న్యాయవ్యవస్థపై ప్రజల్లో నమ్మకం కలిగించాలి
ABN , Publish Date - Mar 23 , 2026 | 04:08 AM
‘న్యాయవ్యవస్థ అంటే తరాలు తిరిగినా న్యాయం జరగదన్న అభిప్రాయం నేటి సమాజంలో ఉంది. ఈ అపవాదును తొలగించేందుకు న్యాయాధికారులు, న్యాయవాదులు చిత్తశుద్ధితో పనిచేయాలి.
తరాలు తిరిగినా న్యాయం జరగదనే అభిప్రాయం మార్చాలి
హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్, జస్టిస్ రాజశేఖర్
ఎస్.కోట రూరల్, మార్చి 22(ఆంధ్రజ్యోతి): ‘న్యాయవ్యవస్థ అంటే తరాలు తిరిగినా న్యాయం జరగదన్న అభిప్రాయం నేటి సమాజంలో ఉంది. ఈ అపవాదును తొలగించేందుకు న్యాయాధికారులు, న్యాయవాదులు చిత్తశుద్ధితో పనిచేయాలి. న్యాయవ్యవస్థపై ప్రజల్లో పూర్తి నమ్మకం కలిగించాలి. హడావుడిగా తీర్పులు ఇస్తే మళ్లీ కోర్టుల్లో కేసులు పడతాయి’ అని హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్, జస్టిస్ తర్లాడ రాజశేఖర్ అన్నారు. విజయనగరం జిల్లా ఎస్.కోటలో రూ.8 కోట్లతో నిర్మించనున్న కోర్టు భవన నిర్మాణ పనులకు వారు ఆదివారం శంకుస్థాపన చేశారు. అనంతరం ఓ ప్రైవేటు హాల్‌లో జరిగిన సమావేశంలో జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ మాట్లాడుతూ.. కోర్టు బెంచ్, బార్ సమన్వయంతో పనిచేస్తే మంచి తీర్పులు వస్తాయన్నారు. కొన్ని సివిల్ కేసులు 40 ఏళ్లకు పైబడి పెండింగ్ ఉన్నట్లు గుర్తించామని, దీని వల్ల కోర్టుల చుట్టూ ఏళ్ల పాటు తిరిగినా న్యాయం జరగదన్న అపవాదు మిగిలిందని పేర్కొన్నారు. కోర్టులు, సిబ్బంది, ఉద్యోగులు ఉన్నా ఎందుకు సకాలంలో తీర్పులు ఇవ్వలేకపోతున్నామనే దానిపై ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. మెగా లోక్ అదాలత్‌లతో అద్భుత ఫలితాలు సాధించామని, తొలి విడత 3 లక్షల కేసులు, రెండో విడత మరో 3 లక్షల కేసులు పరిష్కరించడం గొప్ప విషయమన్నారు. ఈ విషయంలో గుంటూరు జిల్లా ప్రథమ స్థానంలో నిలిచి, అందరిలో స్ఫూర్తి నింపిందన్నారు. ప్రస్తుతం ‘మీడియేషన్’పై దృష్టి పెడుతూ శిక్షణ పొందిన మధ్యవర్తుల ద్వారా కేసులను రాజీ చేసేందుకు వేగవంతమైన ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. తనకు ఉత్తరాంధ్ర అంటే మమకారం ఎక్కువ అని అన్నారు.
జస్టిస్ రాజశేఖర్ మాట్లాడుతూ.. జడ్జీలు కేసులను క్లియర్ చేసే హడావుడిలో సరైన నిర్ణయాలు తీసుకోకుండా తీర్పులు ఇస్తున్నారని, దీని వల్ల ఆ కేసులు మళ్లీ కోర్టుకు వచ్చే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని కేసుల క్లియరెన్స్‌లో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. జిల్లా న్యాయాధికారి ఎం.బబిత మట్లాడుతూ.. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అందిస్తున్న సహకారం మరువబోమన్నారు. గుంటూరు జిల్లా ప్రధాన న్యాయాధికారి కల్యాణ చక్రవర్తి మాట్లాడుతూ.. ఉన్నత స్థాయికి ఎదిగిన కొందరు వ్యక్తులు తాము పుట్టిన ప్రాంతానికి, ఊరి కోసం పనిచేస్తారని అలాంటి వారిలో మానవేంద్రనాథ్ రాయ్ ఒకరని కొనియాడారు. అన్ని జిల్లాల న్యాయాధికారులకు సలహాలు, సూచనలు అందించి నడిపిస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్.కోట న్యాయాధికారి కనకలక్ష్మి, కలెక్టర్ రామసుందర్‌రెడ్డి, ఎస్పీ దామోదర్, మన్యం జిల్లా ఎస్పీ మాధవరెడ్డి, ఎస్.కోట బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సూరిదేముడు, పలువురు న్యాయాధికారులు పాల్గొన్నారు.