యువత అంకితభావంతో.. నిబద్ధతతో పని చేయాలి
ABN , Publish Date - Mar 28 , 2026 | 05:03 AM
యువత ఎక్కడ పనిచేసినా నిజాయితీ, నిబద్ధత, అంకితభావంతో ఉండాలని అప్పుడే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ ఉద్ఘాటించారు.
జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్
గుంటూరు(విద్య), మార్చి 27 (ఆంధ్రజ్యోతి): యువత ఎక్కడ పనిచేసినా నిజాయితీ, నిబద్ధత, అంకితభావంతో ఉండాలని అప్పుడే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ ఉద్ఘాటించారు. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్ యూనివర్సిటీలో శుక్రవారం ప్రాంగణ ఎంపికల ద్వారా ఉద్యోగాలు సాధించిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జస్టిస్ రామకృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ మనిషి ప్రవర్తనలో నైతిక విలువలు, సంస్కృతి, వారసత్వం, ధార్మికత 70 శాతం ప్రభావం చూపుతాయని తెలిపారు. విద్యలో నైతిక విలువలు లేకపోతే అది యాంత్రికంగా మారి, సమాజానికి ఉపయోగపడదని స్పష్టంచేశారు. పూర్వం కథల రూపంలో నీతిపాఠాలు బోధించేవారని, ప్రస్తుతం ఆ పద్ధతి విద్యావ్యవస్థలో తగ్గ్గిపోయిందని విచారం వ్యక్తం చేశారు. గౌరవ అతిథిగా హాజరైన హైదరాబాద్‌లోని టీసీఎస్ ఇండస్ర్టీ సొల్యూషన్ యూనిట్ హెడ్ భీమశేఖర్ ఆత్మకూరు మాట్లాడుతూ తల్లిదండ్రులను సత్కరించడం హర్షణీయమని, ఇదీ త్యాగాన్ని గుర్తించే ప్రయత్నమని పేర్కొన్నారు. విజ్ఞాన్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య మాట్లాడుతూ వర్సిటీకి చెందిన 1100 మంది పిల్లలు ఇంత క్లిష్ట సమయంలో కూడా చాలా పెద్ద సంఖ్యలో మంచి ఉద్యోగాలు సాధించగలిగారని ఆనందం వ్యక్తం చేశారు. విజ్ఞాన్ విద్యాసంస్థల వైస్ చైర్మన్ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ విద్యార్థులు అన్ని అంశాల్లో మెరుగ్గా ఉన్నందువల్లే ఉద్యోగాలు సాధించగలిగారని తెలిపారు. కార్యక్రమంలో సీఈవో డాక్టర్ మేఘన కూరపాటి, ఇన్‌చార్జి వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ కేవీ కృష్ణకిషోర్, రిజిస్ర్టార్ ప్రొఫెసర్ పీఎంవీ రావు తదితరులు పాల్గొన్నారు.