ప్రజలకు సత్వర న్యాయమే లక్ష్యం
ABN , Publish Date - Apr 27 , 2026 | 05:28 AM
ప్రజలకు సత్వర న్యాయం అందించటమే తమ ప్రధాన లక్ష్యమని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు అన్నారు.
హైకోర్టు జడ్జీలు జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, జస్టిస్ లక్ష్మణరావు
కనిగిరి, గిద్దలూరు టౌన్: ఏప్రిల్ 26(ఆంధ్రజ్యోతి): ప్రజలకు సత్వర న్యాయం అందించటమే తమ ప్రధాన లక్ష్యమని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు అన్నారు. మార్కాపురం జిల్లా కనిగిరి పట్టణంలో ఆదివారం అదనపు సివిల్ కోర్టును హైకోర్డు జడ్జీలు జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, జస్టిస్ వై.లక్ష్మణరావు ప్రారంభించారు. అలాగే, మార్కాపురం జిల్లా గిద్దలూరు కోర్టు భవనాల సముదాయంలో 2వ అదనపు జూనియర్ సివిల్ కోర్టును హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో కోర్టుల సంఖ్య పెరగటం వల్ల ప్రజలు దూరప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గుతుందని, కేసుల పరిష్కారం వేగవంతమవుతుందని చెప్పారు. జస్టిస్ వై.లక్ష్మణరావు మాట్లాడుతూ పెండింగ్ కేసుల భారం తగ్గించి, త్వరతగతిన న్యాయం అందించడంలో ఈ కోర్టు కీలకపాత్ర పోషిస్తుందన్నారు. స్థానిక ప్రజలకు న్యాయసేవలు మరింత అందుబాటులోకి వస్తాయని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ విజయసునీత, జిల్లా న్యాయాధికారి రాజ్యలక్ష్మి, ఎస్పీ హర్షవర్ధన్‌రాజు తదితరులు పాల్గొన్నారు.