కాదంబరి కథలో మరో కోణం!
ABN , Publish Date - Jul 20 , 2026 | 03:58 AM
ముంబై మోడల్/నటి కాదంబరి జెత్వానీ.. వ్యాపారవేత్త కుక్కల విద్యాసాగర్‌ను బెదిరించి, బ్లాక్‌మెయిల్ చేసి రూ.కోట్లు వసూలు చేసినట్లు సీఐడీ ఆరోపించింది.
డబ్బు కోసం బ్లాక్‌మెయిల్ చేసిన జెత్వానీ!!
వ్యాపారవేత్త విద్యాసాగర్ కేసులో సీఐడీ చార్జిషీటు
కాల్ డేటా, బ్యాంకు లావాదేవీలరికార్డులు కోర్టుకు సమర్పణ
ఈ కేసులోనే గతంలో ఆమె అరెస్టు
అమరావతి/విజయవాడ, జూలై 19 (ఆంధ్రజ్యోతి): ముంబై మోడల్/నటి కాదంబరి జెత్వానీ.. వ్యాపారవేత్త కుక్కల విద్యాసాగర్‌ను బెదిరించి, బ్లాక్‌మెయిల్ చేసి రూ.కోట్లు వసూలు చేసినట్లు సీఐడీ ఆరోపించింది. ఈ మేరకు కోర్టులో చార్జిషీటు దాఖలు చేసింది. విద్యాసాగర్ ఫిర్యాదుతో క్రిమినల్ కుట్ర, బలవంతపు వసూళ్లు (ఎక్స్‌టార్షన్), మోసం, ఫోర్జరీ, బెదిరింపుల ఆరోపణలతో ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసు స్టేషన్లో 2024 ఫిబ్రవరి 2న జెత్వానీ, ఆమె తండ్రి నరేంద్రకుమార్, తల్లి ఆశా, సోదరుడు అంబరీశ్‌పై ఈ కేసు నమోదైంది. దీనిపై దర్యాప్తు చేపట్టిన సీఐడీ.. విజయవాడ నాలుగో అదనపు మేజిస్ట్రేట్ కోర్టుకు చార్జిషీటు సమర్పించింది. ‘గుజరాత్‌కు చెందిన కాదంబరి నరేంద్ర కుమార్ జెత్వానీ 2009లో మిస్ గుజరాత్ కిరీటాన్ని గెలుచుకుంది. సినిమాల్లో నటించేందుకు ముంబైకి చేరిన ఆమె అక్కడ ఒక ప్రైవేటు కార్యక్రమంలో కుక్కల విద్యాసాగర్‌కు పరిచయమైంది. తన పేరు నటాషా అని.. మొబైల్ ఫోన్ పోయిందంటూ జెత్వానీ మాటలు కలిపారు. తాను వైద్య విద్యార్థిని అని, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానని తెలిపారు. తర్వాత ఇద్దరి మధ్య సన్నిహిత సంబంధం ఏర్పడడంతో హోటల్‌కు వెళ్లారు. సన్నిహితంగా ఉన్నప్పుడు ఫొటోలు తీసి.. ఆయన్ను బ్లాక్‌మెయిల్ చేశారు. ముంబై సినీ పరిశ్రమలో చాలా మంది తాను చెప్పినట్లు విని డబ్బులు జమ చేస్తుంటారని, తన సోదరుడు అంబరీశ్ దుబాయ్‌లో రియట్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని.. ఆయనకు అండర్‌వరల్డ్‌తో సంబంధాలు ఉన్నాయని, తన మాట వినకుంటే ఆయన ఇండియాకు వచ్చాక ప్రాణాలు తీయిస్తానని కాదంబరి హెచ్చరించారు. 2013 మే 14న రూ.లక్ష, 2015 అక్టోబరులో రూ.50 వేలు, 2015 మార్చి, ఏప్రిల్‌లో రూ.4.20 లక్షలు, 2018లో రూ.లక్ష, 2023లో మరో లక్షన్నర.. విడతలవారీగా విద్యాసాగర్ నుంచి రూ.6.70 లక్షలు వసూలుచేశారు. కొన్ని సార్లు తన ఖాతాలో, ఇంకొన్ని సార్లు తన తల్లితో కలిపి ఉన్న జాయింట్ అకౌంట్‌కు డబ్బు జమ చేయించుకున్నారు. విద్యాసాగర్‌ను బెదిరించడానికి 11 సెల్‌ఫోన్ నంబర్లు ఉపయోగించారు’ అని అందులో పేర్కొంది. అయితే 2023 సెప్టెంబరు నుంచి నవంబరు మధ్య ఆర్ట్ గ్యాలరీ పేరిట రూ.కోటి ఇవ్వాలన్న డిమాండ్‌తో బెదిరింపులను జెత్వానీ తీవ్రతరం చేసినట్లు వెల్లడించింది. ఫోన్లు చేసి వ్యక్తిగత ఫొటోలు బయటపెడతానని, అత్యాచారం కేసు పెడతానని బెదిరించినట్లు తెలిపింది. కాల్ డేటా, బ్యాంకు లావాదేవీల రికార్డులు, ఇతర ఎలకా్ట్రనిక్ ఆధారాలను కోర్టుకు సమర్పించింది. అయితే ఫిర్యాదుదారు ఆరోపించినట్లుగా రూ.1.32 కోట్లు ఆమె వసూలు చేశారనడానికి అన్ని ఆధారాలూ లభించలేదని తెలిపింది. అలాగే ఆమె కుటుంబ సభ్యుల పాత్రపై ఆధారాలు ఇంకా లభించలేదని సీఐడీ పేర్కొంది.
