మన కేజీఎఫ్!
ABN , Publish Date - Apr 26 , 2026 | 04:35 AM
దేశంలో గోల్డ్‌మైన్స్ అంటే గుర్తుకొచ్చేది కేజీఎ్‌ఫ..కోలార్ గోల్డ్ మైన్స్. అయితే, అది నిన్నటి మాట. జొన్నగిరి గోల్డ్ మైన్స్ అనేది ఇప్పటి మాట. ప్రైవేటు రంగంలో స్వాతంత్ర్యానికి పూర్వం ఏర్పాటుచేసిన కేజీఎఫ్ ప్రస్తుతం ఉనికిలో లేదు.
జొన్నగిరికిస్వర్ణ జిలుగులు.. స్వేచ్ఛా భారతంలోనే తొలి ప్రైవేట్ గోల్డ్‌మైన్స్
కర్నూలు జిల్లాలో 13 నుంచి 42 టన్నుల బంగారం నిక్షేపాలు!
‘బంగారు శుద్ధి పరిశ్రమ’కు 2023లో శ్రీకారం.. ఊతమిచ్చిన కూటమి
రూ.400 కోట్ల పెట్టుబడితో 598 హెక్టార్లలో నిర్మాణం
పూర్తి కావచ్చిన ప్రాజెక్టు.. మేలో సీఎం చేతుల మీదుగా ప్రారంభం!
(కర్నూలు - ఆంధ్రజ్యోతి)
దేశంలో గోల్డ్‌మైన్స్ అంటే గుర్తుకొచ్చేది కేజీఎ్‌ఫ..కోలార్ గోల్డ్ మైన్స్. అయితే, అది నిన్నటి మాట. జొన్నగిరి గోల్డ్ మైన్స్ అనేది ఇప్పటి మాట. ప్రైవేటు రంగంలో స్వాతంత్ర్యానికి పూర్వం ఏర్పాటుచేసిన కేజీఎఫ్ ప్రస్తుతం ఉనికిలో లేదు. 2000 తర్వాత కేజీఎ్‌ఫలో కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో దేశంలోనే రెండో అతి పెద్ద గోల్డ్ మైన్స్‌గా ‘జొన్నగిరి’ నిలవనుంది. స్వేచ్ఛాభారతంలో నెలకొల్పిన తొలి ప్రైవేటు మైన్స్ కూడా ఇవే కావడం విశేషం. కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలోని జొన్నగిరి వద్ద దాదాపు రూ.400 కోట్లు పెట్టుబడి...వెయ్యి కిలోల బంగారం ఉత్పత్తి సామర్థ్యంతో ‘జొన్న గిరి బంగారు శుద్ధి పరిశ్రమ’ సిద్ధమవుతోంది. వచ్చే నెలలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభించేందుకు నిర్వాహకులు సిద్ధమవుతున్నారు. డెక్కన్, త్రివేణి కంపెనీలతో కలసి జియో మైసూర్ కంపెనీ ఈ ప్రాజెక్టు పనులను దాదాపుగా పూర్తిచేసింది. ప్రస్తుతం ఏటా సుమారు ఎనిమిది టన్నులకు పైగా బంగారాన్ని దిగుమతి చేసుకుంటున్నాం. ‘జొన్నగిరి’ అందుబాటులోకి వస్తే ఖనిజ రంగంలో ఆత్మనిర్భర్ భారత్ దార్శనికతకు బలం చేకూరుతుందని ఖనిజ రంగ నిపుణులు అంటున్నారు.
జొన్నగిరికి మహర్దశ ఇలా..
జొన్నగిరి గోల్డ్‌మైన్ కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరి, ఎర్రగుడి, పగిడిరాయి తదితర గ్రామాల్లో దాదాపు 598 హెక్టార్లలో విస్తరించి ఉంది. త్రివేణి ఎర్త్‌మూవర్స్ అండ్ ఇన్‌ఫ్రా, డెక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ సంస్థల భాగస్వామ్యంతో జియో మైసూర్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేసింది. మూడు దశాబ్దాల క్రితమే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా జొన్నగిరి, పగడిరాయి గ్రామాల్లో అన్వేషణ సాగించింది. ఈ ప్రాంతంలో బంగారు నిక్షేపాలు ఉన్నాయని గుర్తించింది. ఆ నిక్షేపాలు వెలికితీసి శుద్ధిచేసి బంగారు ఉత్పత్తి చేయడం ఎక్కువ ఖర్చుతో కూడిన పని అని భావించి అప్ప ట్లో విరమించుకుంది. ఆ తరువాత 2005లో జియో మైసూర్ సంస్థ రంగంలోకి దిగింది. క్షేత్రస్థాయిలో పరిశోధనలు చేసింది. జొన్నగిరి, పగడిరాయి, ఎర్రగుడి, బొల్లవా నిపల్లె గ్రామాల్లో 1,500 ఎకరాల్లో (598 హెక్టార్లు) బంగారు నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ భూములను ఏడాదికి ఎకరాకు రూ.18 వేలు లీజు చెల్లించేలా ఒప్పందం చేసుకుని రైతుల నుంచి తీసుకున్నారు. వెయ్యి కిలోల శుద్ధి చేసిన బంగారు ఉత్పత్తి లక్ష్యంగా ఈ ప్రాజెక్టు స్థాపించేందుకు 2023లో కేంద్రం అనుమతులు ఇచ్చింది. పారిశ్రామిక ప్రోత్సాహకాలు, పర్యావరణ అనుమతులతో పాటు పసిడి శుద్ధి చేసేందుకు అవసరమైన నీరు హంద్రీనీవా కాలువ ద్వారా 0.021టీఎంసీలు వాడుకు నేందుకు కూటమి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. మొదట ప్రతి 20 మీటర్లకు ఒకచోట డ్రిల్లింగ్ చేసి బంగారు నాణ్యత, ఉత్పత్తి పరిమాణం, లాభనష్టాలపై జరిపిన అఽధ్యయనం ఉత్తమ ఫలితాలు ఇచ్చింది. ఈ క్రమంలోనే ‘జొన్నగిరి గోల్డ్ మైనింగ్, ప్రాసెసెంగ్ యూనిట్ ఏర్పాటుకు జియో మైసూర్ సంస్థ శ్రీకారం చుట్టింది.
