Share News

ఏపీ లోకాయుక్తగా జస్టిస్‌ మల్లికార్జునరావు

ABN , Publish Date - Aug 20 , 2026 | 04:40 AM

ఏపీ లోకాయుక్తగా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ తల్లాప్రగడ మల్లికార్జునరావు నియమితులయ్యారు. సీఎం నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ..

ఏపీ లోకాయుక్తగా జస్టిస్‌ మల్లికార్జునరావు

  • నియామకానికి గవర్నర్‌ ఆమోదం.. ఉత్తర్వులు జారీ

అమరావతి/కర్నూలు లీగల్‌, ఆగస్టు 19(ఆంధ్రజ్యోతి): ఏపీ లోకాయుక్తగా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ తల్లాప్రగడ మల్లికార్జునరావు నియమితులయ్యారు. సీఎం నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ ఆయన్ను ఎంపిక చేసి ఆమోదం కోసం ఫైలును గవర్నర్‌కు పంపింది. గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ ఇందుకు ఆమోదముద్ర వేశారు. లోకాయుక్తగా జస్టిస్‌ మల్లికార్జునరావు నియామకానికి సంబంధించి ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. నియామకపు తేదీ నుంచి ఐదేళ్ల పాటు ఆయన పదవిలో కొనసాగుతారు. జస్టిస్‌ మల్లికార్జునరావును లోకాయుక్తగా నియమించడంతో కేసుల విచారణ పూర్తిస్థాయిలో కొనసాగుతాయని న్యాయవాదులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ నేపథ్యం: జస్టిస్‌ తల్లాప్రగడ మల్లికార్జునరావు 1964 జనవరి 19న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పుల్లేటికుర్రులో వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. శ్రీరామచంద్రమూర్తి, రమణ దంపతులకు ద్వితీయ పుత్రుడు. ఆయన స్వస్థలం అయినవిల్లి మండలం నేదునూరు. అక్కడే పదో తరగతి వరకు చదివారు. అమలాపురంలో బీఎస్సీ అభ్యసించారు. రాజమహేంద్రవరంలోని జీఎ్‌సకేఎం న్యాయ కళాశాలలో న్యాయశాస్త్రం చదివారు. 1988లో న్యాయవాదిగా నమోదు చేసుకున్నారు. అనంతరం న్యాయాధికారిగా ఎంపికైన ఆయన ప్రస్తుత బాపట్ల జిల్లా పర్చూరులో 1994లో అదనపు డిస్ట్రిక్ట్‌ మున్సి్‌ఫగా బాధ్యతలు చేపట్టారు. ధర్మవరం, అనకాపల్లి, విశాఖపట్నం తదితర ప్రాంతాల్లో న్యాయాధికారిగా సేవలు అందించారు. 2007లో సీనియర్‌ సివిల్‌ జడ్జిగా, 2015లో జిల్లా జడ్జిగా పదోన్నతి పొంది మచిలీపట్నం, ఏలూరులో పనిచేశారు. 2022 ఆగస్టు 4న ఏపీ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. 2024 మార్చి 14న శాశ్వత న్యాయమూర్తిగా నియమితులై ప్రమాణం చేశారు. ఈ ఏడాది జనవరి 18న పదవీ విరమణ చేశారు.

Updated Date - Aug 20 , 2026 | 04:40 AM