Share News

జెత్వానీ కేసులో కొత్త మలుపు

ABN , Publish Date - Jul 22 , 2026 | 04:43 AM

ముంబై నటి/మోడల్‌ కాదంబరి జెత్వానీపై కేసులో మరో కొత్తమలుపు. వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్‌ పెట్టిన ఈ కేసు నుంచి ఆమెతో పాటు నిందితులుగా ఉన్న ఆమె ముగ్గురు కుటుంబ సభ్యుల పేర్లను తొలగించాలని న్యాయస్థానాన్ని సీఐడీ కోరింది.

జెత్వానీ కేసులో కొత్త మలుపు

  • కుక్కల విద్యాసాగర్‌ పెట్టిన కేసు నుంచి

  • ఆమె కుటుంబ సభ్యుల పేర్లు తొలగింపు

  • అనుమతి కోరుతూ కోర్టులో సీఐడీ పిటిషన్‌

  • విచారణ 29వ తేదీకి వాయిదా

విజయవాడ, జూలై 21(ఆంధ్రజ్యోతి): ముంబై నటి/మోడల్‌ కాదంబరి జెత్వానీపై కేసులో మరో కొత్తమలుపు. వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్‌ పెట్టిన ఈ కేసు నుంచి ఆమెతో పాటు నిందితులుగా ఉన్న ఆమె ముగ్గురు కుటుంబ సభ్యుల పేర్లను తొలగించాలని న్యాయస్థానాన్ని సీఐడీ కోరింది. సంబంధిత పిటిషన్‌ను సీఐడీ విజయవాడ ప్రాంతీయ కార్యాలయ అధికారులు రెండ్రోజుల కిందట దాఖలు చేశారు. విద్యాసాగర్‌ ఇచ్చిన ఫిర్యాదుపై ఇబ్రహీంపట్నం పోలీసు స్టేషన్‌లో నమోదైన కేసు(క్రైం నంబరు 90/2024)లో కాదంబరి జెత్వానీ (ఏ1), తల్లి ఆశా జెత్వానీ (ఏ2), తండ్రి నరేంద్రకుమార్‌ జెత్వానీ (ఏ3), సోదరుడు అంబరీశ్‌ జెత్వానీ (ఏ4)ని నిందితులుగా చేర్చారు. జెత్వానీ బెదిరింపులకు దిగి విద్యాసాగర్‌ నుంచి దఫదఫాలుగా డబ్బు వసూలు చేసినట్లు సీఐడీ నిర్ధారించి విజయవాడ ఏడో అదనపు జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో కొద్దిరోజుల క్రితం చార్జిషీటు దాఖలు చేసింది. ఈ కేసులో జెత్వానీని మినహాయించి ఆమె తల్లిదండ్రులు, సోదరుడిని నిందితుల జాబితా నుంచి తొలగిస్తున్నామని, ఇందుకు అనుమతించాలని సీఐడీ అధికారులు తమ పిటిషన్‌లో అభ్యర్థించారు. దీనిపై ఫిర్యాదుదారుకు నోటీసివ్వాలని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 29కి వాయిదా వేసింది.

Updated Date - Jul 22 , 2026 | 04:44 AM