పట్నా హైకోర్టు సీజేగా జస్టిస్ వల్లూరి కామేశ్వరరావు
ABN , Publish Date - Aug 10 , 2026 | 03:45 AM
పట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జస్టిస్ వల్లూరి కామేశ్వరరావును నియమితులు కానున్నారు.
కేంద్రానికి సుప్రీం కొలీజియం సిఫారసు
మరో మూడు హైకోర్టులకూ కొత్త చీఫ్ జస్టి్‌సలు
రాష్ట్రపతి ఆమోదించగానే బాధ్యతల స్వీకారం
జస్టిస్ కామేశ్వరరావు కోనసీమ బిడ్డ
అమలాపురంలో జననం.. స్వగ్రామం పొన్నమండ
కాకినాడ/న్యూఢిల్లీ, ఆగస్టు 9(ఆంధ్రజ్యోతి): పట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జస్టిస్ వల్లూరి కామేశ్వరరావును నియమితులు కానున్నారు. ఆయనతో పాటు బాంబే హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రవీంద్ర విఠల్‌రావు ఘుగేను కలకత్తా హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా.. అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మహేశ్‌చంద్ర త్రిపాఠిని బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా.. ప్రస్తుతం పంజాబ్-హరియాణా హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ అశ్వినీకుమార్ మిశ్రాను అదే హైకోర్టు చీఫ్ జస్టి్‌సగా నియమించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ సారథ్యంలోని కొలీజియం కేంద్రప్రభుత్వానికి తాజాగా సిఫారసు చేసింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేయగానే వారి నియామకాలపై కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ జారీచేస్తుంది. జస్టిస్ కామేశ్వరరావు ఆంధ్రప్రదేశ్‌లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో 1965 ఆగస్టు 7న ఆయన జన్మించారు. స్వగ్రామం రాజోలు మండలంలోని పొన్నమండ. ఉద్యోగ రీత్యా ఆయన తండ్రి వాసుదేవమూర్తి ఢిల్లీలో స్థిరపడడంతో ఆయన విద్యాభ్యాసం మొత్తం ఢిల్లీలోనే జరిగింది. 1987లో ఢిల్లీ యూనివర్సిటీ నుంచి భౌగోళిక శాస్త్రంలో బీఏ (ఆనర్స్) పట్టా, 1990లో ఎల్‌ఎల్‌బీ పట్టా పొందారు. 1991 మార్చిలో ఢిల్లీ బార్ కౌన్సిల్‌లో అడ్వకేట్‌గా ఎన్‌రోల్ అయ్యారు.
ఢిల్లీ హైకోర్టు, మద్రాస్ హైకోర్టు, కలకత్తా హైకోర్టు పోర్ట్ బ్లెయిర్ బెంచ్, సుప్రీంకోర్టు, సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ (క్యాట్-ఢిల్లీ) ప్రధాన ధర్మాసనంలో న్యాయవాదిగా ప్రాక్టీసు చేశారు. సర్వీసు, కార్మిక చట్టాలు, మధ్యవర్తిత్వం, రాజ్యాంగం, పరిపాలనా చట్టాల కేసులు వాదించారు. పలు ప్రభుత్వ రంగ సంస్థలకు ప్రాతినిధ్యం వహించారు. 2010 జనవరిలో ఢిల్లీ హైకోర్టు సీనియర్ న్యాయవాది అయ్యారు. 2013 ఏప్రిల్ 17న అదే హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా, 2015 మార్చి 18న శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2024 అక్టోబరు 1న కర్ణాటక హైకోర్టు తాత్కాలిక చీఫ్ జస్టి్‌సగా బాధ్యతలు స్వీకరించారు. 2025 మే 29 వరకు అక్కడ కొనసాగారు. తర్వాత ఢిల్లీ హైకోర్టుకు తిరిగి బదిలీ అయ్యారు. 30 ఏళ్లు న్యాయవాదిగా, 11 ఏళ్లపాటు న్యాయమూర్తిగా అపార అనుభవం ఉన్న జస్టిస్ కామేశ్వరరావును పట్నా హైకోర్టు సీజేగా నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేయడంపై ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.