మరమ్మతులతోనే సరి..
ABN , Publish Date - Feb 19 , 2026 | 12:23 AM
దివి ప్రాంత రైతులు వ్యవసాయ ఉత్పత్తులను భద్రపర్చుకునేందుకు అవనిగడ్డ ఏరియా మార్కెట్ యార్డు పరిధిలో గోదాములు సరిపోక తీవ్ర అవస్థలు పడుతున్నారు. 2500 మెట్రిక్ టన్నులతో నూతన గోదాముల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపినా మార్కెటింగ్ శాఖ నుంచి ఏళ్లతరబడి ఆమోదం లభించడంలేదు. దీంతో తమ వ్యవసాయ ఉత్పత్తులను నిల్వ చేసుకునేందుకు రైతులు దూరాభారం వెళ్లి ఇబ్బందులను పడాల్సి వస్తోంది. ‘ఆదాయంపై దృష్టి పెట్టరు.. అభివృద్ధి ఊసెత్తరు’ అంటూ అధికారుల తీరుపై మండిపడుతున్నారు.
- అభివృద్ధికి నోచుకోని దివి వ్యవసాయ మార్కెట్ యార్డు
- గోదాములు సరిపోక రైతుల అవస్థలు
- 2500 మెట్రిక్ టన్నులతో నూతన గోదాము ప్రతిపాదనలకే పరిమితం
- ఆదాయంపై దృష్టి పెట్టరు.. విస్తరణ ఊసెత్తరు!
- అధికారుల తీరుపై మండిపడుతున్న రైతులు
దివి ప్రాంత రైతులు వ్యవసాయ ఉత్పత్తులను భద్రపర్చుకునేందుకు అవనిగడ్డ ఏరియా మార్కెట్ యార్డు పరిధిలో గోదాములు సరిపోక తీవ్ర అవస్థలు పడుతున్నారు. 2500 మెట్రిక్ టన్నులతో నూతన గోదాముల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపినా మార్కెటింగ్ శాఖ నుంచి ఏళ్లతరబడి ఆమోదం లభించడంలేదు. దీంతో తమ వ్యవసాయ ఉత్పత్తులను నిల్వ చేసుకునేందుకు రైతులు దూరాభారం వెళ్లి ఇబ్బందులను పడాల్సి వస్తోంది. ‘ఆదాయంపై దృష్టి పెట్టరు.. అభివృద్ధి ఊసెత్తరు’ అంటూ అధికారుల తీరుపై మండిపడుతున్నారు.
ఆంధ్రజ్యోతి-అవనిగడ్డ :
అవనిగడ్డ మార్కెట్ కమిటీ పరిధిలో నాగాయలంక, ఏటిమొగ గ్రామాల్లో గోదాములు ఉన్నాయి. ఏటిమొగ మార్కెట్ కమిటీ గోదాములకు ఎప్పటికప్పుడు మరమ్మతులు చేస్తున్నారే గానీ కొత్త గోదాముల నిర్మాణానికి పంపిన ప్రతిపాదనలకు మార్కెటింగ్ శాఖ నుంచి ఆమోదం లభించటం లేదు. దీంతో ఏటిమొగ గోదాముల పరిధిలోని 10 గ్రామాల ప్రజలు అక్కడ భద్రపర్చుకునే సౌలభ్యం లేకపోవటంతో నాగాయలంకకు వచ్చి తమ వ్యవసాయ ఉత్పత్తులను భద్రపర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే 2500 మెట్రిక్ టన్నులతో నూతన గోదాములు నిర్మించాలని అవనిగడ్డ ఏరియా మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రతిపాదనలు పంపినప్పటికీ, ఈ సారి కూడా మరమ్మతు పనులకే నిధులు కేటాయించి మార్కెటింగ్ అధికారులు చేతులు దులుపుకోవటంతో పాలకవర్గ సభ్యులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
ఆదాయ వనరులపైన దృష్టి పెట్టని అధికారులు
నాగాయలంక మండలం రేమాలవారిపాలెంలో గోదాముల వద్ద రైతుల సౌలభ్యం కోసం 50 టన్నుల కెపాసిటీతో వే బ్రిడ్జి ఉంది. అయితే 2017లో నాటి అవసరాల మేరకు నిర్మించిన వే బ్రిడ్జి ప్రస్తుత అవసరాలకు సరిపోవటం లేదని రైతులు ఫిర్యాదు చేస్తున్నారు. ఈ వే బ్రిడ్జిపై కేవలం ధాన్యం లారీల బరువు తూయటం మాత్రమే సాధ్యమవుతుంది. నిత్యం పదుల సంఖ్యలో వచ్చే ఇసుక లారీల వేమెంట్ తీసేందుకు ప్రస్తుతం ఉన్న వే బ్రిడ్జి సాంకేతికత సరిపోవటం లేదని, మరో రెండు సెన్సార్లు అమరిస్తే ఇసుక లారీలు కూడా వేమెంట్ చేయటం సాధ్యమవుతుందని, తద్వారా నిత్యం వేలాది రూపాయల ఆదాయం సమకూరే అవకాశం ఉంది. అయినప్పటికీ ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటంపై అధికారులు ఎందుకు దృష్టి పెట్టడం లేదన్నది రైతుల నుంచి వస్తున్న ప్రధాన ప్రశ్న. గోదాములు ఉన్న ప్రాంతం వివిధ గ్రామాలకు కూడలి కావటంతో అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తే మార్కెటింగ్ కమిటీకి ఆదాయం రావటంతోపాటు స్థానికంగా ఉన్న యువతకు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని మార్కెటింగ్ కమిటీ పాలకవర్గం నిర్ణయాలు తీసుకుని ప్రతిపాదనలు పంపినప్పటికీ ఆ ప్రతిపాదనలు ఇంతవరకు పరిశీలనకు కూడా నోచుకోలేదు.
