హైకోర్టు న్యాయమూర్తుల అతిథి గృహ నిర్మాణానికి శంకుస్థాపన
ABN , Publish Date - Apr 19 , 2026 | 04:26 AM
భీమిలి బీచ్‌రోడ్డులో సాగర్‌నగర్ వద్ద గల కొండపై నిర్మించతలపెట్టిన హైకోర్టు న్యాయమూర్తుల అతిథి గృహ నిర్మాణానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్ శనివారం శంకుస్థాపన చేశారు.
భూమి పూజ చేసి, శిలా ఫలకం ఆవిష్కరించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్
సాగర్‌నగర్ (విశాఖపట్నం), ఏప్రిల్ 18 (ఆంధ్రజ్యోతి): భీమిలి బీచ్‌రోడ్డులో సాగర్‌నగర్ వద్ద గల కొండపై నిర్మించతలపెట్టిన హైకోర్టు న్యాయమూర్తుల అతిథి గృహ నిర్మాణానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్ శనివారం శంకుస్థాపన చేశారు. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ రవినాథ్ తిల్హరి, జస్టిస్ రవి చీమలపాటితో కలిసి ఆయన భూమి పూజ నిర్వహించారు. అనంతరం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి చిన్నింశెట్టి రాజు, జిల్లా న్యాయసేవాధికారి సంస్థ కార్యదర్శి సన్యాసినాయుడు, ఫస్ట్ ఏడీజే వెంకటరమణ, జిల్లా కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్, పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ, జీవిఎంసి కమిషనర్ కేతన్‌గార్గ్, వీఎంఆర్డీఏ కమిషనర్ తేజ్‌భరత్, భీమిలి ఆర్డీవో సంగీత్‌మాధుర్, ఇతర న్యాయమూర్తులు, కోర్టు అధికారులు పాల్గొన్నారు. శంకుస్థాపన అనంతరం కొండ దిగువన ఏర్పాటుచేసిన వేదిక వద్దకు హైకోర్టు న్యాయమూర్తులు చేరుకుని.. జిల్లా న్యాయమూర్తులు, జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ ఇతర అధికారులతో తేనేటి విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తిని, ఇతర న్యాయమూర్తులను కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిషోర్, పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ, జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్ సత్కరించారు.