Share News

ప్రశ్నతోనే చైతన్యం

ABN , Publish Date - Jul 12 , 2026 | 05:23 AM

‘సమాజంలో ప్రశ్న ఉన్నప్పుడే చైతన్యం పెరుగుతుంది. సమాజాన్ని ప్రగతిపథం వైపు నడిపించడానికి చైతన్యం చాలా అవసరం. అది విద్యతోనే వస్తుంది.

ప్రశ్నతోనే చైతన్యం

  • దానితోనే ప్రగతిశీల సమాజం

  • మహిళలు ఆత్మవిశ్వాసంతో సాగాలి: జస్టిస్‌ పీవీ జ్యోతిర్మయి

  • విజయవాడలో 3వ అంతర్జాతీయ తెలుగు రచయిత్రుల మహాసభలు ప్రారంభం

విజయవాడ, జూలై 11 (ఆంధ్రజ్యోతి): ‘సమాజంలో ప్రశ్న ఉన్నప్పుడే చైతన్యం పెరుగుతుంది. సమాజాన్ని ప్రగతిపథం వైపు నడిపించడానికి చైతన్యం చాలా అవసరం. అది విద్యతోనే వస్తుంది. రచయితలు, రచయిత్రులు సమాజంలో చైతన్యాన్ని నింపే రచనలు చేయాలి. మహిళలు ఆత్మవిశ్వాసంతో అడుగులు వేయాలి’ అని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ పీవీ జ్యోతిర్మయి అన్నారు. విజయవాడలోని కేబీఎన్‌ కళాశాల ఆవరణలో 3వ అంతర్జాతీయ తెలుగు రచయిత్రుల మహాసభలు శనివారం ప్రారంభమయ్యాయి. సాయంత్రం విదుషీమణుల సత్కార సభలో జస్టిస్‌ జ్యోతిర్మయి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ మహాసభల సందర్భంగా ముద్రించిన ‘ప్రమదావనం’ పుస్తకాన్ని హోం మంత్రి అనిత ఆవిష్కరించారు. సభారంభంలో అతిథులంతా మాజీ మంత్రి, రచయిత దివంగత మండలి వెంకట కృష్ణారావు విగ్రహానికి పూలుచల్లి నివాళులర్పించారు. జస్టిస్‌ జోతిర్మయి మాట్లాడుతూ... ‘ఆత్మగౌరవం ఒకరిస్తే వచ్చేది కాదు, తీస్తే పోయేదీ కాదు. ఆత్మవిశ్వాసం ఉంటే అన్నీ ఉన్నట్టే. ఓటమిని అవకాశంగా మలుచుకుని గెలుపు వైపు పరుగులు తీసే అంతఃశక్తిని పెంపొందించుకోవాలి. భావ వ్యక్తీకరణకు మాతృభాష ఒక్కటే ఏకైక మార్గం. రచయిత్రులు అనగానే మా అమ్మమ్మ పీసపాటి వరలక్ష్మి గుర్తుకు వస్తారు. ఆమె దీవెనలతోనే నేను మాతృభాషలో పద ప్రయోగాలు చేస్తుంటాను. ఒకప్పుడు న్యాయవ్యవస్థలో జూనియర్‌ సివిల్‌ జడ్జి పోస్టులకు నియామకాలు జరిగితే 70ు మంది పురుషులు, 20ు మంది మహిళలు ఎంపికయ్యేవారు.


ఇప్పడు 65 పోస్టులను భర్తీ చేస్తే అందులో 30 మందికి పైగా మహిళలు ఉంటున్నారు. కోర్టు తీర్పులను ఆయా మాతృ భాషల్లోకి అనువదించి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచాలని సుప్రీంకోర్టు, కేంద్ర ప్రభుత్వం ఒక ప్రాజెక్టును చేపట్టాయి. దీనికి ఓ కమిటీని ఏర్పాటు చేశాయి. ఆ కమిటీలో నేనూ సభ్యురాలినే. తీర్పులను అనువదించేటప్పుడు కొన్ని ఆంగ్ల పదాలకు తెలుగులో సమాన పదాలను వెతుక్కోవాల్సి వస్తోంది. మన భాషను మనమే పాడు చేసుకుంటున్నాం. నా చాంబర్‌లోని బోర్డుపై ప్రతిరోజూ ఒక మంచి మాట రాస్తుంటాను’ అన్నారు. కార్యక్రమంలో అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్‌, మహాసభల గౌరవ కార్యనిర్వాహక కార్యదర్శి వై.లక్ష్మీప్రసాద్‌, మహిళా కమిషన్‌ మాజీ చైర్‌పర్సన్‌ నన్నపనేని రాజకుమారి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 12 , 2026 | 05:24 AM