అస్థిరత లక్ష్యం.. విద్వేషమే అస్త్రం! జోసెఫ్ రావణ్ వీడియోల వెనుక భారీ కుట్ర..
ABN , Publish Date - Jul 12 , 2026 | 04:37 AM
తీగలాగితే డొంకంతా కదిలినట్లు... జోసెఫ్ అలియాస్ రావణ్ కేసులో సరికొత్త కుట్రలు బయటపడుతున్నాయి. ఇది ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌పై అసభ్య వ్యాఖ్యలు చేయడానికి పరిమితం కాదు.
సూత్రధారి వైసీపీ.. పాత్రధారులు పలువురు
గమన కాల్‌లాగ్‌లో ఇద్దరు రిటైర్డ్ ఐపీఎ్‌సల నంబర్లు
ఎమర్జెన్సీ కాంటాక్ట్‌గా ఒక ఐఏఎస్ ఫోన్ నంబర్
సర్వీసులో ఆ ఇద్దరు ఐపీఎ్‌సల మధ్య వైరం
నేడు వైసీపీ కోసం కలిసిన ఆ ఇద్దరు
జూబ్లీహిల్స్‌లో వైసీపీ నేత ఇంట్లోనే స్టూడియో
దర్యాప్తులో బయటపడుతున్న కొత్త లింకులు
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
తీగలాగితే డొంకంతా కదిలినట్లు... జోసెఫ్ అలియాస్ రావణ్ కేసులో సరికొత్త కుట్రలు బయటపడుతున్నాయి. ఇది ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌పై అసభ్య వ్యాఖ్యలు చేయడానికి పరిమితం కాదు! హిందూ మతాన్ని, సనాతన ధర్మాన్ని దూషించడంతో ఆగిపోలేదు! దీని అంతిమ లక్ష్యం... కులాల మధ్య చిచ్చు పుట్టించి... మతాల మధ్య మంట రాజేసి... జనాన్ని విభజించి... రాష్ట్రంలో అశాంతి, అస్థిరత సృష్టించడమే! జగన్ కోటరీతోపాటు చంద్రబాబును రకరకాల కారణాలవల్ల వ్యతిరేకించే వారు దీనికోసం ఒక్కటయ్యారు. బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ రావణ్ కేసు దర్యాప్తులో లోతులకు వెళ్లేకొద్దీ ఈ ‘నెట్‌వర్క్’ బయటపడుతోంది. జోసెఫ్ రావణ్ వీడియోల వెనుక సైద్ధాంతిక, రాజకీయ కోణాలు లేవని... రాష్ట్రాన్ని అస్థిరపరిచే కుట్ర దాగి ఉందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. వైసీపీ వర్గాలతోపాటు కొందరు రిటైర్డ్ ఐపీఎ్‌సలు, ఐఏఎ్‌సలూ ఈ కుట్రలో భాగస్వాములు కావడం గమనార్హం.
కేరాఫ్ జూబ్లీహిల్స్...
జోసెఫ్ రావణ్ వీడియోలకు, దాని వెనుక కుట్రలకు కేంద్రం... హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 70లోని ఒక భవనం! అది... కల్యాణదుర్గం వైసీపీ నేత ఇంద్రసేన చౌదరికి చెందినది. అందులోని ఒక అంతస్తులో జోసెఫ్ రావణ్ యూట్యూబ్ స్టూడియో, ఆఫీసు నడుస్తోంది. అతని సన్నిహితురాలు, వీడియోల రూపకల్పనలో గమన అనే మహిళ కూడా భాగస్వామి. ఆమె ఇంద్రసేన చౌదరికి దూరపు బంధువే. వెరసి... అటు రాజకీయ బంధుత్వమూ కుదరడంతో ఆ ఇంటిని ఉచితంగానే ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఫ్యాక్టరీలో తయారైన విద్వేష వీడియోలను పులివెందులలోని ఒక వైసీపీ నేతకు పంపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. అలాగే... జగన్ ‘లా కోటరీ’లోని ఒక కీలక వ్యక్తి కుటుంబ సభ్యుడికీ వెళ్తున్నాయని తేల్చారు. ‘ఔట్‌పుట్ మీరు చెప్పిన లైన్‌లోనే ఉంది కదా’ అని నిర్ధారించుకునేందుకా? ‘ఇది చాలా, ఇంకా పెంచాలా?’ అని అడిగేందుకా అనే విషయం మాత్రం తెలియదు!
