లోకేశ్‌ను పిచ్చికుక్కను కొట్టినట్టు కొట్టిస్తా
ABN , Publish Date - Feb 02 , 2026 | 04:19 AM
చంద్రబాబు ఫేక్ ముఖ్యమంత్రి. చేతగాని ముఖ్యమంత్రి ఎందుకు?. రాజీనామా చేసి దొబ్బేయచ్చు కదా?. పాలన చేతకాకుంటే నోరుమూసుకుని కూర్చోవాలి అంటూ మాజీ మంత్రి జోగి రమేశ్ నోరు పారేసుకున్నారు.
మళ్లీ నోరు పారేసుకున్న జోగి
తిరుపతి, ఫిబ్రవరి 1(ఆంధ్రజ్యోతి): ‘‘చంద్రబాబు ఫేక్ ముఖ్యమంత్రి. చేతగాని ముఖ్యమంత్రి ఎందుకు?. రాజీనామా చేసి దొబ్బేయచ్చు కదా?. పాలన చేతకాకుంటే నోరుమూసుకుని కూర్చోవాలి’’ అంటూ మాజీ మంత్రి జోగి రమేశ్ నోరు పారేసుకున్నారు. ఆదివారం సాయంత్రం తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంటలోని చెవిరెడ్డి నివాసంలో మీడియాతో మాట్లాడారు. తన నివాసంపై దాడి పట్ల ఆగ్రహంతో ఊగిపోయారు. మంత్రి లోకేశ్ పిచ్చిపిచ్చి చేష్టలు మానుకోకుంటే పిచ్చికుక్కను కొట్టినట్టు కొట్టిస్తా.. అంటూ చెలరేగిపోయారు. చంద్రబాబు, లోకేశ్‌ల రాక్షసానందం కోసమే ఇబ్రహీంపట్నంలోని తన నివాసంపై దాడి చేయించారంటూ ఆరోపించారు. ‘‘ఫేక్ కేసులో నన్ను, నా తమ్ముడిని, నా కుమారుడిని అన్యాయంగా ఇరికించి జైల్లో పెట్టి రాక్షసానందం పొందారు. అది చాలక పెట్రోలు బాంబులు వేసి నాకుటుంబాన్ని హతమార్చాలని చూస్తారా?.’’ అని ప్రశ్నించారు. అంతేకాదు, ‘‘లోకేశ్‌కు చెబుతున్నా.. నా ఇంటికి నీ ఇల్లు ఎంత దూరమో.. నీ ఇంటికి నా ఇల్లు కూడా అంతే దూరం. ఇవాళ సంబరపడుతున్నావేమో. మీరు చేసిన దుర్మార్గానికి భయపడతానని అనుకుంటున్నారేమో.. చూస్తా.’’ అంటూ హెచ్చరించారు. చంద్రబాబు రాజకీయ జీవితమే ఫేక్ అని పదేపదే అనుచిత వ్యాఖ్యలు చేశారు.