Share News

నేటి నుంచి జంగిల్‌ సఫారీ

ABN , Publish Date - Sep 30 , 2026 | 11:40 PM

పులుల సంతాన ప్రక్రియలో భాగంగా నల్లమలలో మూతబడిన జంగిల్‌ సఫారీలు గురువారం నుంచి తెరుచుకోనున్నాయి.

నేటి నుంచి జంగిల్‌ సఫారీ
నల్లమలలో జంగిల్‌ సఫారీలో వెళ్తున్న పర్యాటకులలు

నల్లమలలోని పుణ్యక్షేత్రాలకు వెళ్లేందుకు అనుమతి

ఆత్మకూరు, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): పులుల సంతాన ప్రక్రియలో భాగంగా నల్లమలలో మూతబడిన జంగిల్‌ సఫారీలు గురువారం నుంచి తెరుచుకోనున్నాయి. వర్షాకాల సీజనలో పులుల ప్రత్యుత్పత్తిలో భాగంగా నేషనల్‌ టైగర్స్‌ కన్జర్వేషన అథారిటీ (ఎనటీసీఏ) ఆదేశాల మేరకు జూలై 1 నుంచి సెప్టెంబరు 30వ తేది వరకు దేశంలోని 58 టైగర్‌ రిజర్వుల్లో జన సంచారాన్ని నిషేధించారు. ఇందులో భాగంగా నాగార్జున సాగర్‌ - శ్రీశైలం పెద్దపులుల అభయారణ్యం పరిధిలో గల మార్కాపురం అటవీ డివిజనలోని నెక్కంటి రేంజ్‌ పరిధిలోని ఇష్టకామేశ్వరీ అమ్మవారి ఆలయం, వెలుగోడు రేంజ్‌లోని రుద్రకోడూరు క్షేత్రం, గుండ్లబ్రహ్మేశ్వర్యం అభయారణ్యం పరిధిలోని గుండ్లబ్రహ్మేశ్వరం వంటి క్షేత్రాలకు వెళ్లేందుకు అటవీ అధికారులు అనుమతులను నిరాకరించారు. అదేవిధంగా ఆత్మకూరు డివిజనలోని బైర్లూటి, నంద్యాల డివిజనలోని పచ్చర్ల, మార్కాపురం డివిజనలోని తుమ్మలబయలు ఏకోటూరిజం కేంద్రాలు కొనసాగనున్నప్పటికీ కోర్‌ ఏరియాలోని జంగిల్‌ సఫారీలకు బ్రేక్‌ వేశారు. అదేవిధంగా శ్రీశైలానికి కాలినడకన తరలివెళ్లే భక్తులను కూడా అనుమతించలేదు. అయితే మూడు నెలల వర్షాకాల సీజన గడువు ముగియడం వల్ల నేటి నుంచి నల్లమలలోని ఆయా పుణ్యక్షేత్రాలు, జంగిల్‌ సఫారీలకు వెళ్లేందుకు అటవీ శాఖ అవకాశం కల్పించింది. ఆనలైనలో కూడా జంగిల్‌ సఫారీలకు బుకింగ్‌ చేసుకునేలా వెసులుబాటు ఇచ్చారు.

Updated Date - Sep 30 , 2026 | 11:40 PM