26 నుంచి తిరుమలలో జ్యేష్టాభిషేకం
ABN , Publish Date - Jun 16 , 2026 | 04:07 AM
తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 26 నుంచి 28వ తేదీ వరకు జ్యేష్టాభిషేకం జరగనుంది. ఏటా జ్యేష్టమాసంలో జ్యేష్టా నక్షత్రానికి ముగిసేట్లు మూడ్రోజులపాటు ...
తిరుమల, జూన్ 15 (ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 26 నుంచి 28వ తేదీ వరకు జ్యేష్టాభిషేకం జరగనుంది. ఏటా జ్యేష్టమాసంలో జ్యేష్టా నక్షత్రానికి ముగిసేట్లు మూడ్రోజులపాటు శ్రీవారికి జ్యేష్టాభిషేకం నిర్వహిస్తారు. సంపంగి ప్రదక్షిణంలోని కల్యాణ మండపంలో నిర్వహించే ఈ క్రతువును ‘అభిద్యేయక అభిషేకం’ అని కూడా అంటారు. తరతరాలుగా అభిషేకాలతో అత్యంత ప్రాచీనమైన స్వామివారి ఉత్సవమూర్తులు అరిగిపోకుండా పరిరక్షించేందుకు ఈ ఉత్సవాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా మొదటి రోజు మలయప్పస్వామికి ఉన్న బంగారు కవచాన్ని తొలగించి హోమాలు, అభిషేకాలు పంచామృత స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. తర్వాత శ్రీవారికి వజ్రకవచాన్ని అలంకరిస్తారు. రెండో రోజు ముత్యాల కవచం సమర్పిస్తారు. ఇక మూడో రోజు న తిరుమంజనాదులు పూర్తిచేసి బం గారు కవచాన్ని పునఃసమర్పిస్తారు. ఈ బంగారు కవచాన్ని మళ్లీ వచ్చే ఏడాది జ్యేష్టాభిషేకం సమయంలోనే తీస్తారు. అంతవరకు ఏడాది పొడవునా శ్రీవారి బంగారు కవచంలోనే వివిధ ఉత్సవాల్లో పాల్గొంటారు. కాగా, జ్యేష్టాభిషేకాన్ని పురస్కరించుకుని ఈ నెల 28న కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవలను టీటీడీ రద్దు చేసింది.