క్రీడాభివృద్ధికి వరల్డ్ క్లాస్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్
ABN , Publish Date - Jul 04 , 2026 | 04:57 AM
రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి వరల్డ్ క్లాస్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు జేఎస్‌డబ్ల్యూ సంస్థ ముందుకొచ్చిందని మంత్రి లోకేశ్ వెల్లడించారు.
రాష్ట్రంలో ఏర్పాటుకు ముందుకొచ్చిన జేఎస్‌డబ్ల్యూ
క్రీడాకారులతో డిన్నర్ కార్యక్రమంలో మంత్రి లోకేశ్
అమరావతి, జూలై 3 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి వరల్డ్ క్లాస్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు జేఎస్‌డబ్ల్యూ సంస్థ ముందుకొచ్చిందని మంత్రి లోకేశ్ వెల్లడించారు. రాష్ట్ర క్రీడాకారులకు అత్యుత్తమ శిక్షణ ఇచ్చేందుకు ప్రపంచస్థాయి అత్యుత్తమ కోచ్‌లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. కామన్వెల్త్, ఆసియా గేమ్స్‌లో పాల్గొననున్న క్రీడాకారులతో లోకేశ్ ఉండవల్లి నివాసంలో శుక్రవారం రాత్రి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వారితో కలిసి డిన్నర్ చేశారు. లోకేశ్ మాట్లాడుతూ.. అత్యుత్తమ క్రీడా మౌలిక సదుపాయాల కల్పనకు జేఎ్‌సడబ్ల్యూ అంగీకారం తెలిపిందని చెప్పారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు క్రీడాభివృద్ధి కోసం ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు, ఆసియా పారా గేమ్స్ రజత పతక విజేత భవానీ కార్తిక్, అండర్-20 ఆసియా అథ్లెటిక్స్ గోల్డ్ మెడలిస్ట్ వెంకట్ రామిరెడ్డి, ఎన్‌టీపీసీ జాతీయ ఆర్చరీ చాంపియన్‌షిప్ స్వర్ణ పతక విజేత యుక్తాతో పాటు తీర్దు సామదేవ్, జ్యోతికశ్రీ, రావడ కుసుమ, మల్లల అనూష, ఎం.శిరీష తదితరులు క్రీడాకారులు పాల్గొన్నారు.
క్రీడాకారుల శిక్షణకు 2.23 కోట్లు మంజూరు
కామన్వెల్త్ గేమ్స్, ఆసియా గేమ్స్, పారా కామన్వెల్త్ గేమ్స్‌కు ఎంపికైన 18 మంది క్రీడాకారుల శిక్షణ కోసం ప్రభుత్వం రూ.2.23 కోట్లు విడుదల చేసింది. అవసరమైతే మరింత సాయం అందించేందుకు సిద్ధమని లోకేశ్ చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించి రాష్ట్రానికి ఖ్యాతి తీసుకురావాలని కోరారు.