నేడే ‘జొన్నగిరి గోల్డ్‌మైన్ ప్రాజెక్టు’ ప్రారంభం
ABN , Publish Date - Jun 24 , 2026 | 04:48 AM
కరువు, వలసలకు నిలయమైన రాయలసీమ ఇక బంగారు సీమగా మారనుంది. కరువు నేలలో పసిడి పంటలు పండనున్నాయి. ఇప్పటి వరకు గోల్డ్ మైన్ అంటే..
రూ.405 కోట్ల పెట్టుబడి.. 700 మందికి ఉపాధి
ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా కార్యక్రమం
రెండో యూనిట్‌కు శంకుస్థాపన.. రాత్రి జొన్నగిరిలోనే బస
జియో మైసూర్, డక్కన్ గోల్డ్‌మైన్స్ స్థాపన
తొలి ఏడాది 400 కిలోలు, రెండో ఏడాది 900 కిలోల ఉత్పత్తి
కర్నూలు, జూన్ 23(ఆంధ్రజ్యోతి): కరువు, వలసలకు నిలయమైన రాయలసీమ ఇక బంగారు సీమగా మారనుంది. కరువు నేలలో పసిడి పంటలు పండనున్నాయి. ఇప్పటి వరకు గోల్డ్ మైన్ అంటే.. గుర్తుకొచ్చే కర్ణాటక రాష్ట్రంలోని కోలాల్ గోల్డ్ ఫీల్డ్ (కేజీఎఫ్) స్థానంలో కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరి చేరనుంది. దేశంలోనే ప్రైవేట్ రంగంలో అతిపెద్ద గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టుగా ప్రసిద్ధి చెందనుంది. రూ.405 కోట్ల పెట్టుబడి, 1,500 ఎకరాల విస్తీర్ణంలో జియో మైసూర్ సర్వీసెస్, డెక్కన్ గోల్డ్ మైన్స్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ‘జొన్నగిరి గోల్డ్ మైన్ ప్రాజెక్టు’(జీజీఎంపీ)ను బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు. అలాగే పరిశ్రమ విస్తరణలో భాగంగా రెండో యూనిట్‌కు శంకుస్థాపన చేస్తారు. ఈ గోల్డ్ మైన్ ప్రాజెక్టు రాయలసీమకు ఎంతో ప్రతిష్ఠాత్మకం. తొలి దశలో 600 ఎకరాల్లో తవ్వకాలు చేస్తారు. వెలికితీసిన బంగారు ఖనిజాన్ని శుద్ధి చేసేందుకు అవసరమైన ప్రాసెసెంగ్ ప్లాంట్లు ఏర్పాటు చేశారు. రెండో దశలో మిగిలిన 900 ఎకరాల్లో విస్తరిస్తారు. ప్రస్తుత ప్లాంట్ ద్వారా తొలి ఏడాది 400 కిలోలు, రెండో ఏడాది 900 కిలోల బంగారు ఉత్పత్తి చేస్తారు. ఇలా ఉత్పత్తి పెంచుతూ ఏడాదికి రెండు టన్నుల పసిడి ఉత్పత్తి చేయనున్నారు. వెలికితీసిన బంగారం ధరపై నాలుగు శాతం రాయల్టీ రూపంలో ప్రభుత్వానికి ఆదాయం చేకూరుతుంది. 400 కిలోలకు రూ.57 కోట్లు, 900 కిలోలకు రూ.144 కోట్లు రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు ఆదాయం రానుంది. దాదాపు 700 మందికి ఉపాధి లభించనుంది. ఈ ప్రాజెక్టుకు అవసరమైన 0.021 టీఎంసీల నీటిని హంద్రీనీవా కాలువ ద్వారా ప్రభుత్వం కేటాయించింది. నీటి సరఫరా కోసం 18 కిలోమీటర్లు పైపులైన్ వేశారు. ఇప్పటికే గోల్డ్ మైన్ ట్రయల్‌రన్ పూర్తయింది.
చంద్రబాబు పర్యటన షెడ్యూల్
సీఎం చంద్రబాబు కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా ఉదయం 10 గంటలకు అమరావతి నుంచి బయలుదేరి 11:30 గంటలకు జొన్నగిరి చేరుకుంటారు. 11:45 గంటలకు మొదటి యూనిట్‌ను ప్రారంభిస్తారు. అనంతరం జీఈఓ మైసూర్ ప్లాంట్ రెండో యూనిట్‌కు శంకుస్థాపన చేస్తారు. 12:30 గంటలకు జొన్నగిరిలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. సాయంత్రం 3 గంటలకు పత్తికొండ నియోజకవర్గం టీడీపీ కార్యకర్తలతో సమావేశమవుతారు. రాత్రి జొన్నగిరిలోనే సీఎం బస చేస్తారు. కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి, ఎస్పీ విక్రాంత్ పాటిల్ పర్యవేక్షణలో సీఎం పర్యటన, బందోబస్తు ఏర్పాట్లను చేశారు.