రోత మాటలపై రగిలిన అగ్గి!
ABN , Publish Date - Feb 02 , 2026 | 04:07 AM
వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్.. శనివారం మంత్రి లోకేశ్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.
బాబు, లోకేశ్‌పై జోగి దుర్భాషలు
భగ్గుమన్న టీడీపీ శ్రేణులు
రమేశ్ ఇంటిపై రాళ్లతో దాడి
పెట్రోలు సీసా విసిరి నిప్పు
పగిలిన మొదటి అంతస్తు అద్దాలు
మాజీ మంత్రిపై కేసు నమోదు
అయినా తీరు మార్చుకోని జోగి
ఈసారి సీఎంపై ‘ఫేక్’ వ్యాఖ్యలు
విజయవాడ/ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 1(ఆంధ్రజ్యోతి): వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్.. శనివారం మంత్రి లోకేశ్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ‘‘లోకేశ్‌కు ఒళ్లు తగ్గింది కాబట్టి కొవ్వు తగ్గించుకున్నాడనుకున్నా. వాడికి చిప్ దొబ్బింది. సన్నాసి వెధవల్లారా... ఏందిరా ఇది’’ అంటూ దుర్భాషలాడారు. ఈ వ్యాఖ్యలపై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నంలో ఉన్న ఆయన ఇంటిపై ఆదివారం సాయంత్రం మూకుమ్మడిగా దాడి చేశారు. నిమిషాల వ్యవధిలో ఇబ్రహీంపట్నం, మైలవరం, జి.కొండూరు, విజయవాడ ప్రాంతాలకు చెందిన టీడీపీ శ్రేణులు సమావేశమై ఇబ్రహీంపట్నంలోని ఫెర్రీ ఘాట్ వీధిలో ఉన్న జోగి ఇంటిని చుట్టుముట్టారు. కర్రలు, రాళ్లతో దాడి చేశారు. రాళ్ల దాడిలో మొదటి అంతస్తు కారిడార్ అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఇంటి బయట ఉన్న ‘జోగి శకుంతల నిలయం’ అని రాసి ఉన్న అక్షరాలను పీకి పడేశారు. పెట్రోలు ఉన్న సీసాకు నిప్పంటించి మొదటి అంతస్తు బాల్కనీలోకి విసరడంతో మంటలు చెలరేగాయి. రెండు ఫైబర్ కుర్చీలు తగలబడ్డాయి. దిగువ ఫ్లోర్‌లో ఉన్న వైసీపీ కార్యకర్తలు, పోలీసులు మంటలను ఆర్పారు. జోగి కార్యాలయంపై దాడి జరిగిన ఘటన తెలియటంతో వైసీపీ శ్రేణులు కూడా భారీగా తరలి వచ్చారు.
అప్పటికే పోలీసులు టీడీపీ శ్రేణులను చెల్లాచెదురు చేశారు. ఆ సమయంలో టీడీపీ శ్రేణులు లేకపోవటంతో ఘర్షణ తప్పింది. దాడి జరిగిన సమయంలో జోగి రమేశ్ కుటుంబ సభ్యులు ఇంట్లో లేరు. ములకలచెరువు కేసులో తంబళ్లపల్లె కోర్టులో సోమవారం వాయిదాకు హాజరయ్యేందుకు జోగి అక్కడికి వెళ్లారు. ఆయన సతీమణి శకుంతల, కుమారుడు రాజీవ్ బయటకు వెళ్లారు. దాడి జరిగాక తల్లి, కుమారుడు ఇంటికి చేరుకున్నారు. ఘటన గురించి సమాచారం తెలియగానే పోలీసులు జోగి రమేశ్ ఇంటికి చేరుకున్నారు. ఆందోళనకారులను అక్కడి నుంచి చెదరగొట్టారు. ఘటనాస్థలాన్ని డీసీపీ కేజీవీ సరిత, ఏడీసీపీ రామకృష్ణ పరిశీలించారు. జోగి కుటుంబ సభ్యులను వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాసు తదితరులు పరామర్శించారు. ఎన్టీఆర్ జిల్లా కమిటీ అధ్యక్షుడు దేవినేని అవినాశ్, మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు తదితరులు జోగి రమేశ్ ఇంటికి వెళ్తుండగా పశ్చిమ ఇబ్రహీంపట్నం వద్ద పోలీసులు వారిని అడ్డుకుని భవానీపురం పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
జోగి రమేశ్‌పై కేసు నమోదు
మాజీ మంత్రి జోగి రమేశ్‌పై ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంతోనే ఇంత రాద్ధాంతం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. దీనిపై సుమోటో కేసు నమోదు చేశారు. అదే సమయంలో రమేశ్‌పై ఇంటి దాడి చేసిన ఆందోళనకారులపైనా కేసులు నమోదు చేయనున్నట్టు తెలిసింది. ఈ దాడుల్లో పాల్గొన్న వారిని గుర్తించేందుకు ఇబ్రహీంపట్నం రింగ్ నుంచి ఫెర్రీ వరకు ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు.
పదేపదే అదే తీరు...
నకిలీ మద్యం తయారీ కేసులో జోగి రమేశ్, ఆయన సోదరుడు రాము గత నెల 23న విజయవాడ జిల్లా జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యారు. ఆ సమయంలో జైలు ముందే రమేశ్ మీడియాతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌పై నోరుపారేసుకున్నారు. శనివారం టీటీడీకి సరఫరా అయిన నెయ్యిలో కల్తీ లేదంటూ.. వైసీపీ ఇచ్చిన నిరసన పిలుపులో భాగంగా ఇబ్రహీంపట్నంలోని ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు చేశారు. అనంతరం బయటకు వచ్చి మళ్లీ లోకేశ్‌ను తిట్టిపోశారు. తాను జైలు విడుదలైన తర్వాత పరామర్శించేందుకు ఇబ్రహీంపట్నం వచ్చిన నేతలందరితోనూ... చంద్రబాబు, లోకేశ్‌తోపాటు కూటమి ప్రభుత్వంపై ఆయన విమర్శలు చేయించారు. కొన్ని రోజులుగా జోగి తీరును పరిశీలిస్తున్న తెలుగు తమ్ముళ్లు ఆగ్రహంతో ఊగిపోతున్నారు.