ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్
ABN , Publish Date - Mar 07 , 2026 | 04:16 AM
పంజాబ్, హరియాణా హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ లీసా గిల్ ఏపీ హైకోర్టుకు బదిలీ అయ్యారు. రాష్ట్రపతి ముర్ము ఆమోదముద్రతో బదిలీపై కేంద్ర న్యాయశాఖ శుక్రవారం నోటిఫికేషన్ జారీచేసింది.
నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్ర న్యాయ శాఖ
అమరావతి, మార్చి 6(ఆంధ్రజ్యోతి): పంజాబ్, హరియాణా హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ లీసా గిల్ ఏపీ హైకోర్టుకు బదిలీ అయ్యారు. రాష్ట్రపతి ముర్ము ఆమోదముద్రతో బదిలీపై కేంద్ర న్యాయశాఖ శుక్రవారం నోటిఫికేషన్ జారీచేసింది. ప్రస్తుత ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్ ఏప్రిల్ 24న పదవీ విరమణ చేయనున్నారు. ఈ ఖాళీ ఏర్పడిన వెంటనే ఏపీ హైకోర్టు సీజేగా జస్టిస్ లీసా గిల్ బాధ్యతలు చేపడతారు. ఏపీ హైకోర్టు మొదటి మహిళా సీజేగా చరిత్రకెక్కుతారు. ఇటీవల సుప్రీంకోర్టు కొలీజియం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల నియామకంలో ముఖ్యమైన విధాన నిర్ణయం తీసుకుంది. న్యాయ పరిపాలనలో సామర్థ్యాన్ని, నాణ్యతను మరింత బలోపేతం చేయడానికి వీలుగా చీఫ్ జస్టి్‌స(సీజే) కాబోయే న్యాయమూర్తిని ఆ పదవికి ఖాళీ ఏర్పడడానికి రెండు నెలల ముందే సంబంధిత కోర్టుకు బదిలీ చేయాలని నిర్ణయించింది. దీనివల్ల తదుపరి సీజేగా బాధ్యతలు చేపట్టబోయే న్యాయమూర్తికి ఆ హైకోర్టు వ్యవహారాలపై అవగాహన పెరుగుతుందని కొలీజియం భావన.
ఇదీ నేపథ్యం..: జస్టిస్ లీసాగిల్ ఛండీగఢ్‌లోని కార్మెల్ కాన్వెంట్‌లో పాఠశాల విద్యను పూర్తి చేశారు. జీసీజీ కళాశాల నుంచి హ్యుమానిటీ్‌సలో పట్టభద్రులయ్యారు. పంజాబ్ విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. 1990లో న్యాయవాదిగా ఎన్‌రోల్ అయ్యారు. అనంతరం పంజాబ్, హరియాణా హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. క్రిమినల్, సివిల్, సర్వీస్, రెవెన్యూ, రాజ్యాంగపరమైన కేసులు వాదించడంలో నైపుణ్యం గడించారు. ఛండీగఢ్ కేంద్రపాలిత ప్రాంతంతోపాటు పలు బోర్డులు, కార్పొరేషన్లకు ప్రాతినిధ్యం వహించారు. 2014 మార్చి 31న పంజాబ్, హరియాణా హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.