హైకోర్టు సీజేగా జస్టిస్ లీసా గిల్ ప్రమాణం
ABN , Publish Date - Apr 26 , 2026 | 04:22 AM
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లీసాగిల్ ప్రమాణం చేశారు. శనివారం రాత్రి 7.30 గంటలకు విజయవాడలోని లోక్‌భవన్‌లో గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు.
ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్ అబ్దుల్ నజీర్
ఏపీ హైకోర్టు తొలి మహిళా సీజేగా బాధ్యతలు
అమరావతి, ఏప్రిల్ 25(ఆంధ్రజ్యోతి): హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లీసాగిల్ ప్రమాణం చేశారు. శనివారం రాత్రి 7.30 గంటలకు విజయవాడలోని లోక్‌భవన్‌లో గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. అంతకుముందు ఆమెను సీజేగా నియమిస్తూ రాష్ట్రపతి ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ వీఎ్‌సబీజీ పార్థసారధి చదివి వినిపించారు. ప్రమాణస్వీకారం అనంతరం గవర్నర్ అబ్దుల్ నజీర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ పుష్పగుచ్ఛాలు అందించి జస్టిస్ లీసాగిల్‌కు అభినందనలు తెలిపారు. జస్టిస్ లీసాగిల్ ఏపీ హైకోర్టుకు ఐదో ప్రధాన న్యాయమూర్తి. ఏపీ హైకోర్టు మొదటి మహిళా సీజేగా ఆమె చరిత్రకెక్కారు. సీజే ప్రమాణస్వీకార కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, పలువురు విశ్రాంత న్యాయమూర్తులు, మంత్రి కందుల దుర్గేష్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్, సాధారణ పరిపాలనశాఖ(పొలిటికల్) ముఖ్యకార్యదర్శి శ్యామలరావు, డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా, అదనపు సొలిసిటర్ జనరల్ చల్లా ధనంజయ, అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, అదనపు అడ్వొకేట్ జనరల్ సాంబశివప్రతాప్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండ లక్ష్మీనారాయణ, బార్‌కౌన్సిల్ చైర్మన్ ద్వారకానాథ్‌రెడ్డి, హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు వాసిరెడ్డి ప్రభునాథ్, హైకోర్టు న్యాయవాదులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అలాగే, జస్టిస్ లీసాగిల్ స్వస్థలం చండీగఢ్ నుంచి కుటుంబ సభ్యులు, బంధువులు, పంజాబ్-హరియాణా హైకోర్టు నుంచి పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు తరలివచ్చారు. కార్యక్రమం అనంతరం గవర్నర్ అబ్దుల్ నజీర్ ఇచ్చిన విందులో జస్టిస్ లీసాగిల్, న్యాయమూర్తులు, అతిథులు పాల్గొన్నారు. కాగా, హైకోర్టులో మొత్తం 37మంది న్యాయమూర్తుల నియామకానికి ఆమోదం ఉండగా, ప్రస్తుతం 32 మంది న్యాయమూర్తులు విధులు నిర్వర్తిస్తున్నారు.