Share News

Supreme Court Justice P. S. Srinivas: భాష ఓ ప్రపంచాన్ని సృష్టిస్తుంది

ABN , Publish Date - Jan 04 , 2026 | 04:18 AM

భాష కేవలం భావ వ్యక్తీకరణే కాదు. దానికి ఒక ప్రపంచాన్ని సృష్టించగలిగే బలం ఉంది. మనం రెండు బంధాలతో పుడతాం. ఒకటి మాతృ బంధం అయితే...

Supreme Court Justice P. S. Srinivas: భాష ఓ ప్రపంచాన్ని సృష్టిస్తుంది

  • బంధుత్వ బంధాలను ఏర్పాటు చేస్తుంది

  • అది లేకపోతే గుర్తింపు, గౌరవం ఉండదు

  • తెలుగు టీచర్లకు గౌరవమివ్వకుంటే అది సమాజమే కాదు

  • జిల్లా కోర్టు వరకూ ప్రొసీడింగ్స్‌ తెలుగులోనే ఉండాలి

  • ప్రపంచ తెలుగు మహాసభల్లో జస్టిస్‌ శ్రీ నరసింహ

గుంటూరు, జనవరి 3(ఆంధ్రజ్యోతి): ‘భాష కేవలం భావ వ్యక్తీకరణే కాదు. దానికి ఒక ప్రపంచాన్ని సృష్టించగలిగే బలం ఉంది. మనం రెండు బంధాలతో పుడతాం. ఒకటి మాతృ బంధం అయితే... రెండోది భాషా బంధం’ అని సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ పమడిఘంటం శ్రీ నరసింహ అన్నారు. శనివారం గుంటూరులో ప్రారంభమైన తెలుగు మహాసభలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆంధ్ర సారస్వత పరిషత్‌ అధ్యక్షుడు కేశిరాజు(గజల్‌) శ్రీనివాస్‌ అధ్యక్షతన జరిగిన ప్రారంభ సభలో జస్టిస్‌ శ్రీ నరసింహ మాతృభాష ప్రాధాన్యతను వివరించారు. ‘రాజ్యాంగంలో మూడు ముఖ్యమైన విషయాలు గురించి చెప్పారు. ఒకటి స్వేచ్ఛ, రెండోది సమానత్వం. మూడో దానికి రాజ్యాంగంలో ఏ పదం వాడినా, వాడకపోయినా దానిని తెలుగులో బంధుత్వం అని చెప్పుకోవచ్చు. ఇది చాలా పెద్ద విషయం. బంధుత్వంలో ఉన్న తత్త్వం... కలిపి ఉంచడం. మనమందరం భాష వలన బంధువులం. బంధుత్వం వల్ల గుర్తింపు కలుగుతుంది. ఇతనెవరు అంటే... ఆ బంధం మూలంగా తెలుగువాడు అంటాం. భాష జీవం పోసుకొన్న మనిషిలాంటిదే. మనతోపాటే మనస్సులో, ఆత్మలో ఉంటుంది. వాడుక లేకపోతే మనిషిలానే క్షీణమైపోతుంది. అందుకే భాషని కాపాడుకోవడం చాలా ముఖ్యం. వాడుక లేనిదే భాష ఉండదు. మనకు గౌరవం, గుర్తింపు, బంధం ఉండదు. భాషని వాడుకలో ఉంచుకోవాలంటే పరిపాలన, అధికారిక వ్యవహారాల్లో తప్పనిసరి చేయాలి. జిల్లా కోర్టు వరకు ప్రొసీడింగ్స్‌ తెలుగు భాషలోనే ఉండాలి. పాఠశాలల్లో తప్పనిసరిగా తెలుగు భాషని అమలు చేయాలి. తెలుగు ఉపాధ్యాయులకు తగిన గౌరవం ఇవ్వడం లేదనేది నా భావన. తెలుగు టీచర్లకి కాళ్లు కడిగి దండం పెట్టాలి. తెలుగు ఉపాధ్యాయులను గౌరవించకపోతే అది సమాజమే కాదు. వారికి గౌరవం ఇచ్చి, కాపాడుకుంటే భాషను కాపాడుకోగలుగుతాం. మంచి నడవడిక తల్లిదండ్రుల పెంపకంలో ఉంటుంది. దానికి భాష తోడౌతుంది. చిన్నప్పటి నుంచి చందమామ పాటలు, చిన్న సామెతలు చెబితే అవి వ్యక్తిత్వంలో ఇమిడిపోతాయి’ అని జస్టిస్‌ శ్రీ నరసింహ వివరించారు.


