హైకోర్టు సీజేగా జస్టిస్ లీసాగిల్
ABN , Publish Date - Apr 23 , 2026 | 03:15 AM
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లీసాగిల్ నియమితులయ్యారు. ఈ నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేయడంతో కేంద్ర న్యాయశాఖ బుధవారం గెజిట్ నోటిఫికేషన్‌ను జారీ చేసింది.
నియామకానికి రాష్ట్రపతి ముర్ము ఆమోదం
ఎల్లుండి ప్రమాణం చేయించనున్న గవర్నర్
ఏపీ తొలి మహిళా సీజేగా చరిత్ర
రేపు జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్ పదవీ విరమణ
అమరావతి, ఏప్రిల్ 22(ఆంధ్రజ్యోతి): హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లీసాగిల్ నియమితులయ్యారు. ఈ నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేయడంతో కేంద్ర న్యాయశాఖ బుధవారం గెజిట్ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఈ నియామకం ఈ నెల 25 నుంచి అమల్లోకి వస్తుందని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. హైకోర్టు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్ ఈనెల 24న పదవీ విరమణ చేయనున్నారు. 25 నుంచి జస్టిస్ లీసాగిల్ హైకోర్టు సీజేగా వ్యవహరించనున్నారు. రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ఈనెల 25న జస్టిస్ లీసాగిల్‌తో సీజేగా ప్రమాణం చేయించనున్నారు. రాష్ట్ర హైకోర్టు మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లీసాగిల్ చరిత్రకెక్కనున్నారు. పంజాబ్-హరియాణా హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తున్న జస్టిస్ లీసాగిల్‌ను గతనెలలోనే ఏపీ హైకోర్టుకు బదిలీ చేశారు. దీంతో గతనెల 13న ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా ఆమె ప్రమాణం చేశారు.
నేపథ్యం ఇదీ... జస్టిస్ లీసాగిల్ పాఠశాల విద్యను చండీగఢ్‌లోని సెక్టార్ 9లో ఉన్న కార్మెల్ కాన్వెంట్‌లో పూర్తి చేశారు. జీసీజీ కళాశాల నుంచి హ్యుమానిటీస్ విభాగంలో పట్టభద్రులయ్యారు. పంజాబ్ విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. 1990లో న్యాయవాదిగా ఎన్‌రోల్ అయ్యారు. అనంతరం పంజాబ్-హరియాణా హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. క్రిమినల్, సివిల్, సర్వీస్, రెవెన్యూ, రాజ్యాంగపరమైన కేసులు వాదించడంలో నైపుణ్యం గడించారు. చండీగఢ్ కేంద్రపాలిత ప్రాంతంతో పాటు పలు బోర్డులు, కార్పొరేషన్లకు ప్రాతినిధ్యం వహించారు. 2014 మార్చి 31న పంజాబ్-హరియాణా హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.