Share News

ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ లీసా గిల్‌ ప్రమాణం

ABN , Publish Date - Mar 14 , 2026 | 04:11 AM

ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ లీసా గిల్‌ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టులోని మొదటి కోర్టు హాల్‌లో జస్టిస్‌ లీసా గిల్‌తో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌ ప్రమాణ స్వీకారం చేయించారు.

ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ లీసా గిల్‌ ప్రమాణం

  • ప్రమాణ స్వీకారం చేయించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌

అమరావతి, మార్చి 13(ఆంధ్రజ్యోతి): ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ లీసా గిల్‌ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టులోని మొదటి కోర్టు హాల్‌లో జస్టిస్‌ లీసా గిల్‌తో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. తొలుత జస్టిస్‌ లీసా గిల్‌ బదిలీకి సంబంధించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ వైవీఎ్‌సబీజీ పార్థసారథి చదివి వినిపించారు. జస్టిస్‌ లీసా గిల్‌ ప్రస్తుతం ఏపీ హైకోర్టులో రెండోస్థానంలో ఉన్నారు. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌ ఏప్రిల్‌ 24న పదవీ విరమణ చేయనున్నారు. ప్రధాన న్యాయమూర్తి పదవికి ఖాళీ ఏర్పడిన వెంటనే ఏపీ హైకోర్టు సీజేగా జస్టిస్‌ లీసా గిల్‌ బాధ్యతలు చేపడతారు. ఏపీ హైకోర్టు మొదటి మహిళ ప్రధాన న్యాయమూర్తిగా చరిత్రకెక్కుతారు. ఏపీ హైకోర్టులో 37మంది జడ్జీల నియామకానికి ఆమోదం ఉంది. ఆమె చేరికతో న్యాయమూర్తుల సంఖ్య 34కు చేరింది. కాగా, ప్రమాణ స్వీకార కార్యక్రమానికి జస్టిస్‌ లీసా గిల్‌ కుటుంబ సభ్యులు, అడ్వొకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివాస్‌, అదనపు ఏజీ సాంబశివ ప్రతాప్‌, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ మెండ లక్ష్మీనారాయణ, అదనపు సొలిసిటర్‌ జనరల్‌ చల్లా ధనంజయ, ఏపీ బార్‌ కౌన్సిల్‌ అధ్యక్షులు ద్వారకానాథరెడ్డి, హైకోర్టు న్యాయవాదుల సంఘం ఉపాధ్యక్షుడు కేవీ రఘువీర్‌, రిజిస్ట్రార్‌లు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది హాజరయ్యారు.

ఇదీ నేపథ్యం..

జస్టిస్‌ లీసా గిల్‌ పాఠశాల విద్యను ఛండీగఢ్‌లో పూర్తి చేశారు. జీసీజీ కళాశాల నుంచి హ్యుమానిటీస్‌లో పట్టభద్రులయ్యారు. పంజాబ్‌ విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. 1990లో న్యాయవాదిగా ఎన్‌రోల్‌ అయ్యారు. అనంతరం పంజాబ్‌, హరియాణా హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్‌ చేశారు. చండీగఢ్‌ కేంద్రపాలిత ప్రాంతంతోపాటు పలు బోర్డులు, కార్పొరేషన్లకు ప్రాతినిథ్యం వహించారు. 2014 మార్చి 31న పంజాబ్‌, హరియాణా హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.

Updated Date - Mar 14 , 2026 | 04:14 AM