ఎన్‌టీఆర్‌ కళావేదికపై కార్యక్రమాలు అభినందనీయం: స్పీకర్‌ అయ్యన్న

తెలుగుని దేశ, విదేశాలకు చాటి చెప్పిన ఎన్‌టీఆర్‌ కళావేదికపై తెలుగు మహాసభ కార్యక్రమాలు జరుగుతుండటం అభినందనీయమని అసెంబ్లీ స్పీకర్‌ చింతకాయల అయ్యన్న పాత్రుడు అన్నారు. ‘మాతృ భాషని మరిచిపోతే అమ్మని మరిచినట్లే. తెలుగు భాషని ఎలా ముందుకు తీసుకెళ్లాల్లో ఈ సభల్లో చర్చించి ఆ ప్రతిపాదనలను అందజేస్తే నేను అసెంబ్లీలో చర్చకు పెట్టి ఆమోదం పొందేలా చేస్తా. ఈ మూడు రోజులు ఇక్కడే ఉండి తెలుగు మహాసభలను పర్యవేక్షిస్తా’ అని అన్నారు. హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ గోడ రఘురాం మాట్లాడుతూ... ‘అనతికాలంలో జిల్లా స్థాయి కోర్టుల్లో తీర్పులు తెలుగులో ఇస్తే భాషకు కొంత ప్రోత్సాహం కలుగుతుంది. ఆ దిశగా మనం ప్రయత్నం చేయాలి. న్యాయవృత్తిలో ఉండే ఎన్నో కీలకమైన పదాలకు తెలుగు పర్యాయపదాలు అనువర్తింప చేసుకోవాలి’ అని అన్నారు. కనీసం ఎనిమిదో తరగతి వరకు తెలుగు మీడియంలోనే పాఠశాలల్లో విద్యార్థులకు బోధన జరగాలని సీబీఐ విశ్రాంత జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. కార్యక్రమంలో విశ్వయోగి విశ్వంజీ మహరాజ్‌, కొప్పరపు కవుల సాహితీపీఠం నుంచి మా శర్మ, మహాసభల సమన్వయకర్త రామచంద్రరాజు, తానా పూర్వ అధ్యక్షుడు తోటకూర ప్రసాదు, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.

వైభవంగా ప్రారంభమైన తెలుగు మహాసభలు

ఆంధ్ర సారస్వత పరిషత్‌ మూడో ప్రపంచ తెలుగు మహాసభలు - 2026 గుంటూరు శివారులోని శ్రీసత్యసాయి ఆధ్యాత్మిక నగర ప్రాంగణంలో శనివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. అన్నమయ్య కీర్తనల సహస్ర గళార్చనలు, వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు, ఆధ్యాత్మిక ప్రవచనాలు, గీతాలాపనలు, కవి సమ్మేళనాలతో ప్రాంగణమంతటా తెలుగుదనం తొణికిసలాడింది. తెలుగుతల్లి, వేంకటేశ్వరస్వామి, ఎన్‌టీ రామారావు విగ్రహాలతో ప్రధాన వేదిక కళకళలాడింది. మొత్తం ఐదు వేదికల మీద వివిధ కార్యక్రమాలు ఉదయం నుంచి రాత్రి వరకు కొనసాగాయి. దేశ, విదేశాల నుంచి తెలుగు భాషాప్రియులు తరలివచ్చారు.

Updated Date - Jan 04 , 2026 | 04:18 AM