Share News

3.12 కోట్లతో రోడ్లకు శ్రీకారం

ABN , Publish Date - Jun 12 , 2026 | 04:17 AM

అక్షరం అండగా.. పరిష్కారమే అజెండాగా’ పేరిట ‘ఆంధ్రజ్యోతి’ చేపడుతున్న ప్రజాహిత కార్యక్రమానికి కడపలో మంచి స్పందన లభించింది.

3.12 కోట్లతో రోడ్లకు శ్రీకారం

  • కడపలో పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే మాధవి

  • ‘అక్షరం అండగా.. పరిష్కారమే అజెండాగా’కు స్పందన

కడప, జూన్‌ 11(ఆంధ్రజ్యోతి): ‘అక్షరం అండగా.. పరిష్కారమే అజెండాగా’ పేరిట ‘ఆంధ్రజ్యోతి’ చేపడుతున్న ప్రజాహిత కార్యక్రమానికి కడపలో మంచి స్పందన లభించింది. కడప నగరపాలక సంస్థ పరిధిలోని శివానందపురంలో రూ.3.12 కోట్ల వ్యయంతో సిమెంటు రోడ్డు పనులు గురువారం ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ విప్‌, కడప ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవి భూమిపూజ చేసి ఈ పనులు ప్రారంభించారు. కడప నగరం 15వ డివిజన్‌లోని శివానందపురం, చుట్టుపక్కల పరిధిలో రోడ్లు, డ్రైనేజీలు, ఇతర మౌలిక వసతులు లేక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ‘ఆంధ్రజ్యోతి’లో వరుస కథనాలు ప్రచురితమయ్యాయి. దీంతోపాటు ఈ ఏడాది మార్చి 18న ‘ఆంధ్రజ్యోతి’ ఆధ్వర్యంలో 15వ డివిజన్‌లోని నిరంజన్‌నగర్‌లో ‘అక్షరం అండగా.. పరిష్కారమే అజెండాగా’ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే మాధవి.. శివానందపురం, నిరంజన్‌నగర్‌, ఫరీదానగర్‌లో సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా గురువారం రూ.3.12 కోట్ల వ్యయంతో కడప నగరపాలక సంస్థ పరిధిలోని శివానందపురంలో రోడ్డు నంబర్‌ 2, 3, 5లలో సిమెంటు రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... నగరంలో దశాబ్దాలుగా పెండింగులో ఉన్న డ్రైనేజీ, రహదారుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు చేపట్టామని తెలిపారు. అధికారులు, కాంట్రాక్టర్లు నాణ్యతలో ఎక్కడా రాజీ పడకుండా నిర్దేశిత గడువులోగా రోడ్డు పనులను పూర్తిచేయాలని సూచించారు.

Updated Date - Jun 12 , 2026 | 04:18 AM