ఒకే గూటిపక్షులు...
రావణ్‌పై ఉపా కేసు పెట్టి అరెస్టు చేసిన తర్వాత ఈ తతంగం వెనుక ఇంకా ఎవరున్నారనే కోణంలో పోలీసు దర్యాప్తు మొదలైంది. ఈ క్రమంలో గమనకు సంబంధించిన కాల్‌లాగ్ పరిశీలించినప్పుడు విస్మయకరమైన విషయాలు బయటపడ్డాయి. ఇద్దరు రిటైర్డ్ పోలీసు అధికారులతో గమన సంప్రదింపులు జరుపుతున్నట్లు తేలింది. దీంతోపాటు... భవిష్యత్తులో రావణ్‌ను పోలీసులు అరెస్టు చేస్తే అత్యవసరంగా సంప్రదించేందుకు ఒక రిటైర్డ్ ఐఏఎస్ నంబర్‌ను ‘ఎమర్జెన్సీ కాంటాక్ట్’గా పెట్టుకున్నట్లు సమాచారం. ఇంకా విచిత్రమేమిటంటే... ఆ కాల్‌లాగ్‌లో ఉన్న ఇద్దరు రిటైర్డ్ ఐపీఎస్‌లకు ఒకప్పుడు ఒకరంటే ఒకరికి పడదు. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత వైరం. ఇందులో ఒకరు పూర్తిగా వైసీపీ కోటరీ! ఇంకొకరేమో రిటైర్‌మెంట్ తర్వాత, కూటమి అధికారం కోల్పోయాక... తనకు ఏం దక్కలేదనోగానీ చంద్రబాబుకు వ్యతిరేకిగా మారిపోయారు. శత్రువుకు శత్రువు మిత్రుడు... అయిన్నట్లుగా ఆ ఇద్దరు ఐపీఎ్‌సలు ఇప్పుడు ఒక్క గూటికి చేరిపోయారు. ఇవన్నీ వేటికవి, విడివిడిగా జరిగిన పరిణామాలు కావు! వీటన్నింటి వెనుక మూల సూత్రం... రాష్ట్రంలో అశాంతిని రేకెత్తించడమే. ‘మీ పాత పగలు మరిచిపోండి. మన ఉమ్మడి లక్ష్యం కోసం పని చేయండి’ అంటూ వైసీపీయే వీరందరినీ కలిపినట్లు తెలుస్తోంది. ఒక్కసారి ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళితే... ఈ కుట్ర మరింత స్పష్టంగా అర్థమవుతుంది. 2019లో అధికారంలోకి రాకముందు... మేధావులు, సామాజిక వేత్తలు కొందరు అదే పనిగా అప్పటి టీడీపీ ప్రభుత్వాన్ని విమర్శించేవారు. ‘ఇది మేధావులు చేయాల్సిన పనే కదా’ అని అప్పట్లో ప్రభుత్వం, ప్రజలూ సరిపెట్టుకున్నారు. ఆ తర్వాత కుల సంఘాల వారూ రంగంలోకి దిగారు. హైదరాబాద్‌లో ఉన్న నాయకుడొకరు ఏపీలోకి వచ్చి, కులసంఘం మీటింగ్ పెట్టి అప్పటి టీడీపీ ప్రభుత్వాన్ని తిట్టిపోశాడు. ఇక... కులం కేంద్రంగా అబద్ధపు ఆరోపణలు చేయడమనే విష వ్యూహాన్ని వైసీపీ అప్పట్లో విజయవంతంగా అమలు చేసింది. ఇప్పుడూ అదే మొదలుపెట్టింది. ఇది... 2.0 వర్షన్! తాజాగా... పోలీసులు జోసెఫ్ రావణ్ స్టూడియోకు వసతి సమకూర్చిన ఇంద్రసేన్ చౌదరికి, రావణ్ సన్నిహితురాలు గమనకు నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. వారిని ప్రశ్నిస్తే మరిన్ని వివరాలు బయటపడే అవకాశముంది.