ఇష్టారాజ్యంగా ఇన్‌చార్జి పోస్టులు!
ABN , Publish Date - Apr 08 , 2026 | 04:35 AM
ఆరోగ్యశాఖ లో ఇష్టారాజ్యంగా ఇన్‌చార్జి నియామకాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఏపీఎంఎస్ఐడీసీ అడ్డగోలు నిర్ణయాలకు కేరాఫ్‌గా మారుతోంది.....
జూనియర్ విశ్లేషకుడుకు డ్రగ్స్ జీఎం బాధ్యతలు
నేడు బీఎఫ్‌సీ సమావేశం
అమరావతి, ఏప్రిల్ 7(ఆంధ్రజ్యోతి): ఆరోగ్యశాఖ లో ఇష్టారాజ్యంగా ఇన్‌చార్జి నియామకాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఏపీఎంఎస్ఐడీసీ అడ్డగోలు నిర్ణయాలకు కేరాఫ్‌గా మారుతోంది. ఇప్పటికే నిబంధనలకు విరుద్ధంగా ఆరోగ్యశాఖ సెక్రటరీ సౌరబ్ గౌర్.. ఏపీఎంఎస్ఐడీసీ ఎండీగా ఇన్‌చార్జి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు జీవో కూడా ఆయనే ఇచ్చుకున్నారు. బీఎఫ్‌సీ(బిడ్ ఫైనలైజేషన్ కమిటీ) చైర్మన్‌గా కార్పొరేషన్ తీసుకున్న నిర్ణయాలను సమీక్షించాల్సిన ఆయనే.. ఎండీ హోదాలో అజెండా సిద్ధం చేస్తే పారదర్శకత ఎక్కడ ఉంటుందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కార్పొరేషన్ ఎండీ హోదాలో ఆయన మరో అడ్డగోలు ఆర్డర్ ఇచ్చారు. ఏపీఎంఎ్‌సఐడీసీలో డ్రగ్స్ జనరల్ మేనేజర్(జీఎం) పోస్టు చాలా కీలకం. ఔషధ నియంత్రణ మండలిలో అసిస్టెంట్ డైరెక్టర్ హోదా కలిగి, గెజిటెడ్ గుర్తింపు ఉన్న అధికారులను ఈ పోస్టుల్లో నియమించాలి. కానీ.. ఆయన ఒక జూనియర్ విశ్లేషకుడుకు ఈ బాధ్యతలు అప్పగించారు. సదరు విశ్లేషకుడుకు కనీసం ప్రొబేషన్ కూడా పూర్తి కాలేదు. పైగా ఆయన నాన్ గెజిటెడ్ స్థాయి ఉద్యోగి. అలాంటి ఒక సూపరింటెండెంట్ స్థాయి ఉద్యోగిని ఏకంగా జీఎం ఇన్‌చార్జిగా నియమించడంపై మరిన్ని అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. కార్పొరేషన్‌లో ఈడీ, అడ్మిన్ జీఎం వంటి పెద్ద హోదా కలిగిన అధికారులున్నప్పటికీ పట్టలేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు బుధవారం ఉదయం బీఎ్‌ఫసీ సమావేశం కూడా ఉంది. ఇందులో కీలకమైన మందులు, వైద్య పరికరాల కొనుగోలుకు నిర్ణయం తీసుకోనున్నారు. ఈ నేపథ్యంలోనే అర్హత లేకపోయినా తమకు అనుకూలంగా ఉంటారన్న ఉద్దేశంతో ఇష్టారాజ్యంగా ఇన్‌చార్జి పోస్టులు ఇస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.