Share News

జస్టిస్‌ లీసా గిల్‌ ప్రమాణ స్వీకారం నేడు

ABN , Publish Date - Mar 13 , 2026 | 04:18 AM

ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ లీసా గిల్‌ శుక్రవారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. హైకోర్టులోని మొదటి కోర్టు హాలులో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌ జస్టిస్‌ లీసా గిల్‌తో ఉదయం....

జస్టిస్‌ లీసా గిల్‌ ప్రమాణ స్వీకారం నేడు

  • ప్రమాణం చేయించనున్న జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌

అమరావతి, మార్చి 12(ఆంధ్రజ్యోతి): ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ లీసా గిల్‌ శుక్రవారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. హైకోర్టులోని మొదటి కోర్టు హాలులో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌ జస్టిస్‌ లీసా గిల్‌తో ఉదయం 10.15 నిమిషాలకు ప్రమాణం చేయించనున్నారు. పంజాబ్‌-హరియాణా ఉమ్మడి హైకోర్టు నుంచి బదిలీపై వస్తున్న జస్టిస్‌ లీసా గిల్‌ ఇక్కడ రెండోస్థానంలో కొనసాగుతారు. ఇటీవల సుప్రీంకోర్టు కొలీజియం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల నియామకం విషయంలో ముఖ్యమైన విధానపరమైన నిర్ణయం తీసుకుంది. న్యాయ పరిపాలనలో సామర్థ్యాన్ని, నాణ్యతను మరింత బలోపేతం చేయడానికి చీఫ్‌ జస్టి్‌స(సీజే) కాబోయే న్యాయమూర్తిని ఆ పదవికి ఖాళీ ఏర్పడడానికి రెండు నెలల ముందే సంబంధిత కోర్టుకు బదిలీ చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా పంజాబ్‌-హరియాణా ఉమ్మడి హైకోర్టులో మూడోస్థానంలో ఉన్న జస్టిస్‌ లీసా గిల్‌ను ఏపీ హైకోర్టుకు బదిలీ చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఈ బదిలీకి రాష్ట్రపతి ద్రౌపదిముర్ము ఆమోదముద్ర వేసిన విషయం తెలిసిందే. కాగా, ఏపీ హైకోర్టులో 37మంది జడ్జీల నియామకానికి ఆమోదం ఉండగా ప్రస్తుతం జస్టిస్‌ లీసా గిల్‌ చేరికతో ఈ సంఖ్య 34కి చేరనుంది. ప్రస్తుత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌ ఏప్రిల్‌ 24న పదవీ విరమణ చేయనుండగా, ఆ వెంటనే సీజేగా జస్టిస్‌ లీసా గిల్‌ బాధ్యతలు చేపడతారు. ఈ నియామకం ద్వారా ఏపీ హైకోర్టు మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా ఆమె చరిత్రకెక్కనున్నారు.


జస్టిస్‌ లీసాగిల్‌కు ఘన స్వాగతం

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుకు బదిలీపై వచ్చిన న్యాయమూర్తి జస్టిస్‌ లీసా గిల్‌కు గన్నవరం విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. గురువారం ఉదయం విమానంలో విమానాశ్రయానికి రాగా గుడివాడ ఆర్డీవో జి.బాలసుబ్రహ్మణ్యం, పలువురు న్యాయమూర్తులు పుష్పగుచ్ఛాలు అందజేసి సాదర స్వాగతం పలికారు. అనంతరం జస్టిస్‌ లీసా గిల్‌ రోడ్డు మార్గాన అమరావతి వెళ్లారు.

Updated Date - Mar 13 , 2026 | 04:19 AM