జస్టిస్ గోపాలకృష్ణారావుకు ఘన వీడ్కోలు
ABN , Publish Date - Aug 26 , 2026 | 05:47 AM
పదవీ విరమణ నేపథ్యంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గోపాలకృష్ణారావుకు హైకోర్టు ఘనంగా వీడ్కోలు పలికింది. ఈ నెల 29న పదవీకాలం ముగియనుండడంతో హైకోర్టులో మంగళవారం వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు.
ఆయన సేవలను కొనియాడిన చీఫ్ జస్టిస్ లిసాగిల్
అమరావతి, ఆగస్టు 25(ఆంధ్రజ్యోతి): పదవీ విరమణ నేపథ్యంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గోపాలకృష్ణారావుకు హైకోర్టు ఘనంగా వీడ్కోలు పలికింది. ఈ నెల 29న పదవీకాలం ముగియనుండడంతో హైకోర్టులో మంగళవారం వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. సీజే జస్టిస్ లిసాగిల్ మాట్లాడుతూ... జస్టిస్ గోపాలకృష్ణారావు నిబద్ధత కలిగిన న్యాయమూర్తి అని కొనియాడారు. 30 ఏళ్లకు పైగా విశిష్ఠ సేవలందించారని పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు సొలిసిటర్ జనరల్ చల్లా ధనంజయ, అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివా స్, హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు వాసిరెడ్డి ప్రభునాధ్ మాట్లాడారు. జస్టిస్ గోపాలకృష్ణారావు మాట్లాడుతూ... న్యాయాధికారిగా, న్యాయమూర్తిగా 33 ఏళ్లకు పైగా సర్వీసు సంతృప్తినిచ్చిందన్నారు. సివిల్, మోటార్ వాహన ప్రమాదాల కేసులను పెద్ద సంఖ్యలో పరిష్కరించే సమయాల్లో న్యాయవాదులు అందించిన సహకారం మరువలేనిదన్నారు. న్యాయ వ్యవస్థలో ఉన్నత శిఖరాలను అధిరోహించేందుకు సహాయ సహకారాలు అందించిన సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, జస్టిస్ గోపాలకృష్ణారావు కుటుంబ సభ్యులు, రిజిస్ట్రార్‌లు, డిప్యూటీ సొలిసిటర్ జనరల్ నిరంజన్, అడిషనల్ అడ్వొకేట్ జనరల్ సాంబశివ ప్రతాప్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండ లక్ష్మీనారాయణ, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. మరోవైపు జస్టిస్ గోపాలకృష్ణారావు పదవీ విరమణ చేసిన నేపథ్యంలో ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు వాసిరెడ్డి ప్రభునాథ్, ఉపాధ్యక్షుడు పీఠా రామన్, ప్రధాన కార్యదర్శి తిరుమలశెట్టి కిరణ్, కార్యవర్గ సభ్యులు, న్యాయవాదులు పాల్గొన్నారు.