జెత్వానీ బ్లాక్‌మెయిల్ వాస్తవం!
ABN , Publish Date - Jul 21 , 2026 | 06:48 AM
ఔనా! ముంబై మోడల్/నటి కాదంబరి జెత్వానీ అమాయకురాలు కాదా! బ్లాక్‌మెయిల్‌కు పాల్పడి డబ్బులు వసూలు చేసిందా? మరి.. తప్పు ఆమెదైతే ఐపీఎస్‌లను ఎందుకు సస్పెండ్ చేశారు? ఇదీ తాజా చర్చ!
ఆమెపై ఆ ముగ్గురు ఐపీఎస్‌లు తప్పుడు కేసు పెట్టిందీ వాస్తవమే!!
ఈ రెండూ వేర్వేరు కేసులు
స్పష్టత ఇచ్చిన కూటమి ప్రభుత్వం
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
ఔనా! ముంబై మోడల్/నటి కాదంబరి జెత్వానీ అమాయకురాలు కాదా! బ్లాక్‌మెయిల్‌కు పాల్పడి డబ్బులు వసూలు చేసిందా? మరి.. తప్పు ఆమెదైతే ఐపీఎస్‌లను ఎందుకు సస్పెండ్ చేశారు? ఇదీ తాజా చర్చ! వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్‌ను జెత్వానీ బ్లాక్‌మెయిల్ చేసినట్లు సీఐడీ తేల్చింది. చార్జిషీటు కూడా దాఖలు చేసింది. అయితే... ఈ కేసు వేరు! ముగ్గురు ఐపీఎస్‌లపై చర్యలకు కారణమైన కేసు వేరు! ఒక కేసులో ఆమె నిందితురాలు కాగా... మరో కేసులో ఆమెతోపాటు ఆమె తల్లిదండ్రులు బాధితులు! చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నట్లు సీఐడీ.. తన పని తాను చేసింది. జెత్వానీ కేసులో ఉన్న విషయాలను ఉన్నట్లుగా తేల్చి... చర్యలు తీసుకుంటోంది! తాజా పరిణామాలతో తలెత్తుతున్న సందేహాలు, ప్రశ్నలపై ప్రభుత్వమే వివరణ ఇచ్చింది. జెత్వానీ డబ్బులు వసూలు చేసినట్లు సాంకేతిక ఆధారాలు ఉండడంతో ఆమెపై నమోదైన మొదటి కేసు రుజువైందని.. సీఐడీ తన చార్జిషీటులోనూ అదే పేర్కొన్నట్లు తెలిపింది. కానీ ఆ ఐపీఎస్ అధికారులు ఓ తప్పుడు కథనం సృష్టించి.. దాని ఆధారంగా నమోదు చేసిన రెండో కేసు కారణంగానే జెత్వానీ, ఆమె తల్లిదండ్రులు 40 రోజులు జైల్లో ఉండాల్సి వచ్చిందని.. అధికారులు తప్పుడు కథ అల్లకపోతే వారు ఈ అక్రమ కేసుల బారినపడేవారు కాదని.. పోలీసు అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నది ఈ అక్రమ కేసు కారణంగానేనని స్పష్టం చేసింది. నిబంధనలన్నింటినీ ఉల్లంఘించి, విచారణను పక్కదారి పట్టించే ప్రయత్నం చేసినందుకే ముగ్గురు ఐపీఎస్ అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
ఇదీ జెత్వానీ కేసు..
