ప్రాథమిక విద్యే జీవితానికి పునాది
ABN , Publish Date - Mar 02 , 2026 | 03:58 AM
జీవితంలో ప్రాథమిక విద్య ఎంతో ముఖ్యమైందని, వ్యక్తుల ఎదుగుదలకు అదే పునాదని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ అన్నారు.
బాలమేళాలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్
విజయవాడ, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): జీవితంలో ప్రాథమిక విద్య ఎంతో ముఖ్యమైందని, వ్యక్తుల ఎదుగుదలకు అదే పునాదని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ అన్నారు. ప్రతి ఒక్కరూ జీవితంలో ఉన్నత స్థితికి చేరుకున్నాక సమాజానికి తమ వంతు సేవ చేయాలన్నారు. సేవాభారతి సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం విజయవాడలోని ఓ ప్రైవేట్ కన్వెన్షన్ హాల్లో బాలమేళా నిర్వహించారు. ఈ సందర్భంగా జస్టిస్ బట్టు దేవానంద్ మాట్లాడుతూ.. 1990 నుంచి 36 ఏళ్లుగా ఒక సేవాసంస్థ నిరంతరాయంగా సేవా కార్యక్రమాలు చేపట్టడం గొప్ప విషయమన్నారు. విద్యకు ఆర్థికస్థితి అడ్డు కాదని అబ్దుల్ కలాం, నరేంద్రమోదీ వంటివారు చాటి చెప్పారని, ఇరువురూ కిందిస్థాయి నుంచి వచ్చి దేశ ప్రతిష్ఠను ప్రపంచానికి ఎలా చాటిచెప్పారో గమనించాలని సూచించారు. నేటితరం సినిమాల్లో గురువులను తక్కువ చేసి చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు సెల్‌ఫోన్‌ను తమ కెరీర్ అభివృద్ధికి, మంచికి ఉపయోగించుకోవాలని సూచించారు. విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడుతూ దేశంలో 50-60 శాతం మంది అసంఘటిత కార్మికులు ఉన్నారని పేర్కొన్నారు. అలాంటి వారి పిల్లలకు రోజూ విద్యాబోధన చేయడం గొప్ప విషయమంటూ సేవాభారతి సేవలను కొనియాడారు.