రాళ్ల సీమలో రత్నాలు
శ్రీకృష్ణ దేవరాయలు కాలంలో వీధుల్లో రత్నాలు రాసులుగా పోసి అమ్మేవారనేది చరిత్ర. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరితోపాటు పెరవళి, మద్దికెర; అనంతపురం జిల్లా వజ్రకరూరు ప్రాంతాల్లో ఇప్పటికీ వజ్రాలు లభిస్తున్నాయి. ఏటా తొలకరి వర్షాలకు పొలాల్లో వజ్రాలు బయటపడుతున్నాయి. దీంతో రాష్ట్రంలోని పలు జిల్లాలతోపాటు కర్ణాటకలోని బళ్లారి జిల్లా తదితర ప్రాంతాల నుంచీ వజ్రాల అన్వేషణ కోసం జొన్నగిరి, పగడిరాయి గ్రామాలకు వస్తుంటారు.
మట్టిని తవ్వి ‘పసిడి’ వెలికితీసి..
జొన్నగిరిలో ఓపెన్ మైనింగ్ ప్రాంతంలో భూమి పైభాగం నుంచి లోతుగా గుంతలు తవ్వుతారు. గోల్డ్ మైన్స్ నుంచి తీసిన పెద్దపెద్ద రాళ్లను క్రషింగ్ చేస్తారు. ఆ పొడిని రసాయనాలు కలిపిన నీటిలో ఉంచుతారు. రసాయనం రాళ్లలోని బంగారాన్ని తనలో కరిగించుకుంటుంది. దీనినే కార్బన్-ఇన్-లివ్ ప్రక్రియ అని పిలుస్తారు. ద్రావణంలో కరిగిన బంగారాన్ని వేరుచేసి, ముడి బంగారంగా మారుస్తారు. దానిని అధిక ఉష్ణోగ్రత వద్ద కరిగించి మలినాలను బయటకు తీసేస్తారు. ఆ తర్వాత బయటకు వచ్చిన 99.9 శాతం స్వచ్ఛమైన బంగారాన్ని గోల్డ్ బిస్కెట్లుగా తయారు చేస్తారు. వాటిని మార్కెట్‌లోకి పంపుతారు.
నాటి స్వర్ణగిరే నేటి జొన్నగిరి
మౌర్య సామ్రాట్ అశోకుడి రాజ్యానికి దక్షిణ ప్రాంత ప్రధాన కార్యాలయంగా జొన్నగిరి (అప్పట్లో స్వర్ణగిరి) ఉండేదని చరిత్రకారులు చెబుతున్నారు. అశోకుడి కాలం నాటి శిలాశాసనాలను జొన్నగిరి సమీపంలో పురావస్తు శాఖ గుర్తించింది. బంగారు నిక్షేపాలను వెలికి తీసేందుకే ఇక్కడ బావిని తవ్వి ఉండవచ్చని చరిత్రకారులు చెబుతుంటారు. చోళ, బ్రిటీష్ కాలాల్లో ఈ ప్రాంతంలో పసిడి అన్వేషణ జరిపినట్టు ప్రచారంలో ఉంది.
తొలి ప్రైవేట్ బంగారు గని..
కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ (కేజీఎఫ్) 2000లో మైనింగ్ కార్యకలాపాలను ఆపేసింది. ప్రభుత్వ రంగ సంస్థ హుట్టి గోల్డ్ మైన్స్ కార్యకలాపాలను కొనసాగిస్తూ, ఏడాదికి సుమారుగా 1.5 టన్నుల పసిడి ఉత్పత్తి చేస్తోంది. మనదేశం ఏటా విదేశాల నుంచి దాదాపుగా 800 టన్నులకు పైగా బంగారం దిగుమతి చేసుకుంటోంది. ఈ క్రమంలో జొన్నగిరిలో 13.1 టన్నులు-42.5 టన్నుల మేర బంగారం నిక్షేపాలు ఉన్నట్లు ధ్రువీకరించారు. వచ్చే 15 ఏళ్లలో ఏటా వెయ్యి కిలోల శుద్ధి చేసిన పసిడి ఉత్పత్తి చేయాలనే లక్ష్యంగా జియో మైసూర్, త్రివేణి, డెక్కన్ సంస్థలు ముందుకు సాగుతున్నాయి. ఈ క్రమంలోనే జొన్నగిరి ప్రాజెక్టును చేపట్టాయి. దాని నిర్మాణం 13 నెలల్లోనే దాదాపు పూర్తయింది.