టెండర్లతోనే సరి..
ABN , Publish Date - Apr 21 , 2026 | 12:35 AM
చంద్రయ్య డ్రెయిన్ అభివృద్ధిపై రైతుల్లో ఆందోళన నెలకొంది. ఈ ఏడాది చేపట్టే కట్ట పటిష్ఠత, ఇతర మరమ్మతు పనులకు రూ.22.12 కోట్లతో టెండర్లు పిలిస్తే, పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ పత్తాలేకుండా పోయాడు. దీంతో మూడు నెలలుగా పనులు ప్రారంభానికి నోచుకోలేదు. దీనికి తోడు ప్రస్తుతం కాల్వ నిండుగా ప్రవహిస్తోంది. ఈ కాల్వ ఎప్పుడు ఎండుతుంది.. కాంట్రాక్టర్ ఎప్పుడు పనులు చేస్తాడు అనేదానిపై రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
- చంద్రయ్య డ్రెయిన్ అభిృవృద్ధికి ప్రభుత్వం ప్రణాళిక
- రూ.22.12 కోట్లతో టెండర్లు పిలిచిన అధికారులు
- తక్కువకే కోట్ చేసి పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్
- మూడు నెలలైనా ప్రారంభంకాని పనులు.. పత్తాలేని కాంట్రాక్టర్
- పనులపై ఆందోళన వ్యక్తం చేస్తున్న రైతులు
చంద్రయ్య డ్రెయిన్ అభివృద్ధిపై రైతుల్లో ఆందోళన నెలకొంది. ఈ ఏడాది చేపట్టే కట్ట పటిష్ఠత, ఇతర మరమ్మతు పనులకు రూ.22.12 కోట్లతో టెండర్లు పిలిస్తే, పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ పత్తాలేకుండా పోయాడు. దీంతో మూడు నెలలుగా పనులు ప్రారంభానికి నోచుకోలేదు. దీనికి తోడు ప్రస్తుతం కాల్వ నిండుగా ప్రవహిస్తోంది. ఈ కాల్వ ఎప్పుడు ఎండుతుంది.. కాంట్రాక్టర్ ఎప్పుడు పనులు చేస్తాడు అనేదానిపై రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రజ్యోతి - గుడివాడ:
కృష్ణాజిల్లాలోని ప్రధాన కాల్వల్లో ఒకటి అయిన చంద్రయ్య కాల్వ అభివృద్ధిపై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఈ డ్రెయిన్ కట్ట పట్టిష్ఠత, ఇతరత్రా మరమ్మతుల కోసం జలవనరులశాఖ గత డిసెంబరులో రూ.22.12 కోట్లతో టెండర్లు పిలిచింది. నాటకీయ పరిణామాల మధ్య 24.99 శాతం తక్కువ కోట్‌తో ఈ ఏడాది జనవరిలో టెండర్లు ఖరారు చేసింది. టెండరు దక్కించుకున్న కాంట్రాక్టర్ పత్తా లేకుండా పోయాడు. మూడు నెలలు గడుస్తున్నా పనులు ప్రారంభం కాలేదు. ఈ ఏడాది అయిన చంద్రయ్య కాల్వ గట్టు పట్టిష్ఠత, మరమ్మతులు చేపడతారా అనే అనుమానం రైతుల్లో వ్యక్తమవుతోంది.
మూడు నియోజకవర్గాలు దాటుకుని..
జిల్లాలోని పెనమలూరు నియోజకవర్గంలో ప్రారంభమయ్యే చంద్రయ్య డ్రెయిన్ పామర్రు, గుడివాడ నియోజకవర్గాల గుండా ఏలూరు జిల్లాలోని కొల్లేరులో కలుస్తుంది. పెనమలూరు నుంచి గుడివాడ పట్టణం వరకు పంట పొలాలు, గుడివాడ పట్టణంలోని మురుగును తీసుకువెళ్తుంది. నందివాడ మండలం ప్రారంభం నుంచి చేపల చెరువులకు నీటి అవసరాలను తీరుస్తుంది. ప్రతి ఏడాది డ్రెయిన్ మెయింటినెన్స్ పనులు నిర్వహిస్తారు. గతేడాది మూడు సార్లు టెంటర్లు పిలిచి ఎట్టకేలకు టెండరు ఖరారు చేశారు. ఈ ఏడాది నిర్ణీత సమయంలో టెండర్లు పిలిచి, జనవరిలో ఖరారు చేశారు.
50శాతం పనులు పూర్తి చేయాల్సి ఉన్నా..
జనవరిలో టెండర్లు ఖరారు కాగా, ఏప్రిల్ నెల ముగిసే నాటికి 50శాతం పనులు పూర్తయ్యే అవకాశముంది. కానీ చంద్రయ్య డ్రెయిన్ పనుల ప్రారంభానికి కొబ్బరికాయ కూడా కొట్టలేదు. గత నెలలో చేపల చెరువులను నింపుకునేందుకు కాల్వలకు జలవనరుల శాఖ నీటిని విడుదల చేసింది. నెల రోజులు గడుస్తున్నా కాల్వ నిండుగా ప్రవహిస్తోంది. కాల్వ ఎండేదెప్పుడు.. పనులు ప్రారంభమయ్యేదెప్పుడు అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పనులు దక్కించుకునేందుకు కాంట్రాక్టర్లు లెస్ టెండర్లు వేయడం పరిపాటిగా మారిందని విమర్శలు వస్తున్నాయి. సగం పనులు కూడా పూర్తి చేయకుండానే బిల్లులు పొందే అవకాశాలు వీటికి ఉన్నట్టు నిపుణులు చెబుతున్నారు.
మేలో వర్షాలు పడితే ఇక అంతే..
ఏప్రిల్ 20వ తేదీ వచ్చిన చంద్రయ్య కాల్వ నీటితో నిండుగా ప్రవహిస్తోంది. దీంతో కాల్వ కట్ట పట్టిష్ఠత, ఇతరత్రా మరమ్మతుల పనులు ఎలా ప్రారంభిస్తారనే సందేహం వ్యక్తమవుతోంది. మరో 10 రోజుల్లో ఏప్రిల్ పూర్తయి.. మే నెల వస్తుంది. ఈ నెల్లో వర్షాలు పడితే ఈ ఏడాదికి మరమ్మతులు లేనట్టే. ఇప్పటికే కాల్వలో గుర్రపుడెక్క పెరిగిపోయింది. ప్రధానంగా కాల్వ వంపుల్లో మట్టి దిబ్బలున్నాయి.
డివిజన్ పరిధిలో మరో 20 పనులు ఇలాగే..
డ్రైనేజీశాఖ డివిజన్ పరిధిలో చంద్రయ్య డ్రెయిన్ టెండరుతో పాటు మరో 27 పనులకు టెండర్లు పిలిచి కాంట్రాక్టర్లను ఖరారు చేశారు. ఇటీవల పెనమలూరు నియోజకవర్గ పరిధిలో ఏడు పనులు ప్రారంభం అయ్యాయి. గన్నవరం నియోజకవర్గంలో సుమారు 20 పనులు ప్రారంభానికి నోచుకోలేదని విమర్శలు వస్తున్నాయి.