తమ దర్యాప్తులో ఫిర్యాదుదారుతో ఆమె మాట్లాడిన ఫోన్ కాల్స్ రికార్డులు మాత్రమే లభించాయని.. ఆమె తల్లి, తండ్రి, సోదరుడిపై విద్యాసాగర్ ఆరోపణలకు ఎలాంటి ఆధారాల్లేవని స్పష్టం చేసింది. జెత్వానీ అరెస్టు సమయంలో స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్లు, ఇతర డిజిటల్ పరికరాల ఫోరెన్సిక్ పరీక్షలు ఇంకా పూర్తి కాలేదని దర్యాప్తు సంస్థ వెల్లడించింది. ఫోరెన్సిక్ నివేదిక అందిన తర్వాత అవసరమైతే బీఎన్‌ఎ్‌సఎస్ సెక్షన్ 193(9) ప్రకారం మరింత లోతుగా దర్యాప్తు చేసి అదనపు అభియోగ పత్రం దాఖలు చేసేందుకు కోర్టును అనుమతి కోరింది.
ఐపీఎస్ల సస్పెన్షన్..
విద్యాసాగర్ ఫిర్యాదుతో జెత్వానీపై కేసు నమోదయ్యాక.. అప్పటి ప్రభుత్వం ప్రోద్బలంతో కొందరు సీనియర్ ఐపీఎస్ అధికారులు అత్యుత్సాహంతో చట్టవిరుద్ధంగా ప్రవర్తించారు. అనుమతుల్లేకుండానే ముంబై వెళ్లి మరీ అమెను అరెస్టుచేసి తీసుకొచ్చారు. రిమాండ్‌పై జైలుకు పంపారు. బెయిల్ వచ్చాక ఆమె ముంబై వెళ్లిపోయారు. కూటమి ప్రభుత్వం వచ్చాక దీనిపై ఆమె కంప్లయింట్ ఇచ్చారు. కొందరు పోలీసు అధికారులు తనను తన కుటుంబాన్ని అన్యాయంగా అరెస్టు చేసి, అక్రమంగా నిర్బంధించి, చిత్రహింసలకు గురిచేశారని విజయవాడ పోలీసు కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబుకు 2024 సెప్టెంబర్లో ఫిర్యాదు చేశారు. దీనిపై ఇబ్రహీంపట్నం పోలీసు స్టేషన్‌లో ఐపీసీ 120బీ, 166, 166ఏ, 167, 342, 354డీ, 420, 467, 469, 471, 34 సెక్షన్ల కింద కేసు (క్రైం నంబరు 469/2024) నమోదైంది. ఇందులో వైసీపీ నాయకుడు కుక్కల విద్యాసాగర్(ఏ1), నిఘా విభాగం మాజీ చీఫ్ పీఎ్‌సఆర్ ఆంజనేయులు (ఏ2), పోలీసు అధికారులు కాంతిరాణా తాతా (ఏ3), కె.హనుమంతరావు (ఏ4), ముత్యాల సత్యనారాయణ (ఏ5), విశాల్ గున్నీ (ఏ6) నిందితులుగా ఉన్నారు. ప్రభుత్వం దీనిని తీవ్రంగా పరిగణించి సీఐడీ దర్యాప్తునకు ఆదేశించింది. పీఎ్‌సఆర్, కాంతిరాణా, విశాల్ గున్నీని సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులోనూ సీఐడీ విచారణ పూర్తి చేసి కోర్టుకు చార్జిషీటు కూడా సమర్పించింది. ఈ వ్యవహారంలో ఎవరెవరు ఎలాంటి పాత్ర పోషించారో అందులో వివరించింది. కోర్టు దీనిని రిటర్న్ చేయడంతో త్వరలో తాజా చార్జిషీటు వేయనుంది.