జెత్వానీ కేసులో చార్జిషీటు వెనక్కి
ABN , Publish Date - Jul 18 , 2026 | 05:15 AM
ముంబై మోడల్, నటి కాదంబరి జెత్వానీ కేసులో సీఐడీ దాఖలు చేసిన చార్జిషీటు రిటర్న్ అయింది. త్వరలో తాజా అభియోగ పత్రాన్ని దర్యాప్తు సంస్థ కోర్టుకు సమర్పించనుంది.
త్వరలో మళ్లీ దాఖలు చేయనున్న సీఐడీ
విజయవాడ, జూలై 17(ఆంధ్రజ్యోతి): ముంబై మోడల్, నటి కాదంబరి జెత్వానీ కేసులో సీఐడీ దాఖలు చేసిన చార్జిషీటు రిటర్న్ అయింది. త్వరలో తాజా అభియోగ పత్రాన్ని దర్యాప్తు సంస్థ కోర్టుకు సమర్పించనుంది. ఈ కేసులో కొద్దిరోజుల క్రితం సీఐడీ అధికారులు విజయవాడ నాలుగో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. జగన్ హయాంలో అప్పటి పోలీసు అధికారులు తనను, తన కుటుంబాన్ని అన్యాయంగా అరెస్టు చేసి, నిర్బంధించి చిత్రహింసలు పెట్టారని జెత్వానీ.. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరోపించారు. దీనిపై విజయవాడ పోలీసు కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబుకు 2024 సెప్టెంబర్లో ఫిర్యాదు చేశారు. దీనిపై ఇబ్రహీంపట్నం పోలీసు స్టేషన్‌లో ఐపీసీ 120బీ, 166, 166ఏ, 167, 342, 354డీ, 420, 467, 469, 471, 34 సెక్షన్ల కింద కేసు ‘క్రైం నంబరు 469/2024) నమోదైంది. ఇందులో వైసీపీ నాయకుడు కుక్కల విద్యాసాగర్(ఏ1), నిఘా విభాగం మాజీ చీఫ్ పీఎ్‌సఆర్ ఆంజనేయులు (ఏ2), పోలీసు అధికారులు కాంతిరాణా తాతా (ఏ3), కె.హనుమంతరావు (ఏ4), ముత్యాల సత్యనారాయణ (ఏ5), విశాల్‌గున్నీ(ఏ6)తో పాటు ప్రకాశం జిల్లాకు చెందిన న్యాయవాదిని నిందితులుగా చేర్చారు. పీఎ్‌సఆర్ ఆంజనేయులు, కాంతిరాణా, విశాల్‌గున్నీ, అప్పటి పశ్చిమ మండలం ఏసీపీ కె.హనుమంతరావు, ఇబ్రహీంపట్నం ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణ ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్నారు. తొలుత ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేసినా తర్వాత ప్రభుత్వం దీనిని సీఐడీకి బదిలీ చేసింది. సీఐడీ గుంటూరు ప్రాంతీయ విభాగాధికారులు దర్యాప్తు చేశారు. కేసులో ఎవరెవరు ఎలాంటి పాత్ర పోషించారో వివరిస్తూ చార్జిషీటు రూపొందించారు. కోర్టు దీనిని రిటర్న్ చేయడంతో త్వరలో తాజా చార్జిషీటు వేయనున్నట్లు తెలిసింది.