 మంది ఉపాధి పొందుతున్నారు. ఈ ప్లాంటు విస్తరణతో మరో 700 మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. ఈ పరిశ్రమకు అనుబంధ రంగాలైన రవాణా, గనులు, కాంట్రాక్టులు, చిన్న పరిశ్రమలు, సేవా రంగాల్లో కూడా చాలామందికి ఉపాధి కలగనుంది. విస్తరణ చేయబోయే ప్లాంటులో రోబో ల్యాబ్‌, ఏఐ ఆఽధారిత భద్రత వ్యవస్థ, జర్మనీ, చైనాల సాంకేతికత, ఈవీ ఆధారిత రవాణా, రైల్వే లాజిస్టిక్‌, రూఫ్‌టాప్‌ సోలార్‌తో పాటు అధునాతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగించనున్నారు. ప్రస్తుతం ఉన్న దాల్మియా సిమెంటు ద్వారా మైనింగ్‌, రాయల్టీ, ఇతర జీఎస్టీ రూపంలో ఇప్పటి దాకా ప్రభుత్వ ఖజానాకు రూ. 102 కోట్లు ఆదాయం వస్తోంది. రెండో దశ ప్లాంటు విస్తరణ పూర్తయితే ఆ ఆదాయం రూ. 310 కోట్లకు పెరుగుతుంది. ఇందులో రూ.120 కోట్లు మైనింగ్‌ రాయల్టీ కాగా, మరో రూ.190 కోట్లు జీఎస్టీ రూపంలో ఖజానాకు చేరనుంది.


కడపకు చేరుకున్న లోకేశ్‌

మంత్రి లోకేశ్‌ మంగళవారం సాయంత్రం కడప విమానాశ్రయానికి చేరుకున్నారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి సవిత, కలెక్టర్‌ చెరుకూరి శ్రీధర్‌, పలువురు నేతలు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గాన జమ్మలమడుగు మండలం గుత్తి-నెల్లూరు హైవేలో ఉన్న కరమలవారిపల్లెలో ఏర్పాటు చేసిన నైట్‌షెల్టరుకు చేరుకున్నారు. బుధవారం ఉదయం దాల్మియా ప్రాజెక్టుకు శంకుస్థాపన అనంతరం మధ్యాహ్నం 2.30 నుంచి 4 వరకు ప్రొద్దుటూరు నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలు, నేతలతో సమన్వయ సమావేశంలో పాల్గొంటారు. దీని కోసం దొరసానిపల్లె వద్ద వేదిక ఏర్పాటు చేశారు.

Updated Date - Jul 15 , 2026 | 04:49 AM