Share News

హతుడు.. చంపింది.. చంపించింది.. అంతా వైసీపీ వారే

ABN , Publish Date - Apr 20 , 2026 | 04:48 AM

కడపలో కలకలం రేపిన వైసీపీ కార్యకర్త పెద్ద దస్తగిరి హత్యలో ఆ పార్టీ నేతలే ఉన్నారని తేలింది. తొలుత గంజాయి బ్యాచ్‌ హత్య చేసిందంటూ పక్కదోవ పట్టించాలని చూశారు.

హతుడు.. చంపింది.. చంపించింది.. అంతా వైసీపీ వారే

  • బండి నిత్యానందరెడ్డి కోసమే దస్తగిరి హత్య

(కడప-ఆంధ్రజ్యోతి)

కడపలో కలకలం రేపిన వైసీపీ కార్యకర్త పెద్ద దస్తగిరి హత్యలో ఆ పార్టీ నేతలే ఉన్నారని తేలింది. తొలుత గంజాయి బ్యాచ్‌ హత్య చేసిందంటూ పక్కదోవ పట్టించాలని చూశారు. ఎస్పీ షెల్కే నచికేత్‌ విశ్వనాథ్‌ ప్రత్యేకంగా దృష్టి సారించి విచారణ సాగించడంతో ఇది గంజాయి హత్య కాదని, రియల్‌ ఎస్టేట్‌ వ్యవహారాల కారణంగానే హత్య జరిగిందని తేలింది. వైసీపీ నేత, మాజీ డిప్యూటీ మేయరు బండి నిత్యానందరెడ్డి కోసమే ఆలంఖాన్‌పల్లెకు చెందిన ఆ పార్టీ కార్యకర్త పెద్ద దస్తగిరిని హత్య చేసినట్లు నిందితులు ఒప్పుకొన్నట్లు తెలిసింది. ఈ హత్యలో కుట్ర, ప్లానింగ్‌ మొత్తం నిత్యానందరెడ్డిదేనని పోలీసులు తేల్చారు. ఈ మేరకు నిందితులు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. ఈ కేసులో పోలీసు అధికారులపైనా వేటు పడింది. కడప డీఎస్పీ వెంకటేశ్వర్లును ఎస్పీ వీఆర్‌కు పంపించారు. వైసీపీ నేతలను కాపాడాలనే ఉద్దేశంతో ఆ కేసు రిపోర్టును బలహీనం చేస్తున్నారన్న కారణంతో చిన్నచౌకు సీఐ ఓబులేసు, ఎస్‌ఐ రాజరాజేశ్వర్‌రెడ్డిలను వీఆర్‌కు పంపించారు. ఇది పోలీసు శాఖలోనే సంచలనంగా మారింది.


రియల్‌ ఎస్టేట్‌ వివాదాలతోనే...

బండి నిత్యానందరెడ్డి కోసమే తాము ఈ హత్య చేసినట్లు నిందితులు అంగీకరించినట్టు పోలీసులు రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నారు. ఈ కేసులో మొత్తం 11 మందిని అరెస్ట్‌ చేశారు. రిమాండ్‌ నివేదిక ప్రకారం.. చెన్నూరుకు చెందిన వైసీపీ రౌడీ బ్రదర్స్‌ పేరం రవి, పేరం రాజు, మనోహర్‌, శివప్రసాద్‌, వినయ్‌కుమార్‌రెడ్డి, రాంగోపాల్‌వర్మ, నరేంద్ర తదితరులు బండి నిత్యానందరెడ్డికి చెందిన రియల్‌ ఎస్టేట్‌ వ్యవహారాలు చూసుకునేవాళ్లు. ‘మేమంతా డబ్బు కోసం రియల్‌ ఎస్టేట్‌ వ్యవహారాల్లో దౌర్జన్యాలు, దందాగిరి చేసేవాళ్లం. పెద్ద దస్తగిరి, అతడి తమ్ముడు చిన్న దస్తగిరి, వారి అనుచరుడు రాములు కడప చుట్టుపక్కల వివాదాస్పద భూములను కొనుగోలు చేయడం, కబ్జా చేయడం లాంటివి చేస్తుండేవారు. ఈ క్రమంలో బండి నిత్యానందరెడ్డితో దస్తగిరి వివాదాస్పద భూములను కొనుగోలు చేయించాడు. ఈ విషయంలో బండి నిత్యానందరెడ్డికి, దస్తగిరికి మధ్య కొంత కాలంగా వివాదం నడుస్తోంది. భూములు అమ్మడం, కొనడంలో వారి మధ్య మనస్పర్థలు రావడంతో పెద్ద దస్తగిరి అంతు చూడాలని నిర్ణయించుకున్నాం. ఈ నేపఽథ్యంలో ఈ నెల 4వ తేదీన ఆలంఖాన్‌పల్లె జాతరలో పెద్ద దస్తగిరి, చిన్నదస్తగిరి, బంధువులు మా వర్గానికి చెందిన వనపర్తి వెంకటేశ్‌ను కొట్టారు. పెద్ద దస్తగిరి, చిన్నదస్తగిరిలపై తిరిగి వెంకటేశ్‌ దాడి చేయడంతో వారు గాయపడ్డారు. రిమ్స్‌లో చికిత్స కోసం వెళ్లగా అక్కడికి మేమంతా వెళ్లి వారిపై కత్తులతో దాడి చేశాం. దస్తగిరిని హత్య చేశాం’ అని పోలీసుల విచారణలో నిందితులు వెల్లడించారు. నిత్యానందరెడ్డి విదేశాలకు పారిపోయే ప్రయత్నంలో ఉన్నాడని తెలియడంతో లుకౌట్‌ నోటీసు జారీ చేసినట్లు చెబుతున్నారు.

Updated Date - Apr 20 , 2026 | 04:49 AM