తనను, వృద్ధాప్యంలో ఉన్న తన తల్లిదండ్రులను ఏపీలో భూమికి సంబంధించిన ఒక తప్పుడు కేసులో ఇరికించారని జెత్వానీ ఆరోపించారు. 2024 ఫిబ్రవరిలో ఏపీ పోలీసులు ముంబై వెళ్లి వారిని అరెస్టు చేసి విజయవాడకు తరలించారు. బెయిల్ వచ్చేవరకు వారు 40 రోజులకుపైగా జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ప్రభావవంతమైన ప్రైవేటు వ్యక్తులకు సహాయం చేయడం కోసమే చట్ట నిబంధనలను పక్కనబెట్టి ఈ తప్పుడు కేసు సృష్టించారని జెత్వానీ ఆరోపించారు. ఈ కేసులో రెండు భాగాలు ఉన్నాయి. తొలి భాగంలో నటి జెత్వానీ, వైసీపీ నేత విద్యాసాగర్ మధ్య ఉన్న సంబంధం, వారి మధ్య ఆర్థిక లావాదేవీలు, జెత్వానీ చేసినట్లు చెబుతున్న బ్లాక్‌మెయిలింగ్ ఆరోపణలు ఉన్నాయి. రెండో భాగంలో.. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లిలో విద్యాసాగర్ మనుషులతో జెత్వానీ ఒక నకిలీ విక్రయ ఒప్పందం చేసుకున్నట్లు ఐపీఎస్ అధికారులు సృష్టించిన తప్పుడు కథనం. అప్పటి సీఎంవో ఆదేశాల మేరకు.. ఎన్టీఆర్ జిల్లా పరిధిలో కేసు నమోదు చేయడం కోసమే ముగ్గురు సీనియర్ ఐపీఎస్‌లు ఈ తప్పుడు కథ అల్లారని, ఇక్కడి నుంచి ఈ కేసు పక్కదారి పట్టిందని కూటమి ప్రభుత్వం పేర్కొంది.
ఆ ఐపీఎస్‌లపై ఆరోపణలివీ...
నకిలీ విక్రయ ఒప్పందం పేరుతో సృష్టించిన తప్పుడు కేసు విచారణలో పోలీసుల వైపు నుంచి అనేక తీవ్రమైన లోపాలు జరిగినట్లు సీఐడీ విచారణలో వెల్లడైంది. అధికారికంగా ఎఫ్‌ఐఆర్ నమోదు కాకముందే చర్యలు ప్రారంభించడం, అసాధారణ వేగంతో అరెస్టులు చేయడం, ఫిర్యాదుపై ప్రాథమిక విచారణ సరిగా జరుపకపోవడం, పర్యవేక్షక అధికారులు సీఆర్‌పీసీ నిబంధనలను పాటించకపోవడం, చట్టపరమైన విధానాలను పక్కనపెట్టి, మౌఖిక ఆదేశాల ఆధారంగా అధికార దుర్వినియోగం వంటివి.. ఈ కేసు విచారణలో కీలకంగా వ్యవహరించిన పోలీసు అధికారులపై వచ్చిన ఆరోపణలు. విచారణ అనంతరం కూటమి ప్రభుత్వం ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేసింది. వారిలో నిఘా విభాగం మాజీ చీఫ్ పీఎ్‌సఆర్ ఆంజనేయులు, విజయవాడ మాజీ పోలీసు కమిషనర్ కాంతిరాణా తాతా, మాజీ డీసీపీ విశాల్ గున్నీ ఉన్నారు. కేవలం అధికారుల సస్పెన్షన్‌తో జెత్వానీకి క్లీన్ చిట్ ఇచ్చినట్లు కాదని.. చట్టప్రకారం సమగ్ర విచారణ జరగాలని ప్రభుత్వం భావించింది. అందుకే ఈ రెండు కేసులను సీఐడీకి అప్పగించింది. దర్యాప్తు చేపట్టిన సీఐడీ అధికారులు.. ఎఫ్‌ఐఆర్ నమోదు, పోలీసుల ప్రయాణ రికార్డులు, ఎలకా్ట్రనిక్ సాక్ష్యాధారాలు, ప్రైవేటు వ్యక్తుల ప్రమేయంపై లోతుగా దర్యాప్తు చేశారు. 2025 ఏప్రిల్‌లో ఆంజనేయులును అరెస్టు చేశారు. మరోవైపు జెత్వానీపై ఉన్న మొదటి కేసులో సుమారు రూ.1.32 కోట్ల బ్యాంకు లావాదేవీలకు అదనపు ఆధారాలను సీఐడీ సేకరించి.. సవరించిన చార్జిషీటు దాఖలు చేసింది.