Share News

జస్టిస్‌ చక్రవర్తికి హైకోర్టు ఘన వీడ్కోలు

ABN , Publish Date - Aug 15 , 2026 | 04:58 AM

హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బొప్పన వరాహ లక్ష్మీ నరసింహ చక్రవర్తికి హైకోర్టు ఘనంగా వీడ్కోలు పలికింది. జస్టిస్‌ బీవీఎల్‌ఎన్‌ చక్రవర్తి పదవీకాలం శుక్రవారంతో..

జస్టిస్‌ చక్రవర్తికి హైకోర్టు ఘన వీడ్కోలు

  • సేవలు కొనియాడిన సీజే జస్టిస్‌ లిసాగిల్‌, ఏజీ

  • సుదీర్ఘ ఇన్నింగ్స్‌ సంతృప్తినిచ్చింది: జస్టిస్‌ చక్రవర్తి

అమరావతి, ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి): హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బొప్పన వరాహ లక్ష్మీ నరసింహ చక్రవర్తికి హైకోర్టు ఘనంగా వీడ్కోలు పలికింది. జస్టిస్‌ బీవీఎల్‌ఎన్‌ చక్రవర్తి పదవీకాలం శుక్రవారంతో ముగియడంతో హైకోర్టులోని మొదటి కోర్టు హాలులో వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ లిసా గిల్‌ మాట్లాడుతూ... ‘జస్టిస్‌ చక్రవర్తి 32 ఏళ్లకు పైగా న్యాయవ్యవస్థలో వివిధ హోదాల్లో విశిష్ఠ సేవలందించారు. సహజ న్యాయసూత్రాలకు భంగం కలగకుండా విచారణ ప్రక్రియ వేగంగా పూర్తి చేసేవారు. న్యాయవ్యవస్థకు ఆయన అందించిన సేవలు ఎప్పటికీ నిలిచిపోతాయి. ఆయన శేష జీవితం ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అని అన్నారు.

నాటౌట్‌గా ముగిస్తున్నా...

న్యాయాధికారిగా, న్యాయమూర్తిగా 32 ఏళ్ల సర్వీస్‌ తనకు సంతృప్తినిచ్చిందని జస్టిస్‌ చక్రవర్తి అన్నారు. పదవీ విరమణ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన ప్రస్థానాన్ని సుధీర్ఘ క్రికెట్‌ ఇన్నింగ్స్‌తో పోల్చారు. పదవీ విరమణను ఓటమిగా భావించడం లేదని.. మైదానంలో అత్యుత్తమ ప్రదర్శనతో నాటౌట్‌గా నిలిచి తర్వాతి తరానికి బ్యాటింగ్‌ అప్పగిస్తున్నట్లు భావిస్తున్నానని తెలిపారు. రిజిస్ట్రార్‌ ఐటీగా, కంప్యూటర్‌ కమిటీ సభ్యునిగా, మాస్టర్‌ ట్రైనీగా పనిచేయడం మరిచిపోలేని అనుభవమన్నారు. ప్రజలు, సహచరులకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అంతకుముందు అదనపు సొలిసిటర్‌ జనరల్‌ చల్లా ధనంజయ, అడ్వొకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివాస్‌, హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు వాసిరెడ్డి ప్రభునాథ్‌, బార్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ ద్వారకానాథ్‌రెడ్డి మాట్లాడారు.


జస్టిస్‌ చక్రవర్తి.. కేసుల విచారణ సందర్భంగా సీనియర్‌, జూనియర్‌ అనే వ్యత్యాసం లేకుండా అందరికీ సమ ప్రాధాన్యం ఇచ్చేవారన్నారు. ఓపికతో వాదనలు విని అనేక కీలక తీర్పులు ఇచ్చారన్నారు. కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, జస్టిస్‌ చక్రవర్తి కుటుంబ సభ్యులు, రిజిస్ట్రార్‌లు, డిప్యూటీ సొలిసిటర్‌ జనరల్‌ నిరంజన్‌, అడిషనల్‌ అడ్వకేట్‌ జనరల్‌ సాంబశివ ప్రతాప్‌, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ మెండ లక్ష్మీనారాయణ, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. కాగా, ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో జస్టిస్‌ బీవీఎల్‌ఎన్‌ చక్రవర్తి దంపతులను ఘనంగా సన్మానించారు. పూలమాలతో సత్కరించి, జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు సీజే జస్టిస్‌ లిసాగిల్‌, హైకోర్టు న్యాయమూర్తులు, అడిషనల్‌ సొలిసిటర్‌ జనరల్‌ చల్లా ధనంజయ, ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్‌, హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు వాసిరెడ్డి ప్రభునాథ్‌, ఉపాధ్యక్షుడు పీఠా రామన్‌, ప్రధాన కార్యదర్శి తిరుమలశెట్టి కిరణ్‌, కార్యవర్గ సభ్యులు, న్యాయవాదులు పాల్గొన్నారు.

Updated Date - Aug 15 , 2026 | 04:59 AM