విస్తరణ ఊసెత్తడంలేదు..
అవనిగడ్డ ఏరియా మార్కెట్ కమిటీ విస్తరణ గురించి అధికారులు పట్టించు కోవటంలేదని రైతుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. నాగాయలంకలోని మార్కెట్ కమిటీ గోదాముల పరిధిలో నాగాయలంక, కోడూరు, అవనిగడ్డ, మోపిదేవి మండలాలు ఉండగా, మొత్తం రైతులంతా తమ వ్యవసాయ ఉత్పత్తులను నాగాయలంక మండలానికే తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో వారు ఎక్కడికక్కడ ప్రైవేట్ గోదాములతో తమ వ్యవసాయ ఉత్పత్తులను నిల్వ చేసుకోవాల్సిన దుస్థితి కొనసాగుతుంది. అవనిగడ్డ మండలంలో గోదాములు ఏర్పాటు చేయాలని రెండున్నర దశాబ్దాలుగా రైతులు డిమాండ్ చేస్తున్నప్పటికీ భూ సేకరణకు అంతరాయం ఏర్పడుతుందన్న సాకు చూపిస్తూ అధికారులు ఎప్పటికప్పుడు ఈ ప్రతిపాదనలు పక్కన పెట్టేస్తున్నారు. అవనిగడ్డలో మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో గోదాములు నిర్మించినట్లైతే ఆ గోదాములు అవనిగడ్డ, మోపిదేవి, కోడూరు మండలాల రైతులకు ఎంతగానో ఉపకరిస్తాయి. ఈ విషయంపై ఎందుకు ఉన్నతాధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు. రెండున్నర దశాబ్దాలుగా రైతులు గోదాములు నిర్మించాలని చేస్తున్న డిమాండ్‌ను అటు అధికారులు, ఇటు ప్రజాప్రతినిధులు, పాలకవర్గాలు పట్టించుకోకపోవటంతో తాము మార్కెట్ కమిటీ ద్వారా అందే లబ్ధిని పొందలేకపోతున్నామని రైతులు వాపోతున్నారు.
అభివృద్ధి పనుల ప్రతిపాదనలు పంపాం
అవనిగడ్డ మార్కెట్ కమిటీ అభివృద్ధి, రైతులకు మెరుగైన సౌకర్యాలు కల్పించటం కోసం చిత్తశుద్ధితో పని చేస్తున్నాం. ఇప్పటికే 2500 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో గోదాములు నిర్మించాలని రూ.2.5 కోట్లతో ప్రతిపాదనలు పంపించాం. అలాగే షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం కోసం ప్రతిపాదనలు ఇచ్చాం. కొద్దిరోజుల క్రితమే గోదాముల మరమ్మతుల కోసం రూ.36 లక్షలు మంజూరయ్యాయి. త్వరలోనే కొత్త గోదాములు, షాపింగ్ కాంప్లెక్సుల నిర్మాణం కోసం తాము పంపిన ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. అవనిగడ్డలో కొత్త గోదాములు నిర్మించాలని ఎప్పటి నుంచో రైతులు కోరుతున్నారు. స్థలం అందుబాటులో లేకపోవటంతో ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చలేదు. రైతుల అభీష్టం మేరకు ప్రభుత్వానికి గోదాముల నిర్మాణం కోసం ప్రతిపాదనలు పంపుతాం.
- కొల్లూరి వెంకటేశ్వరరావు, దివి మార్కెట్ కమిటీ ఛైర్మన్