మావిగన్‌కు ఏ బస్సెక్కాలి సార్?
ABN , Publish Date - Jul 08 , 2026 | 03:40 AM
‘మా రాజధాని మావిగన్’ అంటూ హడావుడి చేస్తున్న వైసీపీ నేతలకు ఓ జనసేన కార్యకర్త షాక్ ఇచ్చాడు. మావిగన్‌కు వెళ్లడానికి ఏ బస్సెక్కాలంటూ మాజీ మంత్రి జోగి రమేశ్‌కు..
జోగి రమేశ్‌కు జనసేన కార్యకర్త షాక్
రాజమండ్రిలో ఉన్నా.. ఏ బస్సో చెబితే ఎక్కుతా!
వైసీపీ మాజీ మంత్రికి ఫోన్ కంగుతిన్న జోగి
విజయవాడ, జూలై 7 (ఆంధ్రజ్యోతి): ‘మా రాజధాని మావిగన్’ అంటూ హడావుడి చేస్తున్న వైసీపీ నేతలకు ఓ జనసేన కార్యకర్త షాక్ ఇచ్చాడు. మావిగన్‌కు వెళ్లడానికి ఏ బస్సెక్కాలంటూ మాజీ మంత్రి జోగి రమేశ్‌కు ఆ కార్యకర్త ఫోన్ చేసి ఆరా తీశాడు. ‘బెంగాల్‌కు కోల్‌కతా, కర్ణాటకకు బెంగళూరు, ఒడిశాకు భువనేశ్వర్ బస్సులు ఉన్నాయి. మరి ఏ బస్సు మావిగన్‌కు వెళుతుంది?’’ అంటూ గోదావరి యాసలోని వెటకారం జోడించి గట్టిగానే నిలదీశాడు. ఎవరో కార్యకర్త చేశారనుకుని ఫోన్ ఎత్తిన జోగి రమేశ్.. ఆయన వేసిన ప్రశ్నలకు కంగుతిన్నారు. వీరిద్దరి ఆడియో వైరల్‌గా మారింది.
జోగి రమేశ్: హలో...
జనసేన కార్యకర్త: హలో జోగి రమేశ్ గారా..
జోగి రమేశ్: హలో .. ఎవరండీ ?
జనసేన కార్యకర్త: నమస్తే.. నేను రాజమండ్రి బస్టాండ్‌లో ఉన్నానండీ. మావిగన్‌కు వెళ్లాలంటే ఏ బస్సెక్కాలి సార్
జోగి రమేశ్: ఏ బస్సు కావాలి?
జనసేన కార్యకర్త: మావిగన్‌కు వెళ్లాలంటే ఏ బస్సు ఎక్కమంటారు? బెంగాల్ వెళ్లటానికి కలకత్తా బస్సు ఉంది. ఒడిశా వెళ్లటానికి భువనేశ్వర్ బస్సు ఉంది. కర్ణాటక వెళ్లడానికి బెంగళూరు బస్సు ఉంది. మరి మావిగన్ వెళ్లటానికి ఏ బస్సెక్కాలి సార్.
జోగి రమేశ్: మావిగన్‌లో ఏ ఊరు వెళ్లాలి? మూడు ఊర్లు ఉన్నాయి.
జనసేన కార్యకర్త: అదెలాగ కుదురుతుంది సార్. మావిగన్‌కు ఒక బస్సు ఎక్కాలి కదా!
జోగి రమేశ్: ఏ బస్సు పెడతామో, దానిని తర్వాత ఎక్కుదువులే. ఇప్పుడెందుకు బాసూ..
జనసేన కార్యకర్త: ఇప్పుడు వద్దంటారా ?
జోగి రమేశ్: మేం పెట్టిన తర్వాత ఎక్కుదువుగానీలే... ఇప్పుడెందుకు?
జనసేన కార్యకర్త: ఏ రాష్ట్ర రాజధానికైనా ఒక బస్సు ఉంటుంది. మావిగన్ బస్సేమిటి?
జోగి రమేశ్: మేం పెట్టిన తర్వాత ఎక్కుదువ గానీలే...
జనసేన కార్యకర్త: ఎప్పుడు చెబుతారు సార్.
జోగి రమేశ్: ఇప్పుడు మేం లేం (అధికారం లో) కదా.... మేమొచ్చాక చెబుతాంలే..
జనసేన కార్యకర్త: తర్వాత చెబుతారా సార్.. నమస్తే సార్...