24వేల క్రిమినల్ తీర్పులతో పుస్తకం అభినందనీయం
ABN , Publish Date - Jan 26 , 2026 | 04:09 AM
24 వేల క్రిమినల్ తీర్పులను పుస్తక రూపంలో పొందుపరచడం అభినందనీయమని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకటేశ్వర్లు నిమ్మగడ్డ అన్నారు.
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకటేశ్వర్లు నిమ్మగడ్డ
‘ఎ గ్లింప్స్ ఇన్ టు ది క్రిమినల్ మేజర్ యాక్ట్స్’ పుస్తకావిష్కరణ
న్యాయాధికారి రాజావెంకటాద్రికి ప్రశంస
ఒంగోలు(రూరల్), జనవరి 25(ఆంధ్రజ్యోతి): 24 వేల క్రిమినల్ తీర్పులను పుస్తక రూపంలో పొందుపరచడం అభినందనీయమని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకటేశ్వర్లు నిమ్మగడ్డ అన్నారు. ప్రకాశం జిల్లా అదనపు న్యాయాధికారి టి. రాజావెంకటాద్రి రచించిన ‘ఎ గ్లింప్స్ ఇన్ టు ది క్రిమినల్ మేజర్ యాక్ట్స్’ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం ఒంగో లు నగర పరిధిలోని పెళ్లూరు వద్ద ఇందిరా ప్రియదర్శిని న్యాయ కళాశాలలో అట్టహాసంగా జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన జస్టిస్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ న్యాయవిద్య అభ్యసించే విద్యార్థులు, లాయర్లు, న్యాయమూర్తులు ఈ పుస్తకాన్ని తప్పనిసరిగా చదవాలని సూచించారు. న్యాయాధికారిగా రాజావెంకటాద్రికి 30 ఏళ్ల అనుభవం ఉందని, తన అనుభవాలను, దేశంలోని కోర్టులు ఇచ్చిన క్రిమినల్ తీర్పులను అధ్యయనం చేసి 24 వేల తీర్పులను ఒక పుస్తకం రూపంలోకి తీసుకొచ్చారని చెప్పారు. ఇది ఎంతో కష్టతరమైన, ఖర్చుతో కూడిన పని అని తెలిపారు. పుస్తక రచయిత, జిల్లా అదనపు న్యాయాధికారి రాజావెంకటాద్రి మాట్లాడుతూ ఈ పుస్తక రచనకు ఆరేళ్ల ఒకనెల సమయం పట్టిందని చెప్పారు. కుటుంబ సభ్యుల సహకారంతోనేఇలాంటి పుస్తకం రాయగలిగానని పేర్కొన్నారు. న్యాయవాద వృత్తిలో ఉన్నవారికి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా న్యాయాధికారి టి.రాజ్యలక్ష్మి, ఒంగోలు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బొడ్డు భాస్కరరావు, న్యాయకళాశాల కరస్పాండెంట్ రామకృష్ణ, ప్రిన్స్‌పాల్ కె.నటరాజకుమార్ పాల్గొన్నారు.